ఫ్లైఓవర్లు రాకముందు.. వచ్చాకా.. 

More No Of Flyovers Available So what Are The Benefits To The Public - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ నగరంలో  వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం (ఎస్సార్‌డీపీ) కింద వేల కోట్ల పనులు చేసి పలు ఫ్లైఓవర్లు అందుబాటులోకి తెచ్చారు. ఇంకా తెస్తున్నారు. ఇంతకీ వీటివల్ల ప్రజలకు కలిగిన సదుపాయాలేమిటి? మారిన పరిస్థితులేమిటి? ఒనగూరిన ఆర్థిక ప్రయోజనాలేమిటి?  వంటి వాటితోపాటు ఇతరత్రా అంశాల అధ్యయనానికి ప్రభుత్వం సిద్ధమైంది.

సిగ్నల్‌ఫ్రీ ప్రయాణం వల్ల కేవలం ట్రాఫిక్‌ చిక్కులు తప్పడమే కాదని పర్యావరణ పరంగా వాయు కాలుష్యం, ఇంధన  కాలుష్యం తగ్గుతుందని, వాహనాల నిర్వహణ ఖర్చులతోపాటు కాలుష్యం తగ్గడం వల్ల ఆరోగ్యపరంగా తలెత్తే సమస్యలు కూడా తగ్గుతాయని, తద్వారా జీవనప్రమాణాలు మెరుగవుతాయని  అధికారులు చెబుతున్నారు. రూ.వేల కోట్లతో నిర్మించిన ఫ్లైఓవర్లను కేవలం ప్రయాణ మార్గాలుగా మాత్రమే చూడరాదని, ఇతరత్రా ఎన్నో  ప్రయోజనాలున్నాయని చెబుతున్నారు. వాటన్నింటినీ సర్వేద్వారా శాస్త్రీయంగా వెల్లడించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 

రాకముందు.. వచ్చాకా.. 
ఎస్సార్‌డీపీ కింద ఫ్లైఓవర్లు, ఎలివేటెడ్‌ కారిడార్లు, అండర్‌పాస్‌లు, జంక్షన్ల అభివృద్ధి వంటి ఎన్నో పనులు చేపట్టారు. వాటిని పూర్తిచేసేందుకు మతపరంగా సున్నితమైన ప్రాంతాల్లో, శ్మశానవాటికల వద్ద సైతం పనులు  చేయాల్సి వచ్చింది. మరోవైపు భూసేకరణ సమస్యలు సరేసరి. యుటిలిటీస్‌ షిఫ్టింగ్‌ వంటి కష్టాలు ఉండనే ఉన్నాయి.

వీటన్నింటినీ పరిష్కరిస్తూ పూర్తిచేస్తున్న పనుల వల్ల ఇతరత్రా విధానాలుగానూ ఎన్నో ప్రయోజనాలున్నాయని, వాటి గురించి అందరికీ తెలియాలనేది ప్రభుత్వ ఆలోచన. అందుకుగాను ఫ్లై ఓవర్లు వచ్చిన ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా పరిగణిస్తూ సదరు జోన్లలో ఫ్లై ఓవర్లు రాకముందు.. వచ్చాక స్థానికుల పరిస్థితులు, ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి కలిగిన సదుపాయాలు, పెరిగిన దుకాణాలు, వ్యాపారాలు, తొలగిన ట్రాఫిక్‌ చిక్కులు, సాధ్యమైన సాఫీ ప్రయాణం ఇలా వివిధ అంశాలతో జాతీయస్థాయి  కన్సల్టెన్సీ సంస్థతో సర్వే నిర్వహించేందుకు సిద్ధమైంది.  

దాదాపు 9 మాసాల్లో ఈ సర్వే పూర్తి చేసి నివేదికను వెలువరించనున్నట్లు జీహెచ్‌ఎంసీలోని  సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఫ్లై  ఓవర్లు వచ్చిన ప్రాంతాల్లో  పెరిగిన మొబిలిటీ, తగ్గిన ప్రయాణ సమయం, రహదారి భద్రత తదితర అంశాలు కూడా అధ్యయనంలో వెల్లడిస్తారని పేర్కొన్నారు. ప్రయాణికులతోపాటు విద్య, వైద్యం, బ్యాంకింగ్,మార్కెటింగ్, తదితర రంగాల్లోని వారి అనుభవాలు సైతం పరిగణనలోకి తీసుకొని వారికి కలిగిన ప్రయోజనాలు సైతం నివేదికలో పొందుపరచనున్నారు. 

ఈ ప్రాంతాల్లో అధ్యయనం.. 
నగరంలో ఇప్పటికే పూర్తయిన  బయోడైవర్సిటీ జంక్షన్‌ వద్ద రెండు ఫ్లై ఓవర్లు, మైండ్‌స్పేస్‌ జంక్షన్‌ ఫ్లైఓవర్, అండర్‌పాస్, అయ్యప్ప సొసైటీ జంక్షన్‌ అండర్‌పాస్, కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ జంక్షన్‌ ఫ్లైఓవర్, జూబ్లీహిల్స్‌ రోడ్‌నంబర్‌ 45  ఫ్లైఓవర్‌. దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, షేక్‌పేట ఓయూకాలనీ ఫ్లైఓవర్, చింతల్‌కుంట అండర్‌పాస్, కామినేని దగ్గరి రెండు ఫ్లైఓవర్లు, ఎల్‌బీనగర్‌ రెండు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్, బైరామల్‌గూడ రెండు ఫ్లైఓవర్లు, బహదూర్‌పురా ఫ్లైఓవర్, ఒవైసీ జంక్షన్‌ ఫ్లైఓవర్లు, పంజగుట్ట స్టీల్‌బ్రిడ్జిలు ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చాయి.

త్వరలో పూర్తికానున్న నాగోల్‌ జంక్షన్, కొత్తగూడ, కొండాపూర్‌ ఫ్లైఓవర్లు, శిల్పా లేఅవుట్‌ ఫ్లైఓవర్‌ తదితర ఫ్లైఓవర్లు ఆర్‌ఓబీలు, ఆర్‌యూబీల వల్ల  ప్రయోజనాల్ని సైతం నివేదికలో పొందుపరచనున్నారు. బాలానగర్‌ ఫ్లై ఓవర్‌ హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో నిర్మించినప్పటికీ ఎస్సార్‌డీపీలో భాగంగా దానివల్ల కలిగిన ప్రయోజనాలనూ పొందుపరచనున్నారు. 

(చదవండి: ట్రాఫిక్‌ ఆంక్షలు... వాహనాలు మళ్లింపు)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top