8,536 మందికి ఒక ప్రభుత్వ డాక్టర్‌ 

One Government Doctor For 8,536 People In Telangana - Sakshi

తెలంగాణలో పరిస్థితి ఇది..

జాతీయ ఆరోగ్య గణాంకాల నివేదిక వెల్లడి 

2,894 మంది జనాభాకు ఒక నర్సు  

రాష్ట్రంలో 20,926 మంది ఆయుష్‌ వైద్యులు 

సాక్షి, హైదరాబాద్‌: ఎంతమందికి జనాభాకు ఒక ప్రభుత్వ డాక్టర్‌ అందుబాటులో ఉన్నారనే నిష్పత్తిలో తెలంగాణ దేశంలో 15వ స్థానంలో నిలిచింది. ఈ మేరకు తాజా జాతీయ ఆరోగ్య గణాంకాల నివేదిక–2019 వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లో అక్కడి జనాభాలో డాక్టర్లు ఎందరున్నారో విశ్లేషించింది. తెలంగాణలో ప్రభుత్వ అలోపతిక్‌ డాక్టర్ల సంఖ్య 4,123 మంది ఉన్నారు. అంటే 8,536 మంది జనాభాకు ఒక ప్రభుత్వ అలోపతిక్‌ డాక్టర్‌ ఉన్నారు. ఏపీలో 9,657 మందికి ఓ ప్రభుత్వ డాక్టర్‌ ఉన్నారు. తెలంగాణలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 1,066 మంది డాక్టర్లు పనిచేస్తున్నారు. అంటే 33,015 మంది జనాభాకు ఒక పీహెచ్‌సీ డాక్టర్‌ ఉన్నట్లు పేర్కొంది.

ఇక రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న ఆయుష్‌ డాక్టర్లు 20,926 మంది ఉండటం విశేషం. అంటే ప్రతీ 1,682 మందికి తెలంగాణలో ఒక ఆయుష్‌ డాక్టర్‌ ఉన్నారు. ఆయుష్‌ డాక్టర్లలో దేశంలో తెలంగాణ 10వ స్థానంలో నిలిచింది. అలాగే రాష్ట్రంలో మొత్తం 12,159 మంది నర్సులు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో ప్రతీ 2,894 మందికి ఒక నర్సు ఉన్నారు. ఈ విషయంలో దేశంలో తెలంగాణ 19వ స్థానంలో నిలిచింది.

ఇక రాష్ట్రంలో ఫార్మసిస్టుల సంఖ్య ఏకంగా 64,881 మంది ఉండటం విశేషం. ప్రతీ 542 మంది జనాభాకు ఒక ఫార్మసిస్టు ఉన్నారని కేంద్రం తెలిపింది. ఫార్మసిస్టుల సంఖ్యలో తెలంగాణ దేశంలో ఆరో స్థానంలో నిలిచింది. ఇదిలావుండగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్క ప్రకారం ప్రతీ వెయ్యి మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండాలి.ఆ మేరకు రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యుల సంఖ్య పెరగాల్సి ఉందని వైద్య నిపుణులు అంటున్నారు. అమెరికాలో ప్రతీ 200 మందికి ఒక ప్రభుత్వ వైద్యుడు ఉండటం గమనార్హం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top