వెన్ను విరగని వరి!

Paddy type that withstands hailstorms Agricultural University - Sakshi

వానతో వర్రీ లేదు

గింజ రాలదు

నేలకొరగదు

చలికి వెరవదు.. 

వడగళ్లు, ఈదురుగాలులనూ తట్టుకునే వంగడాలు 

దేశీ రకాలను అభివృద్ధి చేసి సిద్ధం చేస్తున్న వ్యవసాయ వర్సిటీ 

ఇప్పటికే అందుబాటులోకి జేజీఎల్‌–24423 వంగడం 

ఇటీవలి వడగళ్ల వానలను దీటుగా తట్టుకున్న వరి రకం 

కాండం దృఢంగా ఉండటంతో నేలవాలని తీరు 

అభివృద్ధి దశలో ఇలాంటి మరో ఏడు వంగడాలు

వచ్చే ఏడాది నాలుగు, ఆ తర్వాత ఏడాది మూడు..

సీజన్‌ ముందుగానే ముగించేలా తక్కువ కాల పంట 

సాధారణ, హైబ్రిడ్‌ రకాలతో పోలిస్తే దిగుబడి ఎక్కువ 

వానాకాలం, యాసంగి రెండు సీజన్లకూ అనుకూలం

నీళ్లు అందుబాటులో ఉండటంతో వరి ఏపుగా పెరిగింది.. నిండా గింజలతో కళకళలాడుతోంది.. కానీ ఒక్కసారిగా ఈదురుగాలులు, వడగళ్లు, భారీ వర్షం.. అయినా వరి పెద్దగా దెబ్బతినలేదు. గింజలు నేల రాలలేదు.. నేలవాలిన మొక్కలు కూడా రెండు, మూడు రోజుల్లోనే తిరిగి నిలబడ్డాయి. మామూలుగా అయితే వరి నేలకొరిగి, ధాన్యం రాలిపోయి రైతు నిండా మునిగిపోయేవాడే. కానీ ఇది దేశీ రకాల వంగడం కావడంతో ప్రకృతి వైపరీత్యాన్ని తట్టుకుని నిలబడింది. అకాల వర్షాలు–పంట నష్టం సమస్యపై చర్చ జరుగుతున్న క్రమంలో.. వ్యవసాయ యూనివర్సిటీ దీనికి పరిష్కారంగా అభివృద్ధి చేసిన వరి వంగడాలు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి. 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలులు, వడగళ్ల ధాటికి లక్షల ఎకరాల్లో వరి నేల వాలింది. గింజలు రాలిపోయాయి. దీనిపై సమీక్ష చేసిన సీఎం కేసీఆర్‌.. వ్యవసాయ సీజన్లను ముందుకు జరిపే అంశాన్ని పరిశీలించాలని, అకాల వర్షాలు మొదలయ్యే లోపే పంట కోతలు పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

కానీ రాష్ట్రంలో పరిస్థితులు ఒక్కో జిల్లాలో, ప్రాంతంలో ఒక్కోలా ఉంటాయని.. సీజన్లను ముందుకు జరపడం కన్నా ప్రత్యామ్నాయాలను అన్వేషించాలని వ్యవసాయ నిపుణులు సూచించారు. ఈ క్రమంలోనే అకాల వర్షాలను, వడగళ్లను తట్టుకుని నిలిచే వరి వంగడాల అంశం తెరపైకి వచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న జేజీఎల్‌–24423 రకంతోపాటు.. త్వరలో అందుబాటులోకి రానున్న మరో ఏడు రకాల వంగడాల వివరాలను ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు వెల్లడించారు. 
 
తట్టుకుని నిలిచిన.. జేజీఎల్‌–24423.. 
వడగళ్లు, ఈదురుగాలులను తట్టుకునే వరి వంగడంగా జేజీఎల్‌–24423 ఇప్పటికే గుర్తింపు పొందింది. వ్యవసాయ వర్సిటీ పరిధిలోని జగిత్యాల పొలాస పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్తలు 2019లో దీనిని విడుదల చేశారు. దీనిని 2022–23 వానాకాలం సీజన్‌లో 5–7 లక్షల ఎకరాల్లో, యాసంగిలో ఆరు లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇటీవలి ఈదురుగాలులు, వడగళ్ల వానలకు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో వరి పడిపోయినా, గింజలు నేలరాలినా.. జీజీఎల్‌–24423 రకం వరి మాత్రం 90శాతం వరకు తట్టుకుని నిలిచినట్టు వ్యవసాయ వర్సిటీ వర్గాలు తెలిపాయి. 

ఎత్తు తక్కువ.. చలిని తట్టుకుంటుంది.. 
జేజీఎల్‌–24423 వరి వెరైటీ రకాన్ని జగిత్యాల రైస్‌–1 అని కూడా అంటారు. ఎంటీయూ 1010, ఎన్‌ఎల్‌ఆర్‌–34449 రకాలని సంకరం చేసి దీనిని అభివృద్ధి చేశారు. ఇది వానాకాలం, యాసంగి రెండు సీజన్లకూ అనుకూలమైన సల్పకాలిక రకం. వానాకాలంలో దీని పంట కాలం 125 రోజులు, యాసంగిలో 135–140 రోజులు ఉంటుందని వర్సిటీ తెలిపింది. యాసంగిలో మార్చిలోగానే చేతికి వస్తుంది. ఈ వరి ఎత్తు తక్కువగా, కాండం ధృఢంగా ఉండటం వల్ల ఈదురుగాలులు, వడగళ్లకు పంట నేలకొరగదు.

గింజ సులువుగా రాలిపోని గుణాన్ని కలిగి, బరువు అధికంగా ఉంటుంది. యాసంగిలో చలిని సమర్థవంతంగా తట్టుకోవడం వల్ల నారు ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. దోమను కొంతవరకు తట్టుకొంటుంది. దమ్ము చేసిన మడిలో నేరుగా వెదజల్లే పద్ధతికి కూడా అనుకూలం. ఈ ధాన్యానికి మార్కెట్లో గ్రేడ్‌–ఎ కింద మద్దతు ధర లభిస్తుంది. వానాకాలంలో జూలై చివరివరకు, యాసంగిలో నవంబర్‌ 15 నుండి డిసెంబర్‌ మొదటి వారం వరకు నారు పోసుకోవచ్చు. 

దిగుబడీ ఎక్కువే.. 
జేజీఎల్‌–24423 వరి ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసినప్పుడు బియ్యం రికవరీ 58–61 శాతం మధ్య ఉంటుంది.. సాధారణంగా మిగతా వెరైటీలు 52–54 శాతమే బియ్యం వస్తాయి. కర్ణాటక, ఏపీ, తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఈ రకాన్ని పండిస్తున్నారు. దిగుబడి ఎకరాకు 40–45 బస్తాల (25–28 క్వింటాళ్లు) వస్తుంది. 

పరిశోధన దశలోని ఏడు వంగడాలివీ.. 
1) ఆర్‌ఎన్‌ఆర్‌–31479:  ఇది 125 రోజుల్లో కోతకు వచ్చే రకం. బీపీటీ సాంబమసూరితో సమానంగా ఉండే సన్నగింజ రకం. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌ వర్సిటీలోనే పరిశోధన పూర్తయింది. రైతుల పొలాల్లో క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతోంది. 
2)కేపీఎస్‌–2874: మిర్యాలగూడ కంపాసాగర్‌ వ్యవసాయ పరిశోధన స్థానంలో దీనిపై పరిశోధన పూర్తయింది. రైతుల పొలాల్లో పరిశీలన జరుగుతోంది. ఇది 125 రోజుల్లో దిగుబడి వస్తుంది. సన్నగింజ రకం. దోమను, చౌడును తట్టుకుంటుంది. 
3) ఆర్‌ఎన్‌ఆర్‌–28361: రాజేంద్రనగర్‌ పరిశోధన కేంద్రంలో అభివృద్ధి చేశారు. ఇది దొడ్డుగింజ రకం. 130 రోజుల్లో చేతికి వస్తుంది. వానాకాలం, యాసంగి రెండు సీజన్లలో వేయొచ్చు. దోమ, చౌడును తట్టుకుంటుంది. 
4) జేజీఎల్‌–28639: జగిత్యాల ప్రాంతీయ పరిశోధన స్థానంలో అభివృద్ధి చేశారు. ఇది దొడ్డుగింజ రకం. 125 రోజుల్లో చేతికి వస్తుంది. రెండు సీజన్లలోనూ వేయొచ్చు. దోమను, వడగళ్లను తట్టుకుంటుంది. 

– పై నాలుగు రకాల వరి దిగుబడి 42 నుంచి 46 బస్తాల మధ్య ఉంటుంది. క్షేత్రస్థాయిలో పొలాల్లో పరిశీలన పూర్తయి.. వచ్చే ఏడాది రైతులకు అందుబాటులోకి రానున్నాయి. ఈ రకాలకు వానాకాలం సీజన్‌లో జూన్‌ చివరి నుంచి జూలై మూడో వారం వరకు నాట్లు వేసుకోవచ్చు. అక్టోబర్‌లో పంట చేతికి వస్తుంది. యాసంగి సీజన్‌కు అయితే నవంబర్‌ 15 తేదీ నుంచి నాట్లు వేసుకోవచ్చు. డిసెంబర్‌ 15నాటికి నాట్లు పూర్తిచేసుకోవాలి. మార్చి 15 నాటికి పంట చేతికి వస్తుంది. సీజన్‌ నెల రోజులు ముందే పూర్తయినట్టు అవుతుంది. ఈ రకాలకు పెట్టుబడి ఎకరానికి సాధారణం కంటే రూ. 2–3 వేలు తక్కువగా ఉంటుంది. 

5, 6, 7) కేఎన్‌ఎం–12368, కేఎన్‌ఎం–12510, కేఎన్‌ఎం–7715: 
ఈ మూడు 130 నుంచి 135 రోజుల్లో కోతకు వచ్చే వరి రకాలు. వానాకాలానికి మాత్రమే అనుకూలమైనవి. జూన్‌ తొలకరి వర్షాలతోనే వేసుకోవచ్చు. అక్టోబర్‌ నాటికే కోతకు వస్తాయి. వీటిపై పరిశోధన పూర్తయి 2025లో అందుబాటులోకి వస్తాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ మూడు కూడా వడగళ్లు, ఈదురుగాలులు, భారీ వర్షాలను దీటుగా తట్టుకునే రకాలని వివరించారు. పెట్టుబడి సాధారణం కంటే రూ. 2–3 వేలు తక్కువ అవుతుందని.. నేరుగా వెదజల్లే పద్ధతిలో సాగు చేయాలని పేర్కొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top