మౌనమే మారణ హోమం | Professor Haragopal with Sakshi on Tribal rights | Sakshi
Sakshi News home page

మౌనమే మారణ హోమం

May 9 2025 1:30 AM | Updated on May 9 2025 1:30 AM

Professor Haragopal with Sakshi on Tribal rights

కర్రిగుట్టల్లో నేల కూలింది ఎవరు?

బడికెళ్లిన బాలుడు బుల్లెట్‌ గాయాలతో వస్తున్నాడు 

నోరెత్తితే నక్సలిజం ముద్ర వేస్తున్నారు

దీనిపై సమాజ మౌనం ప్రమాదకరం 

గిరిజనుల హక్కులపై అందరూ స్పందించాలి 

అన్ని పక్షాలకు వాస్తవాలు చెబుతాం 

శాంతి చర్చల దిశగా కదిలిస్తాం 

‘సాక్షి’తో ప్రొఫెసర్‌ హరగోపాల్‌

సాక్షి, హైదరాబాద్‌: సమాజ మౌనం మారణహోమం సృష్టిస్తుంది.. పౌరులు అప్రమత్తంగా లేకపోతే మానవ హక్కులు హననం అవుతాయి.. కర్రిగుట్టల్లో తుపాకుల మోతను నక్సలిజం, పోలీసులకే పరిమితం చేయకూడదు.. దీని వెనుక దాగున్న వాస్తవాలను ప్రజలు తెలుసుకోవాలి.. సామాజికవేత్త ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఉద్వేగంగా చెప్పిన మాటలివి. 

నక్సలిజాన్ని నిర్మూలిస్తామని చెబుతున్న ప్రభుత్వాలు.. ముందుగా గిరిజన పల్లెల హక్కులను, అక్కడి ప్రజల ఆవేదనను అర్థం చేసుకోవాలని సూచించారు. తుపాకుల మోత ఆపేసి, శాంతి చర్చలు జరపడం మానవీయ కోణంగా పేర్కొంటున్న హరగోపాల్‌.. ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 

వణికిపోతున్న గిరిజనం
కాల్పులు జరిగిన కర్రిగుట్టే కాదు. గిరిజనం ఉండే పల్లెలకు వెళ్లండి. అక్కడి పరిస్థితులు చూడండి. భయం, అభద్రత, ఆందోళన, ప్రతి ఒక్కరి కళ్లలో కన్పించేది ఇదే. స్కూలుకెళ్లిన పిల్లలు బుల్లెట్‌ గాయాలతో వస్తున్నారు. కాలకృత్యాలకు వెళ్లిన వృద్ధులు, మహిళలు తుపాకీ శబ్దాలతో వణికిపోతున్నారు. పొలం పనులకు వెళ్లాలన్నా సాహసించడం లేదు. 

అసలు మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? స్వేచ్ఛగా జీవిస్తున్నామా? అమాయక గిరిజనులు అంత హాని చేసేవాళ్లా? ఒకసారి ప్రభుత్వాలు వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లవు? కర్రిగుట్టల్లో భారీగా నక్సల్స్‌ను చంపామంటున్నారు. ఇది నిజమైతే శవాలు చూపించాలిగా? సామాజిక మాధ్యమం ఇంతగా పెరిగినా నిజాలు బయటకు రావా? 

సమస్య మూలాలు గుర్తించరేం? 
హక్కుల పేరెత్తితే నక్సలైట్‌ అంటున్నారు. రూల్స్‌ లేవనెత్తితే ద్రోహిగా చిత్రీకరిస్తున్నారు. కబ్జాదారులే పాలకులైన నేటి రాజకీయాలు పేదవాడికి పెనుశాపంగా మారుతున్నాయి. నక్సలిజాన్ని అంతం చేస్తామంటున్నారు. అసలీ సమస్య ఇప్పుడు పుట్టింది కా దు. 200 ఏళ్ల నుంచి ఉంది. సమస్యకు మూలాలు ఎక్కడో గుర్తించకుండా అంతం చేస్తామనే ప్రకటన లు ఎంతవరకు సరైనవి? ఇక్కడో విషయాన్ని మరిచి పోకూడదు. ఆదివాసీ గిరిజనులంతా నక్సలైట్లు కా దు. వాళ్ల హక్కులను కాపాడుకునేందుకు మాత్రమే గొంతు ఎత్తుతున్నారు. 

ఈ సమస్యను మానవీయ కోణంలో చూడాలి. ప్లానింగ్‌ కమిషన్‌లో పనిచేసిన యుగంధర్‌ 2004లో గిరిజన సమస్యలపై అధ్యయ నం చేశారు. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. సమస్య లను పరిష్కరించే మార్గాలు చెప్పారు. కానీ ఇవేవీ ఆ చరణకు నోచుకోలేదు. భారత రాజ్యాంగం ఆదివాసీలకు ఇచ్చిన హక్కుల మాటేంటి? వాటిని అమలు చే స్తామని పదేపదే చెప్పే ప్రభుత్వాలు చేస్తున్నదేమిటి?  

గనుల కోసమే ఈ యుద్ధం
భారతదేశంలోని గిరిజన ప్రాంతాల్లో నక్సలిజం పేరుతో హింస జరగడానికి కారణం మైనింగ్‌. అక్కడి గనులను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో ఆదివాసీల హక్కులను హరిస్తున్నాయి. గనుల పేరుతో ఆదివాసీ గ్రామాలను ఖాళీ చేయించాలని చూస్తున్నాయి. దీనికి అభివృద్ధి అని కొత్త పేరు పెడుతున్నాయి. నిజంగా అభివృద్ధి చేయాలంటే మార్గం ఇదా? గనుల తవ్వకాన్ని ఎన్‌ఎమ్‌డీసీకి అప్పగించవచ్చు కదా? కార్పొరేట్‌ సంస్థలకే ఎందుకు కట్టబెడుతున్నారు? ఎన్‌ఎమ్‌డీసీకి ఇస్తే అక్కడ ఉద్యోగ కల్పన జరుగుతుంది. 

గిరిజనుల పునరావాసానికి మార్గం ఏర్పడుతుంది. ఈ దిశగా ప్రభుత్వాలు ఎందుకు ఆలోచించడం లేదు? మైనింగ్‌ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. జాతీయ ప్రతిపక్ష పార్టీలకూ నక్సలిజంతో సంబంధాలున్నాయని ప్రచారం చేయడంలో అర్థమేంటి? దీన్నిబట్టే పాలకులు ఎంతగా తెగించారో అర్థం చేసుకోవచ్చు.

శాంతి చర్చలే పరిష్కారం
ముందుగా గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలను ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. నక్సల్స్‌తో శాంతి చర్చలు జరపాలి. కాల్పులను ఇరు పక్షాలు నిలిపివేయాలి. గిరిజన హక్కుల హననం మానుకోవాలి. చంపుకుంటూ పోతే సమస్య ఎంతమాత్రం పరిష్కారం కాదు. శాంతి దిశగా కృషి చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. మేధావులు, చదువుకున్నవాళ్లు మౌనంగా ఉంటే సమాజానికే నష్టం. భావి తరాలకు ముప్పు వాటిల్లుతుంది. 

సామాజిక మాధ్యమాలు పెరిగిన ఈ తరుణంలో వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పేలా ప్రతి ఒక్కరూ స్పందించాలి. సమాజ శాంతి దిశగా అందరూ అడుగులేయాలి. ప్రభుత్వాలు తెరవెనుక కుట్ర విధానాలను పక్కనబెట్టాలి. మానవీయ కోణంలో నక్సల్స్‌ సమస్యను చూడాలి. దీనిని గిరిజన పల్లెల హక్కుల కోణంలో ఆలోచించాలి. అప్పుడే శాంతి సాధ్యమవుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement