హైదరాబాద్‌లో అత్యధిక డిమాండ్‌ ఈ మందులకే | National Family Health Survey | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో అత్యధిక డిమాండ్‌ ఈ మందులకే

May 25 2026 7:33 AM | Updated on May 25 2026 8:11 AM

National Family Health Survey

35 శాతం మందిలో దీర్ఘకాలిక వ్యాధులు 

ఐటీ కారిడార్‌లో ఏటా 15% పెరుగుతున్న రక్తపోటు మాత్రల అమ్మకాలు 

నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వేలో వెల్లడి 

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగర పౌరులు మధుమేహం, రక్తపోటు, ఎసిడిటీ, థైరాయిడ్‌ వంటి దీర్ఘకాలిక రోగాలతో నలిగిపోతున్నారు. నగరంలో అమ్ముడవుతున్న మందుల్లోనూ వీటిదే అగ్రస్థానం. గ్రేటర్‌ పరిధిలోని 35 శాతం మంది ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారని నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) వెల్లడించింది. ఐటీ కారిడార్‌లో రక్తపోటు, స్ట్రెస్‌ రిలీఫ్‌ మందుల అమ్మకాల్లో ఏటా 15 శాతం వృద్ధి నమోదవుతోందని ప్రి్రస్కిప్సన్స్‌ ట్రెండ్‌ స్పష్టం చేసింది. 60 ఏళ్లు పైబడినవారు రోజుకు మూడు పూటలా కలిపి 6 నుంచి 10 మాత్రలు మింగుతున్నారని నివేదికలో పేర్కొంది.  

42 లక్షల మంది మందులతోనే..  
గ్రేటర్‌ పరిధిలో సుమారు 1.35 కోట్లు. వీరిలో దాదాపు 42 లక్షల మంది బీసీ, షుగర్, థైరాయిడ్, అసిడిటీ, గుండె, ఊపిరితిత్తులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు. బీపీ, షుగర్, థైరాయిడ్‌ వంటి జబ్బులున్న వారు రోజుకు కనీసం రెండు నుంచి నాలుగు మాత్రలు తీసుకుంటుండగా, వృద్ధుల్లో ఈ సంఖ్య 6 నుంచి 10 మాత్రలుగా ఉందని అంచనా.   

మధుమేహంలో మనమే.. 
దేశంలో అత్యధికంగా మధుమేహం బాధితులున్న నగరాల్లో హైదరాబాద్‌ ఒకటి. మధుమేహం నియంత్రణకు వినియోగించే మందుల అమ్మకాలు అంతే పరిమాణంలో ఉంటున్నాయి. టైప్‌–1, టైప్‌–2 బాధితులు రోజుకు ఒక దఫా నుంచి మూడు దఫాలు ఇన్సులిన్‌ తీసుకుంటున్నారు. బాధితుల్లో సుమారు 10 నుంచి 15 శాతం మంది ఇన్సులిన్‌ ఇంజక్షన్లపైనే ఆధారపడుతున్నారు. ఐటీ కారిడార్‌లో టెకీలతో పాటు ఇతర రంగాల్లోని నిపుణుల్లోనూ మానసిక ఒత్తిడి పెరుగుతోంది. దీంతో స్ట్రస్‌ రిలీఫ్, బీపీ మందుల వినియోగం గణనీయంగా పెరిగింది.  

థైరాయిడ్‌లో మహిళలతో సమానంగా పురుషులు 
అధిక మసాలాలు ఉండే బిర్యానీ, ఇతర వంటకాలు, సమయానికి ఆహారం తినకపోవడంతో అసిడిటీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. థైరాయిడ్‌ మహిళలతో పాటు పురుషుల్లోనూ సమానంగా కనిపిస్తోంది. వివిధ రకాల యాంటీబయాటిక్స్, పెయిన్‌ కిల్లర్స్, జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి వంటి మాత్రలు అధికంగా వినియోగిస్తున్నారు. జర్నల్‌ ఆఫ్‌ యాంటీమైక్రోబియల్‌ రెసిస్టెన్స్‌ నివేదిక ప్రకారం యాంటీబయాటిక్స్‌ వాడకంలో దేశంలోనే హైదరాబాద్‌ మూడో స్థానంలో నిలిచింది. ప్రతి వెయ్యి మందిలో రోజు సగటున 15 మంది యాంటీబయాటిక్స్‌ వినియోగిస్తున్నారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement