ఖైదీ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌: ఇకపై నేరుగా | Sakshi
Sakshi News home page

ఖైదీ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌: ఇకపై నేరుగా

Published Fri, Jul 30 2021 10:00 PM

Mulakath Will Be Re Start In Telangana Prisons On August 25th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఖైదీ కుటుంబాలకు తెలంగాణ జైళ్ల శాఖ శుభవార్త తెలిపింది. ఆగస్టు 25వ తేదీ నుంచి జైళ్ల శాఖలో ములాకత్‌లు ఉంటాయని జైళ్ల శాఖ డీ.జి రాజివ్ త్రివేది శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లల్లో, కేంద్ర కారాగారాల్లో ఖైదీలకు ములాకత్ ఇచ్చేందుకు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల నుంచి ములాకత్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఖైదీలు తమ కుటుంబసభ్యులతో ములాకత్‌లో కలుసుకునేందుకు వీలు లేకుండాపోయింది. రెండేళ్లుగా కుటుంబీకులతో మాట్లాడలేకపోవడంతో ఖైదీలు కూడా ఇబ్బందులు పడ్డారు.

ఇప్పటివరకు ఖైదీలకు జైలులో వాట్సాప్ వీడియో ములాకత్‌లకు పరిమితం చేశారు. అయితే ఖైదీలు ప్రత్యక్షంగా తమ కుటుంబసభ్యులతో ములాకత్ లేకపోవడంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై ఖైదీలు జైలు శాఖ ఉన్నతాధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. జైళ్లల్లో కూడా పరిస్థితులు ప్రశాంతంగా నెలకొనడంతో ములాకత్‌లు పునః ప్రారంభించనున్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులను ఖైదీలు ఇకపై నేరుగా కలుసుకోవడానికి అవకాశం లభించనుంది.

 
Advertisement
 
Advertisement