
సాక్షి, హైదరాబాద్: ప్రమాదవశాత్తు బాత్‌రూమ్‌లో జారిపడి గాయపడిన ఓ గర్భిణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ రామలక్ష్మణ రాజు తెలిపిన మేరకు.. తిలక్‌నగర్ ప్రాంతానికి చెందిన హేమంత్ ప్రైవేట్ ఉద్యోగి. ఆయన భార్య కల్పన (28) ఆరు నెలల గర్భవతి. సీమంతం నిమిత్తం ఆమెను స్థానికంగా ఉండే సంజీవయ్యనగర్ లోని పుట్టింటికి 15 రోజుల క్రితం అతను పంపాడు.
గురువారం ఉదయం ఆమె బాత్‌రూమ్‌లో జారిపడింది. గాయాలపాలైన ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఫిట్స్, గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.