హైదరాబాద్, ఏప్రిల్ 4, 2026: రెండు నెలల శిశువుకు అరుదైన గుండె సమస్యకు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్స చేసి పునర్జన్మ ప్రసాధించారు కిమ్స్ కడల్స్ కొండాపూర్ వైద్యులు. ఖమ్మం జిల్లాకు చెందిన ఈ శిశువు రెండు నెలల వయస్సులో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, గుండె వైఫల్య లక్షణాలతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరీక్షల్లో గుండెలో రంధ్రం ఉందని తేలింది. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డా. సుదీప్ వర్మ నిర్వహించిన ఎకోకార్డియోగ్రామ్‌లో ఏఆర్ సిఏపిఏ, అంటే సాధారణంగా గుండెకు శుభ్రమైన రక్తాన్ని అందించే రక్తనాళం (కొరోనరీ ఆర్టరీ) ఒక ప్రత్యేక మార్గం (ఏఓర్టా) నుంచి రావాలి. కానీ ఈ చిన్నారిలో అది తప్పుగా ఊపిరితిత్తులకు వెళ్లే రక్తనాళం (పల్మనరీ ఆర్టరీ) నుంచి వస్తోంది. తరువాత ఏఓర్టోగ్రామ్ ద్వారా దీనిని నిర్ధారించారు. అనంతరం చిన్నారికి ఓపెన్ హార్ట్ సర్జరీ చేశామని వైద్యులు తెలిపారు.
శస్త్రచికిత్సలో భాగంగా, రైట్ కొరోనరీ ఆర్టరీని పల్మనరీ ఆర్టరీ నుండి వేరు చేసి, ప్రత్యేక “హుడ్” టెక్నిక్ సహాయంతో ఏఓర్టాకు అనుసంధానం చేశారు. దీంతో గుండెకు సరైన ఆక్సిజన్‌తో కూడిన రక్త ప్రవాహం పునరుద్ధరించబడింది. శస్త్రచికిత్స అనంతరం రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు లో కావాల్సిన మందులు అందించామనీ, అపరేషన్ తరువాత శిశువును నీయోనేటల్ ఐసీయూలో ఉంచి వెంటిలేటర్ సపోర్ట్, ఇనోట్రోప్స్ సహాయం, అవసరమైన చోట పెరిటోనియల్ డయాలిసిస్ వంటి చికిత్సలు అందించారు.
ఇంత చిన్న వయస్సు ఉన్న శిశువులపై గుండె శస్త్రచికిత్స చేయడం సవాలుతో కూడుకున్నదని. రక్తనాళాలు చాలా చిన్నగా ఉండటం, శరీర సామర్థ్యం పరిమితంగా ఉండటం, శస్త్రచికిత్స సమయంలో రక్త ప్రసరణ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి అంశాలు కష్టతరమనీ, కానీ అన్ని సవాళ్లను అధిగమిస్తూ ఈ శస్త్రచికిత్స విజయవంతమై, ప్రస్తుతం శిశువు ఆరోగ్యంగా ఉండి నీయోనేటల్ ఐసీయూ నుండి డిశ్చార్జ్ చేశామని వెల్లడించారు. ఈ శస్త్రచికిత్సలో సీనియర్ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. అనిల్, కార్డియాక్ అనస్థీషియాలజిస్ట్ డా. నాగరాజన్, డా. సి. అపర్ణ (క్లినికల్ డైరెక్టర్) నేతృత్వంలోని నీయోనటాలజీ బృందం డా. విశ్వనాథ్, డా. అమిత్, డా. ఇషిత, డా. రాజశేఖర్ పాల్గొన్నారు.
ఏఆర్ సిఏపిఏ అనేది చాలా అరుదైన గుండె లోపం (సుమారు 0.25% కేసుల్లో మాత్రమే కనిపిస్తుంది). ఇది తీవ్రమైన సందర్భాల్లో ఆకస్మిక శిశు మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. ఈ ఘటన ద్వారా పుట్టుకతో వచ్చే గుండె లోపాలను త్వరగా గుర్తించడం, సరైన సమయంలో చికిత్స అందించడం ఎంత ముఖ్యమో మరోసారి స్పష్టమైంది. ఆధునిక నీయోనటల్ కార్డియాక్ కేర్ సౌకర్యాలు అందుబాటులో ఉండటం వల్ల ఇలాంటి ప్రాణాపాయ పరిస్థితుల్లో చిన్నారుల ప్రాణాలు కాపాడవచ్చని డా. అపర్ణ తెలిపారు.


