సాక్షి, నల్లగొండ: డ్రైవర్ అప్రమత్తతో పెను ప్రమాదం తృటిలో తప్పింది. చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో జాతీయ రహదారి-65పై ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘనటలో బస్సు క్షణాల్లో కాలి బూడిదైంది.

హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న బస్సు ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి వెంటనే బస్సును రోడ్డుపక్కన ఆపాడు. అనంతరం ప్రయాణికులందరినీ క్షణాల్లో బస్సు నుంచి బయటకు దించడంతో పెద్ద విషాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడగా, కొద్ది సేపటికే మంటలు బస్సు మొత్తానికి వ్యాపించాయి.

ప్రయాణికుల కళ్లెదుటే ట్రావెల్స్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు ఏ ట్రావెల్స్‌కు చెందింది అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.
అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. ఇంజిన్‌లో తలెత్తిన సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.


