
వీధిలో తచ్చాడుతున్న పెంపుడు కుక్కను తీసుకెళ్లిన ఓ మహిళ
కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్న యజమాని
హైదరాబాద్: అప్పటి వరకు ఆ కుక్క పిల్ల ‘లక్కీ’ఇంట్లో సందడి చేసింది. యాజమాని ఉద్యోగానికి వెళ్లేందుకు తయారవుతుండగా అతడి వెంటే తిరిగింది. అతడిని గేటు వరకు సాగనంపి ఇంట్లోకి వెళ్లకుండా వీధిలో కాసేపు నిల్చుంది. వీధిలో అటు ఇటుగా తచ్చాడుతున్న ఆ కుక్క పిల్లను ఓ మహిళ తన వెంట తీసుకెళ్లింది. ఈ సంఘటన మంగళవారం కాచిగూడ పోలీసుస్టేషన్ పరిధిలోని నింబోలిఅడ్డా మోతీమార్కెట్ చోటు చేసుకుంది.
మోతీమార్కెట్‌లో నివసించే మహేందర్ ‘లక్కీ’అనే కుక్కను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. అతడు కార్యాలయానికి వెళ్లగా గేటు వద్దకు వచ్చిన కుక్కపిల్ల తిరిగి ఇంట్లోకి రాలేదు. ఎంత సేపటికీ అది రాకపోవడంతో కుటుంబ సభ్యులు బయటకు వచ్చి చూడగా అది కనిపించలేదు. జమాల్ బస్తీలోని కల్లు కంపౌండ్‌లోకి కుక్కపిల్లను తీసుకెళ్లినట్లు స్థానికులు వారికి తెలిపారు. వెంటనే వారు అక్కడికి వెళ్లి సీసీ ఫుటేజీని పరిశీలించగా ఓ మహిళ తీసుకొచి్చనట్లు గుర్తించారు. కుక్కపిల్లను ఎవరైన గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని వారు కోరారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశామని వారు తెలిపారు.