
సాక్షి, హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండ కాసింది. అకస్మాత్తుగా భారీ వర్షం మొదలైంది. నగరంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్టలో వర్షం పడుతోంది. గచ్చిబౌలి, కొండాపూర్, షేక్‌పేటలో కుండపోత వర్షం కురిసింది.
తెలంగాణలో రాబోయే నాలుగు రోజుల పాటు ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్‌లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కొన్ని చోట్ల కుండపోత వర్షం కురిసింది. సెప్టెంబర్‌లో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు కావడంతో పాటు.. వర్షపాతం కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది.

రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని ఐఎండీ వెల్లడించింది. కామారెడ్డి, జనగామ, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, ఖమ్మం, కొమరం భీం అసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.