వానాకాలం వ్యవసాయ సీజన్‌  | Monsoon Farming Season Begin In Telangana | Sakshi
Sakshi News home page

వానాకాలం వ్యవసాయ సీజన్‌ 

Jun 1 2022 1:08 AM | Updated on Jun 1 2022 1:08 AM

Monsoon Farming Season Begin In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో బుధవారం నుంచి వానాకాలం వ్యవసాయ సీజన్‌ ప్రారంభం కానుంది. జూన్‌ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్‌ చివరి వరకు ఈ సీజన్‌ కొనసాగుతుంది. రుతుపవనాలు కేరళను తాకడం, త్వరలో మన రాష్ట్రంలోకి కూడా ప్రవేశించనుండటంతో రైతులు అన్ని విధాలుగా సాగుకు సన్నద్ధమయ్యారు. విత్తనాల కొనుగోలు మొదలైంది.

అందుకోసం పత్తి కంపెనీలు కోటిన్నర విత్తన ప్యాకెట్లను అందుబాటులో ఉంచాయి. ఇప్పటికే లక్షలాది ప్యాకెట్ల పత్తి విత్తనాలను రైతులు    కొనుగోలు చేశారు. ఒక వర్షం పడితే వెంటనే పత్తి విత్తనాలు చల్లుతారు. కాగా, ఈ సీజన్లో 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాదాపు 45 లక్షల ఎకరాల్లో వరి నాట్లు    పడే అవకాశముంది.  

కంది సాగు డబుల్‌... సోయా పట్ల సుముఖత 
ఇతర దేశాల నుంచి కంది దిగుమతులను నిలిపివేయడంతో, దేశవ్యాప్తంగా కంది పంటకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. ఈ నేపథ్యంలో కంది పంటను సాధారణ సాగుకంటే డబుల్‌ చేయించాలని వ్యవసాయశాఖ అంచనాలు రూపొందిస్తోంది. వచ్చే సీజన్‌లో 15 నుంచి 20 లక్షల ఎకరాలకు విస్తరించాలని భావిస్తోంది. పంట దిగుబడిని కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో కందిని మరింత విస్తరించే కార్యక్రమానికి శ్రీకారం చూడుతోంది.

అలాగే సోయా సాగుకు రాష్ట్రంలో విస్త్రృత అవకాశాలు ఉన్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌ తదితర ప్రాంతాల్లో సోయాను సాగు చేసేందుకు రైతులు ముందుకొస్తున్నారు. అయితే సోయా విత్తనాలు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. రైతులు ఎలాగోలా విత్తనాలు కొనుగోలు చేసే అవకాశముంది. 

ఈ నెలలోనే రైతుబంధు.. 
ఇక ఈ సీజన్‌కు 25 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం పడతాయని వ్యవసాయశాఖ నిర్ణయించింది. ఇప్పటికే 4 లక్షల మెట్రిక్‌ టన్నులకు పైగా యూరియా రాష్ట్రంలో అందుబాటులో ఉంది. 10 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం. ఈ మేరకు కేటాయింపులు జరపాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఇక ఈ నెలలోనే రైతుబంధు సొమ్ము విడుదల కానుంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement