పైసా ఆదాయం పెరగలే! | New fiscal year is not going well for the state treasury | Sakshi
Sakshi News home page

పైసా ఆదాయం పెరగలే!

Jun 30 2025 3:05 AM | Updated on Jun 30 2025 3:05 AM

New fiscal year is not going well for the state treasury

వరుసగా రెండో నెలలోనూ రూ.16 వేల కోట్ల రాబడే

ఏప్రిల్, మే నెలల్లో కలిపి వచ్చింది రూ.33 వేల కోట్లే

అందులోనూ అప్పులు దాదాపు రూ.10 వేల కోట్లు

ఖర్చులో మాత్రం పెరుగుదల.. ప్రభుత్వ నివేదికలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: కొత్త ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ఖజానాకు అంతగా కలిసిరావడం లేదు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండో నెలలో కూడా ఆదాయ పరిస్థితిలో మార్పు రాలేదు. రాష్ట్ర సొంత పన్నులు, కేంద్రం ఇచ్చే నిధులు, అప్పులు, పన్నేతర ఆదాయాలు.. అన్నీ కలిపి ఏప్రిల్‌ నెల తరహాలోనే మే నెలలోనూ రూ.16 వేల కోట్లు మాత్రమే సమకూరాయి. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)కు రాష్ట్ర ప్రభుత్వం మే–2025 నాటికి రాష్ట్ర రాబడులు, వ్యయాలపై ఇచ్చిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. 

ఈ నివేదిక ప్రకారం ఏప్రిల్‌ నెలలో మొత్తం రూ.16,473.99 కోట్లు ఖజానాకు సమకూరగా, మే నెలలో రూ.16,349.46 కోట్లు వచ్చాయి. మొత్తం కలిపి రెండు నెలల్లో రాబడులు రూ. 32,823.45 కోట్లు కాగా, వ్యయం 31,740.08 కోట్లుగా నమోదైంది. అయితే, ఇందులో అప్పులే రూ.10 వేల కోట్ల వరకు ఉండగా, గత ఏడాదితో పోలిస్తే పన్ను ఆదాయం తగ్గింది. 

కేంద్రం నుంచి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ రాకపోవడం వల్ల కూడా ఖజానా కళ తప్పిందని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. పన్నేతర ఆదాయం ఆశించిన మేర రాకపోవడం, కేంద్ర పన్నుల వాటాలో కూడా పెద్దగా మార్పు లేకపోవడంతో వరుసగా రెండో నెలలో కూడా రాష్ట్ర ప్రభుత్వ అంచనాలకు, రాబడులకు మధ్య వ్యత్యాసం రూ.9 వేల కోట్లు కొనసాగుతుండడం గమనార్హం. 

Advertisement
 
Advertisement
Advertisement