కొత్త పీజీ వైద్య కళాశాలలు | PG medical colleges to be set up in five district central hospitals in the state | Sakshi
Sakshi News home page

కొత్త పీజీ వైద్య కళాశాలలు

Mar 26 2026 2:19 AM | Updated on Mar 26 2026 2:19 AM

PG medical colleges to be set up in five district central hospitals in the state

వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ 

మహేశ్వరం వైద్యకళాశాల ఎల్బీనగర్‌కు తరలింపు 

ప్రతి 25 కి.మీ.ల పరిధిలో ఒక డయాలసిస్‌ కేంద్రం 

రహదారులపై ప్రతి 35 కి.మీ.కు ఒక ట్రామా కేర్‌ సెంటర్‌ ఏర్పాటు 

ప్రతి గ్రామంలో కేన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు 

టీవీవీపీ రద్దు ..దాని స్థానంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌ ఏర్పాటు 

2027లో 2,929 పోస్టుల భర్తీ.. టీవీవీపీ రద్దు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఐదు జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో పీజీ వైద్య కళాశాలలను ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహేశ్వరంలో గత బీఆర్‌ఎస్‌ సర్కారు హయాంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాలను ఎల్బీనగర్‌కు తరలిస్తామని..మహేశ్వరంలో మరో పెద్ద ఆస్పత్రిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రతి 25 కిలోమీటర్లకు ఒక డయాలసిస్‌ సెంటర్‌ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. హైవేలపై ప్రతి 35 కిలోమీటర్లకొక ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.400 కోట్లు కేటాయించామని, రెండు నెలల్లో వీటి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.

మొత్తం 109 ట్రామా కేంద్రాల్లో 74 కేంద్రాలు డీఎస్‌హెచ్‌ పరిధిలో ఏర్పాటు కానున్నాయి. ప్రతి గ్రామంలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించామన్నారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్‌(టీవీవీపీ)ను రద్దు చేసి దాని స్థానంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌(డీఎస్‌హెచ్‌) ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును బుధవారం శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిల్లుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి దామోదర్‌ రాజనర్సింహ సమాధానాలిచ్చారు. 

వైద్యులతోపాటు, ఇతర సిబ్బంది నియామకాలు, ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరుగుతున్నందున టీవీవీపీను ప్రత్యేక డైరెక్టరేట్‌గా వైద్యశాఖలో విలీనం చేయడానికి ఈ బిల్లును తీసుకొచ్చామన్నారు. ఉద్యోగులకు సమయానికి జీతాల చెల్లింపు, ఎంప్లాయీ హెల్త్‌ స్కీమ్‌ కింద క్యాష్‌లెస్‌ వైద్యం, రూ.1.2 కోట్ల ప్రమాద బీమా, పూర్తి ప్రభుత్వ ఉద్యోగ హోదా లభిస్తుందని మంత్రి వివరించారు. జిల్లాలకే ఆధునిక వైద్య సదుపాయాలను తీసుకురావడంలో భాగంగా ప్రస్తుతం 6 ఆస్పత్రుల్లో ఉన్న సీటీ స్కాన్‌ సేవలను విస్తరించనున్నామన్నారు.

అదనంగా 200 పడకలకు పైగా ఉన్న 11 ఆసుపత్రుల్లో కొత్తగా సీటీ స్కాన్‌ యంత్రాలను ఏర్పాటు చేయనున్నామని, దీంతో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సమీపంలోనే ఆధునిక నిర్ధారణ సేవ లు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశాఖలో డిసెంబర్‌ 2023 నుంచి ఇప్పటివరకు 9,572 పోస్టులు భర్తీ కాగా, మరో 7,267 పోస్టులు భర్తీ దశలో ఉన్నాయి. 2027లో మరో 2,929 పోస్టులకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నామని మంత్రి వెల్లడించారు. 

ఆశావర్కర్లు ధర్నాలు చేస్తున్నారు: హరీశ్‌ 
బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు మాట్లాడు తూ ఈ బిల్లును తమ పార్టీ స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఆశావర్కర్లు జీతాలు రాక ధర్నాలు చేస్తున్నారని, వారిని కూడా ఈ డైరెక్టరేట్‌ పరిధిలోకి తీసుకొస్తారా లేదా చెప్పాలని, వారికి నెలకు రూ.18 వేల వేతనం చెల్లిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చి ఇప్పటికీ అమలు చే యడం లేదన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సబితారెడ్డి మాట్లాడుతూ మహేశ్వరంలో ఏర్పా టు చేసిన మెడికల్‌ కాలేజీని ఎల్బీనగర్‌కు మార్చవద్దని కోరారు. ఆ పార్టీ సభ్యుడు కల్వకుంట్ల సంజయ్, కాంగ్రెస్‌ సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, సంజీవరెడ్డి, మజ్లిస్‌ సభ్యుడు జాఫర్‌ మాట్లాడారు.  

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి: బీజేపీ  
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని బీజేపీ సభ్యుడు పాల్వాయి హరీశ్‌బాబు సూచించారు. వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ ఈ బిల్లును తెచి్చనందుకు ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామన్నారు. సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ మాతా, శిశు సంరక్షణ ఆస్పత్రుల్లో పేదలకు అందే వైద్యంపై సరైన పర్యవేక్షణ లేదన్నారు. కాంగ్రెస్‌ సభ్యుడు వంశీకృష్ణ మాట్లాడుతూ హైదరాబాద్‌ నుంచి శ్రీశైలం వెళ్లే రహదారిపై మన్ననూరు, అచ్చంపేటలో ట్రామాకేర్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement