హైదరాబాద్: పోలీసులంటేనే నిత్యం ఏదో ఒక ఒత్తిడి, బందోబస్తు, కేసులు, గొడవలు, కొట్లాటలు ఒక్కోసారి వ్యక్తిగత జీవితానికి కూడా సరిగ్గా సమయం ఇవ్వలేని విధులు..కానీ తనకున్న కళతో ఓ అధికారి ఒక వైపు విధులను సక్రమంగా నిర్వహిస్తూనే మరో వైపు సమాజంలో యువతను, పౌరుల్లో స్ఫూర్తి నింపుతూ ముందుకుసాగుతున్నాడు. రాంగోపాల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న బోడసింగి సురేష్ కుమార్ దేశ భక్తిగీతాలు ఆలపించడంతో పాటు సమాజంలో జరుగుతున్న పలు నిజ జీవిత ఘటనలపై పాటలు పాడుతూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. 2007 బ్యాచ్‌కు చెందిన సురేష్ గతంలో పని చేసిన జిల్లాలో సైతం ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఏదో ఒక ప్రాంతంలో యువతను, స్థానికంగా ఉండే ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు.
పాటే ఆయుధంగా..
మంచిని పెంచడానికి, పది మందిలో స్ఫూర్తిని నింపి మంచి మార్గంలో నడిపించేందుకు పాట ఒక ఆయుధంగా పని చేస్తుందనే విషయాన్ని తాను నమ్ముతానని సురేష్‌కుమార్ చెబుతున్నారు. ఇప్పటి వరకు సురేష్‌కుమార్ సమాజాన్ని మేల్కొల్పేందుకు రచించిన జై భారత్ జెండా, షీ టీమ్స్ వల్ల అమ్మాయిలకు ఎటువంటి రక్షణ లభిస్తుందో తెలియజేసే పాట, పల్లెను వదిలి పటానికి రాలేని ఓ పల్లెటూరి వ్యక్తి బాధ, అడవుల వల్ల కలిగే ప్రయోజనాలు, అడవుల పరిరక్షణకు ఓ పాట, తండ్రి ప్రాముఖ్యం, పిల్లల కోసం తండ్రి చేసే త్యాగాలు, తండ్రి కష్టాన్ని తెలియజేసేలా రచించిన పాట ఇలా ఎన్నో రకాల పాటలను పాడి ఆకట్టుకున్నారు.
ఏదైనా విషయాన్ని పాట రూపంలో చెప్తే అందరూ అటెన్షన్‌లోకి వస్తారని అందులోనూ ఖాకీ యూనిఫాం ధరించి తాను పాట పాడుతుంటూ అంతా ఆసక్తిగా చూడడంతో పాటు పాట భావాన్ని అర్థం చేసుకొని మంచి మాటలు వినేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. కరోనా సమయంలో కూడా భయపడొద్దని, ఎలా ఉండాలో చెప్పేందుకు ప్రత్యేకంగా ఓ సాంగ్‌ను తయారు చేయించి మరీ పాడారు.
పాట రూపంలో చెప్తే అందరూ వింటారు
చదువుకునే రోజుల నుంచే నాకు పాటలంటే ఇష్టం. పోలీస్ ఉద్యోగం వచ్చినా పాడే అలవాటును మాత్రం వదులుకోలేదు. శాంతి భద్రతల పరిరక్షణతో ఓ వైపు కృషి చేస్తూనే మరో వైపు సమాజంలో మంచిని పెంచేందుకు పాటల రూపంలో కృషి చేస్తూనే ఉన్నా. అక్షర జ్ఞానం లేని వారినే కాదు బాగా చదువుకున్న వాళ్లను కూడా సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యాన్ని తీసుకొని సైబర్ నేరగాళ్లతో అప్రమత్తంగా ఉండాలంటూ ఓ పాటను తయారు చేయించి పాడబోతున్నా. మా ఉన్నతాధికారులు కూడా నా ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
– బోడసింగి సురేష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ రాంగోపాల్‌పేట


