
వరద ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల్లో అలముకున్న అంధకారం
వందలాది కిలోమీటర్ల పరిధిలో దెబ్బతిన్న విద్యుత్ లైన్లు... యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణకు అధికారుల చర్యలు
మరో 3–4 రోజుల దాకా సరఫరా పునరుద్ధరణ సాధ్యంకాకపోవచ్చని అంచనా
సాక్షి, హైదరాబాద్/మిరుదొడ్డి (దుబ్బాక)/తొగుట (దుబ్బాక): వరద ప్రభావిత ప్రాంతాల్లోని చాలా గ్రామాల్లో అంధకారం అలముకుంది. సబ్ స్టేషన్లలోకి నీళ్లు చేరడం, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. వరదల నేపథ్యంలో విద్యుత్ సరఫరాను నిలిపివేసిన అధికారులు సరఫరా పునరుద్ధరణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. అయినా మరో 3–4 రోజుల వరకు విద్యుత్ పునరుద్ధరణ సాధ్యం కాకపోవచ్చని అధికార వర్గాలు అంటున్నాయి.
మరోవైపు ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ముషారఫ్ ఫారూఖీ, కర్నాటి వరుణ్‌రెడ్డి తాజా పరిస్థితిని గురువారం మీడియాకు వెల్లడించారు. కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ ప్రాంతాల్లో వరుణ్‌రెడ్డి పర్యటించారు. కరీంనగర్ సర్కిల్ ఆఫీ సులో లోడ్ మానిటరింగ్ సెల్‌ను పరిశీలించి విద్యుత్ సరఫరా, సబ్‌స్టేషన్ల పనితీరు, స్తంభాలు, లైన్ల పనితీరును పర్యవేక్షించారు. కాగా, క్షేత్రస్థాయి నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.
పలు జిల్లాల్లో ‘విద్యుత్’ నష్టం ఇలా..
» మెదక్ జిల్లాలో వరద ప్రభావానికి కొన్నిచోట్ల సబ్‌స్టేషన్లలోకి నీళ్లు చేరాయి. 33 కేవీ ఫీడర్లు 11, 11 కేవీ ఫీడర్లు 175, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 262 సహా 971 విద్యుత్ స్తంభాలకు నష్టం వాటిల్లింది. వందల కి.మీ. మేర విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి.
» నల్లగొండ, గద్వాల్, యాదాద్రి, సంగారెడ్డి, నారాయణపేట జిల్లాల పరిధిలో వరదల ప్రభావానికి 33 కేవీ ఫీడర్లు 39, 11 కేవీ ఫీడర్లు 296, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు 280, 1,357 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తర ప్రాంత విద్యుత్ సంస్థ పరిధిలోని కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ సర్కిల్ పరిధిలో 108 విద్యుత్ స్తంభాలు నేలకూలగా వాటిల్లో 87 స్తంభాలను అధికారులు పునరుద్ధరించారు. అలాగే 21 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినగా అన్నింటినీ బాగుచేశారు. అయితే 86 ట్రాన్స్‌ఫార్మర్లు నీటమునగగా వాటిలో ఆరింటిని పునరుద్ధరించారు.
ప్రాణాలకు తెగించి వాగులోకి వెళ్లి..
9 గ్రామాలకు ఉద్యోగుల వెలుగులు
భారీ వర్షాల వల్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడంతో విద్యుత్‌ఉద్యోగులు ప్రాణాలకు తెగించి సర ఫరా పునరుద్ధరించారు. సిద్దిపేట జిల్లా అక్బర్‌పేట– భూంపల్లి మండలం ఖాజీపూర్ పరిధిలోని 33/11 కేవీ ఫీడర్ లైన్‌కు సంబంధించిన విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో కాసులాబాద్, రుద్రారం, మల్లుపల్లి, జంగపల్లి, వీరారెడ్డిపల్లి, మదన్నపేట, బేగంపేట, అల్మాస్‌పూర్, ఖాజీపూర్, గుర్రాలపల్లి గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
విషయం తెలుసుకున్న ఎస్‌సీ చంద్రమోహన్, డీఈ రామచంద్రయ్య, ఏడీ గంగాధర్, ఏఈ కనకయ్యలు తమ సిబ్బందితో కలిసి వాగులోకి వెళ్లి విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేశారు. దీంతో తొమ్మిది గ్రామాలకు సరఫరాను పురుద్ధరించారు. మరోవైపు తొగుట మండలం వెంకట్రావుపేట వనం చెరువు మధ్యలో ఉన్న ఓ విద్యుత్ స్తంభానికి పిన్ ఇన్సులేటర్ ఊడి పడిపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జేఎల్‌ఎం మల్లేశం చెరువులోకి ఈదుకుంటూ వెళ్లి స్తంభంపైకి చేరుకొని.. పిన్ ఇన్సులేటర్‌ను బిగించాడు. దీంతో సరఫరా పునరుద్ధరణ అయింది. జేఎల్‌ఎం మల్లేశంను అధికారులు అభినందించారు.