హైదరాబాద్‌ యువతితో నైజీరియన్‌ స్నేహం..  గిఫ్ట్‌ల పేరుతో రూ. 1.22 కోట్లు..

Nigerian Man Cheated Hyderabad Women And Looted 1 Crore - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గిఫ్ట్‌ పేరుతో మోసానికి పాల్పడ్డ నైజీరియన్‌ జంటను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 20 పాస్‌బుక్‌లు, 8 చెక్కు బుక్‌లు, 9 డెబిట్‌ కార్డులు, 12 మొబైల్‌ ఫోన్లు, 4 సిమ్‌కార్డులు, ల్యాప్‌టాప్, మూడు ఐడీకార్డులను స్వాధీనం చేసుకున్నట్లు అరెస్టు చేసినట్లు సీసీఎస్‌ జాయింట్‌ సీపీ గజరావు భూపాల్‌పేర్కొన్నారు. వివరాలు నైజీరియాకు చెందిన బకయోకో లస్సినా, షోమా పుర్కయస్తా ప్రేమికులు. బకయోకో లస్సినా డాక్టర్‌ లియనార్డో మ్యాట్టియో అనే పేరుతో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను తెరచి కొందరికి ఫ్రెండ్‌ రిక్వెస్టులు పంపాడు.

నగరానికి చెందిన ఓ యువతి అతడి రిక్వెస్ట్‌ యాక్సెప్ట్‌ చేయగా కొంతకాలం ఇద్దరూ చాటింగ్‌ చేసుకున్నారు. తనను లండన్‌లో డాక్టర్‌గా పరిచయం చేసుకున్న ఇతగాడు యువతి కోసం సిటీకి వస్తున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఢిల్లీ కస్టమ్స్‌లో మీ కోసం వస్తున్న డాక్టర్‌ లియనార్డో మ్యాట్టియోను అరెస్టు చేశామని, అతడి వద్ద వజ్రాలు, విలువైన బహుమతులు, డబ్బును స్వాధీనం చేసుకున్నామంటూ సదరు యువతికి కస్టమ్స్‌ ఆఫీసర్‌గా పరిచయం చేసుకున్న షోమా పుర్కయస్తా ఫోన్‌ చేసి చెప్పింది.

ఆమెను భయపెట్టి పలు దఫాలుగా రూ.1.22 కోట్లు పలు బ్యాంకు అకౌంట్‌లకు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకున్నారు. అయినా పదే పదే డబ్బులు డిమాండ్‌ చేస్తుండటంతో బాధితురాలు సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఢిల్లీ వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. ఇదే తరహాలో వీరు పలువురిని మోసం చేసినట్లు గజరావు భూపాల్‌ తెలిపారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top