
సాక్షి, కామారెడ్డి: జిల్లాలో మరో రెండు రోజులు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. భారీ వర్షాల నేపథ్యంలో రేపు, ఎల్లుండి(శుక్ర,శని) కలెక్టర్ సెలవు ప్రకటించారు. నిర్మల్ ఇంకా రెడ్ అలర్ట్‌లోనే ఉందని కలెక్టర్ అభినవ్ తెలిపారు. అత్యవసరం అయితే, తప్ప బయటకు రావొద్దన్నారు. పశువుల కాపరులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని.. నిర్మల్‌కు వరద ముప్పు పొంచి ఉందని తెలిపారు.

తెలంగాణ డీజీపీ జితేందర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకు వేల మందిని రెస్క్యూ చేశామని.. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సహాయంతో రెండు హెలికాప్టర్ల ద్వారా రెస్క్యూ చేసినట్లు వెల్లడించారు. 2 వేల మంది సిబ్బందితో ఎస్‌డీఆర్‌ఎఫ్‌ను ఏర్పాటు చేసి రెస్క్యూ ఆపరేషన్‌లో పెట్టామని తెలిపారు.

‘‘ఎన్డీఆర్‌ఎఫ్‌కు దీటుగా ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు పని చేస్తున్నాయని.. భారీ వర్షాలు కురుస్తున్నా.. ఎక్కడ కూడా ప్రాణాలు పోకుండా రెస్క్యూ చేస్తున్నామన్నారు. ఎస్డీఆర్‌ఎఫ్ గత ఏడాది నుంచి మంచి ఫలితాలను ఇస్తున్నాయి. అన్ని జిల్లాల ఎస్పీలకు ఆదేశాలిస్తూ నిరంతరం రివ్యూ చేస్తున్నాం. వర్షాకాలం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతేనే బయటకు రండి. ప్రజలు ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిది’’ అని డీజీపీ చెప్పారు.