కొంగొత్త నేరస్తులు | NCRB Crime in India 2024 report: New Criminals Committing Crimes | Sakshi
Sakshi News home page

కొంగొత్త నేరస్తులు

May 11 2026 1:59 AM | Updated on May 11 2026 1:59 AM

NCRB Crime in India 2024 report: New Criminals Committing Crimes

2024లో అరెస్టయిన 98,351 మంది నేరస్తుల్లో 92,389 మంది కొత్తవారే 

ఈ క్రిమినల్స్‌ను పట్టుకోవడంలో పోలీసులకు ఎదురవుతున్న సవాళ్లు 

వారి ఫొటోలు, వేలిముద్రల రికార్డ్‌లు లేకపోవడమే కారణం 

నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో 2024 నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ముందుగా రెక్కీ, పక్కా స్కెచ్, అదును కోసం ఎదురుచూపులు, పకడ్బందీగా అమలు.. ఇదీ ఒకప్పుడు నేరగాళ్లు అనుసరించిన పంథా. కానీ ఇటీవల కాలంలో తరచూ నేరాలకు పాల్పడేవారి స్థానంలో కొత్త నేరగాళ్లు పుట్టుకొస్తున్నారు. హత్య, హత్యాచారం.. మరేదైనా ఘరానా నేరం.. వాటిలో నిందితులంతా దాదాపుగా కొత్తవారే ఉంటున్నారు. వారికి ఎలాంటి నేరచరిత్ర ఉండట్లేదు. వ్యక్తిగత కక్షలతో కొందరు.. ప్రతీకారం తీర్చుకోవడానికి మరికొందరు నేరగాళ్లుగా మారుతున్నారు. రాష్ట్రంలో నేరాలకు పాల్పడి పోలీసులకు చిక్కుతున్న వారిలో 95 శాతం మంది కొత్త వాళ్లే ఉంటున్నట్లు నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో 2024కుగాను విడుదల చేసిన నివేదిక వెల్లడించింది.

తెలంగాణలో వివిధ చట్టాల కింద నమోదైన నేరాల్లో మొత్తం 98,351 మంది పట్టుబడగా వారిలో 92,389 మంది తొలిసారి నేరం చేసి చిక్కిన వారేనని ఎన్‌సీఆర్‌బీ నివేదిక పేర్కొంది. ముఖ్యంగా ఐపీసీ, బీఎన్‌ఎస్‌ చట్టాల కింద నమోదైన నేరాల్లో 79,698 మంది నేరస్తులు అరెస్టవగా వారిలో 74,801 మంది తొలిసారి అరెస్టయిన నేరస్తులే. వారిలోనూ తొలిసారి పట్టుబడ్డ జువెనైల్స్‌ 1,565 మంది ఉన్నారు. అలాగే ప్రత్యేక, స్థానిక చట్టాలు (ఎస్‌ఎల్‌ఎల్‌) కింద నమోదైన నేరాల్లో అరెస్టయిన నేరస్తుల సంఖ్య 18,653 కాగా వారిలో 17,588 మంది తొలిసారి చిక్కిన వారే ఉన్నారు.

యువకులు ఎక్కువగా ఆర్థిక అవసరాల కోసం నేరాల బాట పడుతున్నారు. సాధారణంగా పాత నేరగాళ్లపై పోలీసుల నిఘా ఉంటుంది. కానీ కొత్త నేరగాళ్ల విషయంలో అలా కుదరట్లేదు. ముఖ్యంగా వ్యక్తిగత కక్షలతో నేరాలకు పాల్పడే వారిని పసిగట్టడం సవాల్‌గా మారుతోంది. కొత్త నేరస్తుల ఫొటోలు, వేలిముద్రల వంటివి పోలీసు రికార్డుల్లో ఉండకపోవడం, సాంకేతిక ఆధారాలు లేకపోవడంతో కొత్త నేరస్తులను పట్టుకోవడంలో పోలీసులకు అడుగడుగునా సవాళ్లే ఎదురవుతున్నాయని నివేదిక పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement