తెలంగాణపై భానుడి ప్రతాపం.. ఒక్కరోజే 9 మంది మృతి | North and Central Telangana districts reel under high temperatures | Sakshi
Sakshi News home page

తెలంగాణపై భానుడి ప్రతాపం.. ఒక్కరోజే 9 మంది మృతి

May 21 2026 4:55 AM | Updated on May 21 2026 6:32 AM

North and Central Telangana districts reel under high temperatures

అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిన నార్త్, సెంట్రల్‌ తెలంగాణ జిల్లాలు 

వచ్చే రెండు రోజులు ఇదే పరిస్థితి, అంతటా రెడ్‌ అలర్ట్‌.. నిర్మల్‌ జిల్లాలో అత్యధికంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత

సాక్షి, నెట్‌వర్క్‌: రాష్ట్రం అగ్ని గుండమైంది. ఎండ తీవ్రతకు జిల్లాలన్నీ అల్లాడిపోయాయి. వివిధ ప్రాంతాల్లో బుధవారం వడదెబ్బతో 9మంది మృతి చెందారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనే ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం గొల్లపల్లికి చెందిన మహిళా రైతు నెర్రగడ్డం లచ్చవ్వ (55), వేములవాడ మండలం ఆరెపల్లికి చెందిన ఎంగె రాజిరెడ్డి (60) భీమన్న, పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్‌కు చెందిన కందుకూరి రాజమ్మ (83), ధర్మారం మండలం నర్సింగాపూర్‌కు చెందిన రైతు సామ లచ్చిరెడ్డి (60), పెద్దపల్లి మండలం కొత్తపల్లికి చెందిన కనుకుంట్ల కనకయ్య (75), హుజూరాబాద్‌లోని 21వ వార్డుకు చెందిన దివ్యాంగుడు గాజర్ల సతీశ్‌ (45) వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోయారు. 

మహబూబాబాద్‌ జిల్లా కేసముంద్రం మండలం అర్పనపల్లికి చెందిన వృద్ధుడు నేరెళ్ల సోమయ్య(72), ములుగు మున్సిపాలిటీ పరిధి ప్రేమ్‌నగర్‌కు చెందిన పారిశుధ్య కార్మికుడు బోడ సాంబయ్య, నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం మద్దెల్‌బీడ్‌ గ్రామానికి చెందిన దాసరి హన్మంతు (50) వడదెబ్బతో మృతి చెందారు. 

ఉదయం నుంచే వడగాలుల తీవ్రత  
తెలంగాణ అంతటా హీట్‌వేవ్ విస్తరించింది. ఉదయం నుంచే వడగాలుల తీవ్రతతో బుధవారం ఉత్తర, సెంటల్ర్‌ తెలంగాణ జిల్లాలు హడలిపోయాయి. అత్యధికంగా నిర్మల్‌ జిల్లా దిలావర్‌పూర్‌లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, 18 జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. రాష్ట్రమంతటా సాధారణం కంటే 5–6 డిగ్రీల వరకు అధికంగా నమోదు అవుతుండటంతో వాతావరణశాఖ రెడ్‌ అలర్ట్‌ను జారీ చేసింది. 

గురు, శుక్రవారాల్లో కూడా ఎండ తీవ్రత ఉంటుందని పేర్కొంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ప్రజలు  అప్రమత్తంగా ఉండాలని సూచించింది. వృద్ధులు,పిల్లలు, గర్భిణులతో పాటు అనారోగ్యంతో ఉన్న వారు బయటకు రావొద్దని వైద్యులు హెచ్చరించారు. 

కాలిన మోటార్‌ సైకిల్‌.. ఆర్టీసీ బస్సు టైరు నుంచి పొలు  
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కలపేటకు చెందిన ఎల్కరి సంజీవ్‌ అటవీ ప్రాంతం గుండా మోటారుసైకిల్‌పై వెళ్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మోటార్‌సైకిల్‌పై ఉన్న మరో మహిళ, ఇద్దరు పిల్లలు తృటిలో తప్పించుకున్నారు. మోటార్‌ సైకిల్‌ కాలిపోయింది.   కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు టైరు నుంచి పొగలు వచ్చాయి. డ్రైవర్‌ నీళ్లు చల్లడంతో ప్రమాదం తప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement