బ్రిడ్జిని ఆనుకుని ప్రవహిస్తున్న పెన్‌గంగ.. 20కిమీ మేర ట్రాఫిక్‌ జామ్‌

Painganga River Flowing Over Bridge In Adilabad District - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: తెలంగాణలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో వరదల కారణంగా నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో గోదావరి ఉప నదులు ప్రాణహిత, పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా పరిధిలో పెన్‌గంగ మహోగ్రరూపం దాల్చింది. దీంతో, పలు గ్రామాలు నీట మునిగాయి. పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

వివరాల ప్రకారం.. జిల్లాలోని డోలాలా వద్ద గోదావరి ఉప నది పెన్‌గంగ ఉప్పొంగి ప్రవహిస్తోంది. పెన్ గంగ వరద నీరు 50 అడుగులు ఎత్తున ఉన్న వంతెనను తాకాయి. దీంతో 44వ నంబర్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. దీంతో, అప్రమత్తమైన అధికారులు బ్రిడ్జిపైకి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో దాదాపు 20కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పెన్‌గంగ ఉధృతికి భీంపూర్, జైనథ్, బేల మండలాల్లోని 10 జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుమారు 20 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 

ఈ సందర్బంగా నేషనల్‌ హైవే అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పెన్‌గంగా ప్రవాహం పెరిగింది. ఎగువన ప్రాజెక్ట్‌ల గేట్లు మూసివేస్తేనే వరద ప్రవాహం తగ్గుతుందన్నారు. నేటి మధ్యాహ్నం వరకు నీటి ప్రవాహం కొంత మేరకు తగ్గే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేశారు. ఆ తర్వాతే బ్రిడ్జిపై నుంచి వాహనాలు వెళ్లేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఇంట్లోనే ఉండండి.. అత్యవసరమైతేనే బయటకు రండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top