
వినియోగదారుడి నుంచి విక్రేతగా మారిన వైనం
గోవా నుంచి సరుకు తీసుకువచ్చి సిటీలో విక్రయం
నిందితుడిని అరెస్టు చేసిన హెచ్–న్యూ అధికారులు
మరో ఇరువురు నైజీరియన్ల డిపోర్టేషన్‌కు నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పని చేస్తూ ప్రేమలో విఫలమైన గాజులరామారం వాసి హర్షవర్ధన్ మాదకద్రవ్యాలకు బానిసగా మారాడు. పలుమార్లు డ్రగ్స్ ఖరీదు చేసిన ఇతగాడు ఆ దందాలో ఎంత లాభం ఉంటుందో తెలుసుకున్నాడు. దీంతో గోవా, ముంబైల్లో ఉన్న సప్లయర్స్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకుని డ్రగ్ పెడ్లర్‌గా మారాడు. ఇతడిని పట్టుకున్న హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు 10 గ్రాముల కొకైన్, 11 ఎక్స్‌టసీ పిల్స్ తదితరాలు స్వా«దీనం చేసుకున్నట్లు కొత్వాల్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు. డీసీపీ వైవీఎస్ సు«దీంద్ర, ఇన్‌స్పెక్టర్లు జీఎస్ డానియేల్, ఎస్.బాలస్వామిలతో కలిసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
అందమైన జీవితాన్ని ఊహించుకుని..
బీటెక్ పూర్తి చేసిన హర్ష ఓ యువతిని ప్రేమించాడు. ఆమెతో అందమైన జీవితాన్ని ఊహించుకుంటున్న క్రమంలో.. ఆ యువతి మరొకరిని వివాహం చేసుకోవడంతో భగ్న ప్రేమికుడయ్యాడు. ఆ బాధను మర్చిపోవడానికి మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. తొలినాళ్లల్లో ఓజీ డ్రగ్ వాడి ఆపై కొకైన్‌కు మారాడు. ఇలా ఇతగాడికి గోవా, బెంగళూరులకు చెందిన డ్రగ్ పెడ్లర్స్‌లో సంబంధాలు ఏర్పడ్డాయి. కొన్నాళ్లకు తానే పెడ్లర్‌గా మారాలని నిర్ణయించుకున్నాడు. ఆ రెండు నగరాల్లో ఉన్న వారితో సంబంధాలు కొనసాగించారు. వారి నుంచి కొకైన్, ఎక్స్‌టసీ తదితరాలు ఖరీదు చేసి బస్సులో లేదా కొరియర్ ద్వారా నగరానికి తెచ్చేవాడు. ఆపై ఇక్కడి కన్జూమర్లకు ఎక్కువ రేటుకు అమ్మి సొమ్ము చేసుకోవడం మొదలెట్టాడు.
వివరాలు ఇలా వెలుగులోకి..
హర్ష వ్యవహారాలపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ అతడిని పట్టుకుని సరుకు స్వా«దీనం చేసుకుంది. ఇతడి విచారణ నేపథ్యంలో నైజీరియా నుంచి వచి్చన అఫుల్ క్లెమెంట్, లాజరస్ చిన్వెన్మెరి నగరంలో అక్రమంగా ఉంటూ డ్రగ్స్ దందా
చేస్తున్నారు. వీరిద్దరినీ హెచ్–న్యూ పట్టుకున్న సందర్భంలో వారి వద్ద మాదకద్రవ్యాలు లభించకపోవడంతో ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ ద్వారా నైజీరియాకు డిపోర్టేషన్ చేయాలని నిర్ణయించారు.
విషపూరితం అనే విషయం చెప్పేలా..
మాదకద్రవ్యాలు మత్తు ఇచ్చినా ఇవి విషతుల్యమే. కొన్నాళ్లకు వినియోగదారుల శరీరాలను గుల్ల చేస్తాయి. ఈ నేపథ్యంలోనే వీటిని విక్రయించే పెడ్లర్స్ విష నాగులతో సమానమని చెప్పవచ్చు. ఇదే విషయాన్ని లాజరస్ టీ షర్ట్ స్పష్టం చేస్తోంది. అరెస్టు సమయంలో అతడు ధరించిన నల్లరంగు టీ షర్ట్‌పై ‘వెనెమస్.. బోర్న్ హైబ్రీడ్’ (విషపూరితమైన... పుట్టుకతోనే సంకరజాతి) అని రాసి ఉంది.