15 కొత్త రైల్వే లైన్లకు మోక్షం | Sakshi
Sakshi News home page

15 కొత్త రైల్వే లైన్లకు మోక్షం

Published Thu, Sep 7 2023 12:42 AM

Railway department preparing 15 new railway projects in Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 15 కొత్త రైల్వే ప్రాజెక్టులను నిర్మించేందుకు రైల్వే శాఖ సన్నద్ధమవుతోంది. 2,647 కి.మీ. నిడివితో నిర్మించే ఆ ప్రాజెక్టులకు రూ.50,848 కోట్లు వ్యయం కాను న్నట్టు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ప్రకటించింది. వీటితోపాటు రూ.32,695 కోట్లు వ్యయమయ్యే 2,588 కి.మీ. 11 డబ్లింగ్, ట్రిప్లింగ్‌ పనులకు కూడా ఫైనల్‌ లొకేషన్‌ సర్వే మంజూరైనట్టు వెల్లడించింది.

రీజినల్‌ రింగ్‌ రైల్, ఆదిలాబాద్‌–పటాన్‌చెరు, ఘ ట్కేసర్‌ – యాదాద్రి, తాండూరు–జహీరాబాద్, మ ణుగూరు – రామగుండం, ఉందానగర్‌ – జగ్గయ్య పేట, కరీంనగర్‌ – హసన్‌పర్తి, డోర్నకల్‌ – మిర్యా లగూడ, భూపాలపల్లి–కాజీపేట, పాండురంగాపు రం–మల్కన్‌గిరి, కొత్తగూడెం–కిరండోల్, బోధన్‌ – లాతూరు రోడ్‌ ప్రాజెక్టులకు సంబంధించి ఫైనల్‌ లొకేషన్‌ సర్వేలు మంజూరైనట్టు వెల్లడించింది. 

కీలకం.. రీజినల్‌ రింగ్‌ రైల్‌
నగరానికి 50 కి.మీ. నుంచి 70 కి.మీ. వెలుపల దాదాపు 338 కి.మీ. నిడివితో నిర్మించబోయే రీజినల్‌ రింగ్‌ రోడ్డు వెలుపల దానికి సమాంతరంగా రింగ్‌ రైల్‌ ప్రాజెక్టు రాబోతోంది. రూ.12,408 కోట్ల వ్యయంతో దాదాపు 564 కి.మీ. నిడివితో ఈ ప్రాజెక్టు ఉంటుందని రైల్వే ప్రకటించింది. వికా రాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట్, సిద్దిపేట, గజ్వేల్, యాదాద్రి–భువనగిరి, రామన్నపేట, చిట్యాల, షాద్‌నగర్, షాబాద్‌ తదితర పట్టణాలను అనుసంధానిస్తూ ఇది రూపొందనుంది.

అక్కన్న పేట, యాదాద్రి, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, మెదక్, సిద్దిపేట, గజ్వేల్‌ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న రైల్వే లైన్ల మీదుగా కొత్త లైన్లు నిర్మించనుండటం విశేషం. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌ నగర శివారు ప్రాంతాలకు మెరుగైన రవాణా వసతి కలగటంతోపాటు సరుకు రవాణా రైళ్లకు కూడా అడ్డంకులు లేని సాఫీ ప్రయాణానికి వెసులుబాటు కలుగుతుందని రైల్వే చెబుతోంది. 

ఇక 317 కి.మీ. నిడివితో రూ.5,706 కోట్లతో నిర్మితమయ్యే పటాన్‌చెరు (నాగులపల్లి) – ఆదిలా బాద్‌ ప్రాజెక్టు కూడా ఇందులో కీలకం కానుంది. ఇచ్చోడ, నేరేడుగొండ, ధానూరు, నిర్మల్, బాల్కొండ, ఆర్మూరు, బోధన్, రుద్రూరు, బాన్స్‌వాడ, నిజాంసాగర్, సంగారెడ్డి, పటాన్‌చెరు తదితర ప్రాంతాలకు రైల్వే లైన్‌ అందుబాటులోకి వచ్చినట్టు అవు తుంది. దీంతోపాటు హైదరాబాద్‌–ఢిల్లీ ప్రధాన లైన్‌తో వీటికి అనుసంధానం కూడా కలుగుతుంది. వ్యవసాయాధారిత ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున, ధాన్యం తరలింపునకు ప్రధాన రవాణా సాధనం అందుబాటులోకి వచ్చినట్టు కూడా అవుతుందని రైల్వే తెలిపింది.  

Advertisement
Advertisement