పోలీసులకే షాక్‌ ఇచ్చిన దొంగ.. పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే..

Moinabad: Thief Stolen Scooty In Front Of Police Station - Sakshi

ఠాణా ఎదుటే స్కూటీ చోరీ

ఎఫ్‌ఐఆర్‌లో తప్పుడు వివరాలు నమోదు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

సాక్షి, మొయినాబాద్‌: ఓ దొంగ పోలీసులకే షాక్‌ ఇచ్చాడు. ఎక్కడో చాటుమాటున దొంగతనం చేస్తే కిక్‌ ఏముంటుందనుకున్నాడో ఏమో... ఏకంగా ఠాణా ఎదుట నిలిపి ఉంచిన స్కూటిని అపహరించి పోలీసులకు సవాల్‌ విసిరాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన మండలంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. మండల పరిధిలోని కేతిరెడ్డిపల్లికి చెందిన మంగలి నర్సింలు ఓ కేసు విషయంలో మూడు రోజుల క్రితం మొయినాబాద్‌ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. సాయంత్రం 5 గంటల సమయంలో పోలీస్‌స్టేషన్‌ ఎదుట తన టీవీఎస్‌ స్కూటీని పార్కుచేసి లోపలికి వెళ్లాడు. రాత్రి 8 గంటల సమయంలో బయటకు వచ్చి చూడగా స్కూటీ కనిపించలేదు. కొద్దిదూరంలో మరో స్కూటీ పార్కుచేసి ఉంది. 

మళ్లీ.. మళ్లీ రావొద్దు 
తన స్కూటీ పోయిందని నర్సింలు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి దానిని పోలీస్‌స్టేషన్‌ ఎదుట పార్కుచేసి నర్సింలు స్కూటీని తోసుకుంటూ వెళ్లినట్లు సీసీ కెమరాల్లో రికార్డు అయింది. రెండు రోజుల తరువాత పోలీసులు కేసు నమోదు చేసి ఎఫ్‌ఐఆర్‌ను బాధితుడి చేతిలో పెట్టారు. తన స్కూటీ కోసం నర్సింలు రోజూ పోలీస్‌స్టేషన్‌ చుట్టూ తిరుగుతుండడంతో మళ్లీమళ్లీ రావద్దని.. స్కూటీ దొరికినప్పుడు పిలుస్తామని పోలీసులు చెప్పి పంపడం గమనార్హం. పోలీస్‌స్టేషన్‌ ఎదుట వదిలేసి వెళ్లిన స్కూటీ ఎవరిదనే విషయమై ఆరా తీస్తే అది ఆంధ్రప్రదేశ్‌కు చెందినదిగా గుర్తించినట్లు సమాచారం. పోలీస్‌స్టేషన్‌ ముందు నుంచి స్కూటీ చోరీకి గురవగా.. తహసీల్దార్‌ కార్యాలయం ముందు నుంచి దొంగిలించారని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు నమోదు చేయడం గమనార్హం.  
చదవండి: న్యూఇయర్‌ వేడుకల అనుమతులపై అభ్యంతర పిటిషన్‌

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top