లక్ష చెట్ల రింగురోడ్డు 

Regional Ring Road Plans To Plant 1 Lakh Trees On Side - Sakshi

నిర్మాణంలో భారీగా వృక్ష సంపదను కోల్పోతుండటంతో పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ 

ఇరువైపులా కిలోమీటర్‌కు 600 చెట్ల చొప్పున పెంచాలని నిర్ణయం 

రోడ్డు మధ్యలోని సెంట్రల్‌ మీడియన్‌లో పూల మొక్కలు 

సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా నిర్మించబోతున్న రీజినల్‌ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌), దాని పరిసరాలను హరితమయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం కేంద్రం అనుమతించిన ఉత్తర భాగంలో 158 కిలోమీటర్ల పొడవునా లక్ష చెట్లు పెంచాలని అధికారులు నిర్ణయించారు.

రోడ్డుకు రెండు వైపులా మూడు వరుసల్లో.. మొత్తంగా ఒక్కో కిలోమీటర్‌కు 600 మొక్కల చొప్పున నాటేలా ప్రణాళిక సిద్ధం చేశారు. రీజనల్‌ రింగ్‌రోడ్డు, ఇతర రాష్ట్ర, జాతీయ రహదారులు కలిసే ఎనిమిది చోట్ల నిర్మించే భారీ ఇంటర్‌ ఛేంజర్ల వద్ద చెట్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉండనుంది. 

భారీగా వృక్ష సంపద కోల్పోతుండటంతో.. 
రీజనల్‌ రింగ్‌ రోడ్డును భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎనిమిది వరుసలకు సరిపడా భూసేకరణ చేయనున్నారు. అందులో ప్రస్తుతానికి నాలుగు వరుసలతో రోడ్డు నిర్మిస్తారు, వాహనాల సంఖ్య పెరిగే క్రమంలో ఎనిమిది లేన్లకు విస్తరిస్తారు. మొత్తంగా రోడ్డుతోపాటు విద్యుత్‌ స్తంభాలు, చెట్ల పెంపకం, అవసరమైన చోట ట్రక్‌ వే సైడ్‌ పార్కింగ్, డ్రైనేజీ.. ఇలా ఇతర అవసరాలకు కలిపి 100 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేసి చదును చేసి పెడతారు.

ఈ క్రమంలో భారీగా వృక్ష సంపదకు నష్టం జరగనుంది. అదే సమయంలో రోడ్డు వెంట భూముల్లో వ్యవసాయం స్థానంలో వాణిజ్య కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉంది. వీటన్నింటితో పర్యావరణానికి దెబ్బపడే నేపథ్యంలో.. రీజినల్‌ రింగురోడ్డు పొడవునా భారీగా చెట్లు పెంచేందుకు ప్రణాళిక వేస్తున్నారు. 

మొక్కలు నాటేదిలా.. 
వంద మీటర్ల వెడల్పుతో భూమిని చదును చేశాక.. రెండు చివరల్లో 3 మీటర్ల చొప్పున 6 మీటర్ల స్థలాన్ని మొక్కలు నాటేందుకు కేటాయించారు. ఒక్కోవైపు మీటరు చొప్పున దూరంతో మూడు వరుసల్లో మొక్కలు నాటుతారు. రోడ్డు వైపు ఉండే వరుసలో తక్కువ వెడల్పుతో విస్తరించే చెట్లను, మధ్యలో సాధారణమైనవి, చివరిగా ఏపుగా పెరిగే పెద్ద చెట్లను పెంచుతారు. ఇలా రోడ్డుకు రెండు వైపులా, ఇంటర్‌ ఛేంజర్లతో కలుపుకొంటే మొత్తం చెట్ల సంఖ్య లక్షకుపైగా ఉండనుంది. 

ప్రస్తుతం రోడ్డు మధ్యలో 20 మీటర్ల వెడల్పుతో సెంట్రల్‌ మీడియన్‌ ఉండనుంది. అందులో ఆరు వరుసలతో వివిధ జాతుల పూల మొక్కలు నాటనున్నారు. భవిష్యత్తులో రోడ్డును ఎనిమిది లేన్లకు విస్తరిస్తే.. సెంట్రల్‌ మీడియన్‌ స్థలం ఐదు మీటర్లకు పరిమితమవుతుంది. అప్పుడు పూల చెట్ల వరుసలు తగ్గుతాయి. 

గతంలో పెద్ద రహదారులకు ఇరువైపులా రోడ్డుపైకి అల్లుకునేలా రావి, మర్రి, వేప, మామిడి, చింత వంటి భారీ చెట్లు కనిపించేవి. రీజినల్‌ రింగురోడ్డును ఎక్స్‌ప్రెస్‌వేగా నిర్మిస్తున్నందున.. వాహనాలకు ఇబ్బంది రాకుండా తక్కువ కొమ్మలతో ఎత్తుగా పెరిగే జాతులనే ఎంపిక చేస్తున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top