మళ్లీ టెక్‌ లేఆఫ్‌ కలకలం... | One lakh jobs cut in the first three months of this year | Sakshi
Sakshi News home page

మళ్లీ టెక్‌ లేఆఫ్‌ కలకలం...

Apr 3 2026 4:33 AM | Updated on Apr 3 2026 4:33 AM

One lakh jobs cut in the first three months of this year

ఈ ఏడాది తొలి మూడు నెలల్లో లక్ష ఉద్యోగాల కోత 

జాబితాలో దిగ్గజ కంపెనీలు 

ఐటీ, ఇతర రంగాల ఉద్యోగుల్లో దడ 

సాక్షి, హైదరాబాద్‌: మళ్లీ టెక్‌ లేఆఫ్‌లు ఊపందుకోవడంతో ఐటీ, ఇతర రంగాల ఉద్యోగుల్లో దడ మొదలైంది. 2026 తొలి మూడు నెలల్లోనే ప్రధాన టెక్, ఇతర కంపెనీల్లో దాదాపు లక్ష లేఆఫ్‌లు చోటుచేసుకున్నాయి. ఇందుకు ఒరాకిల్, అమెజాన్, డెల్‌ వంటి దిగ్గజ కంపెనీలు కూడా మినహాయింపుగా లేవు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్, లాజిస్టిక్స్, కార్పొరేట్‌ రంగాల్లో ఉద్యోగుల్లో భారీ కోతను సూచిస్తోంది. జనవరి 2026 నాటి డేటా ప్రకారం... 2009 తర్వాత ఒక ఏడాది ప్రారంభంలో నమోదైన అత్యధిక ఉద్యోగ కోతలు ఇవే కావడం గమనార్హం. 

1.08 లక్షలకు పైగా ఉద్యోగ కోతలకు జరిగిన ప్రణాళికలు 2025 చివర్లో తగ్గుముఖం పట్టినా.. 2026 తొలి మూడు నెలల్లో అనూహ్య మార్పు వచ్చింది. ఇందుకు ప్రధానంగా... ఏఐ, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, పునరి్నర్మాణం, కోవిడ్‌లో అవసరానికి మించి తీసుకున్న వర్క్‌ఫోర్స్‌ వంటి వాటికి ముగింపు పలకడం వంటి వ్యూహాత్మక మార్పులే కారణంగా నిపుణులు చెబుతున్నారు.  

తొలగింపులు – ప్రణాళికలు ఇలా... 
ఒరాకిల్‌: ప్రపంచవ్యాప్తంగా సుమారు 30వేల ఉద్యోగులను (మొత్తం ఉద్యోగుల్లో 18%) తొలగిస్తోంది. ఒక్క భారత్‌లోనే 12వేల మందిపై ప్రభావం.  
అమెజాన్‌: ఏఐ పెట్టుబడులు పెంచుతున్నందున, జనవరిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 16 వేల కార్పొరేట్‌ ఉద్యోగులను తగ్గించింది.  
యూపీఎస్‌: తన భవిష్యత్‌ నెట్‌వర్క్‌ను ఆటోమేట్‌ చేస్తున్నందున, 2025లో కొన్నివేల ఉద్యోగాల తొలగింపు. 2026లో 30వేల వరకు ఉద్యోగాల తొలగింపునకు ప్రణాళిక. 
నోకియా: ప్రపంచవ్యాప్తంగా 14 వేల ఉద్యోగాలను ప్రభావితం చేసే ప్రణాళికలను ప్రకటించింది.  
డెల్‌: సుమారు 11 వేల ఉద్యోగులను తగ్గించింది. 
ఎపిక్‌ గేమ్స్‌: వెయ్యికి పైగా ఉద్యోగుల తొలగింపు  

» మెటా (700+), ఇంటెల్‌ (15,000), మైక్రోసాఫ్ట్‌ (15,000), స్పాటిఫై (పాడ్‌కాస్టింగ్‌) వంటి టెక్‌ కంపెనీల్లో గణనీయమైన కోతలు జరుగుతున్నాయి. 

లేఆఫ్స్‌ పెరుగుదలకు కారణాలివీ... 
» కంపెనీలు తమ సిబ్బందిపై వెచ్చించే బిలియన్ల డాలర్లను ఏఐ డేటా సెంటర్లు, చిప్‌లు, శిక్షణ వైపు మళ్లిస్తున్నాయి. 
» 2020–22 మధ్య టెకీలను పెద్దసంఖ్యలో తీసుకున్న కంపెనీలు, ఇప్పుడు ఉత్పాదకతపై దృష్టి సారిస్తూ కోతలు విధిస్తున్నాయి. 
» అనేక కంపెనీలు నిర్వహణ శ్రేణులను తగ్గించడం, పునరావృతమయ్యే పనులను ఆటోమేషన్‌ చేయడంపై దృష్టి సారిస్తున్నాయి. 
» పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు, అధిక వడ్డీలు, తగ్గిన వినియోగదారుల విశ్వాసం. 

జాబ్‌ మార్కెట్‌పై ప్రభావం 
2026 జనవరిలో నియామకాలు 17 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోవడంతో, ఉద్యోగాలు కోల్పోయిన వారు కొత్త ఉద్యోగాలు వెతుక్కోవడం మరింత సమస్యగా మారింది. తిరిగి ఉద్యోగంలో చేరినప్పుడు తరచుగా తక్కువ జీతం, తక్కువ స్థాయి హోదాలు లేదా భద్రత లేని, ఒప్పంద ఆధారిత పని లభిస్తోంది. ఇతర నిర్మాణాత్మక సమస్యలను దాచిపెట్టడానికి లేదా ఖర్చులను తగ్గించడం ద్వారా స్టాక్‌ ధరలను పెంచుకోవడానికి కంపెనీలు ఏఐని సాకుగా ఉపయోగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.  

యుద్ధమూ ఒక కారణమే.. 
రాబోయే మూడేళ్లలో బాగా పెరగబోయే ఏఐ అడాప్షన్‌లో భాగంగా కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా–ఇజ్రాయెల్‌–ఇరాన్‌ యుద్ధ పరిణామాల నేపథ్యంలోనూ మార్పులు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలో ఏఐ అన్వయింపు మరింతగా పెరుగుతోంది. పెద్ద కంపెనీలు కాస్ట్‌ ఆప్టిమైజేషన్‌ చేసుకోలేకపోతే ఇండస్ట్రీలో మనుగడ సాధించే అవకాశాలు లేవు. కాస్ట్‌ కంట్రోల్‌ మినహా మరో గత్యంతరం లేదు. 

ఇందులో ఉద్యోగుల జీతాలు తగ్గించడమే ప్రధానం. క్లౌడ్, జెన్‌ ఏఐ టూల్స్‌ వినియోగం వల్ల కూడా పరిస్థితులు మారుతున్నాయి. అయితే ఏఐ, ఇతర అత్యాధునిక నైపుణ్యాలను పెంచుకుంటే ఇప్పుడు ఉద్యోగాలు కోల్పోతున్న వారికి కూడా తప్పకుండా అవకాశాలు పెరుగుతాయి.  –వెంకా రెడ్డి, చీఫ్‌ పీపుల్‌ ఆఫీసర్, క్వాలీజీల్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement