పెళ్లి చేస్తామని కుమారుడి ప్రియురాలిని ఇంటికి రప్పించి..

Mother Attack On Sons Girl Friend In Karimnagar  - Sakshi

సాక్షి, జగిత్యాల(కరీంనగర్‌): తన కుమారుడితో వివాహం జరిపిస్తామని, ఈ విషయంపై మాట్లాడుకుందాం, ఇంటికి రావాలని పిలిచి యువతిపై తల్లి దాడి చేసింది. ఈ ఘటనలో ప్రేమికురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ సంఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని అరవింద్‌నగర్‌కు చెందిన సాప భరత్‌చంద్ర(26), మోచీబజార్‌కు చెందిన బోగని శ్రావణి(21) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రావణి డిగ్రీ చదువుతుండగా, భరత్‌చంద్ర సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. భరత్‌చంద్ర తల్లిదండ్రులు ఇటీవల ఓ యువతితో వివాహం జరిపించేందుకు నిశ్చయించారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు. ఈనెల 27న వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

అయితే, భరత్‌చంద్ర, శ్రావణితో కలిసి ఈనెల 9న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు. తల్లితండ్రులు భరత్‌చంద్రకు ఫోన్‌ చేశారు. ప్రేమించిన యువతితోనే వివాహం జరిపిస్తామని నమ్మించి ఇంటికి రప్పించారు. శ్రావణితో తన కుమారుడి పెళ్లి చేయడం ఇష్టంలేని తల్లి అరుణ ఇనుపరాడ్‌తో శ్రావణి తలపై దాడిచేసింది. తీవ్రంగా గాయపడ్డ యువతి అరుచుకుంటూ ఇంట్లోంచి బయటకు పరుగెత్తుకొచ్చింది. స్థానికులు వెంటనే 108లో జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. కాగా, శ్రావణి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే చనిపోయారు. తన అన్నావదినల వద్ద ఆమె ఉంటోంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top