పదకొండేళ్ల క్రితం మొరాదాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం
పెద్దల సభ ఎన్నికకు ముందే మంత్రిగా ప్రమాణ స్వీకారం
పదవికి కలిసి వచ్చిన మైనారిటీ, హైదరాబాద్ కోటా
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో వరించిన అదృష్టం
సాక్షి, హైదరాబాద్: పక్కా హైదరాబాదీ. భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజహరుద్దీన్ (అజ్జూ భాయ్) మినిస్టర్ బన్‌గయా. శుక్రవారం రేవంత్ సర్కార్ మంత్రి వర్గంలో కొత్తగా చేరిపోయారు. పదకొండేళ్ల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన అజహరుద్దీన్.. సొంత గడ్డపై తాజాగా పెద్దల సభకు ఎంపికై.. ఆమోదానికి ముందే మంత్రిగా ప్రమాణం చేశారు. రాష్ట్ర మంత్రి వర్గంలో బెర్త్‌కు మైనారిటీ కేటగిరీ, హైదరాబాద్ కోటా కలిసి వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి పదవి వరించినట్లయింది.
రెండేళ్ల క్రితం జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన ఓటమి పాలైన అజహరుద్దీన్.. ఉప ఎన్నికల్లో తిరిగి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా కాంగ్రెస్ అధిష్టానం ఆయనను ఎన్నికల బరి నుంచి తప్పించి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసి సిఫార్సు చేసింది. అయితే.. గవర్నర్ వద్ద ఎమ్మెల్సీ నియామక దస్త్రం పెండింగ్‌లో ఉండటంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన అంటీముట్టనట్లు ఉండిపోయారు. మరోవైపు అధికార కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో సుమారు 24 శాతం మైనారిటీలు ఉండటంతో మంత్రి పదవి ఇచి్చనట్లు కనిపిస్తోంది.
కాంగ్రెస్‌తోనే రాజకీయ అరంగేట్రం
భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్.. కాంగ్రెస్‌తోనే రాజకీయ అరంగేట్రం చేసి తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. రెండు పర్యాయాలు పార్లమెంట్‌కు, ఒకసారి అసెంబ్లీ స్థానానికి పోటీ చేసినా.. ఒకసారి మాత్రమే ఆయన విజయం సాధించారు. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యరి్ధగా బరిలో దిగి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 2014లో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ లోక్‌సభ స్థానం కాంగ్రెస్ అభ్యరి్థగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఆయన సొంత రాష్ట్రం తెలంగాణపై దృష్టి సారించారు. 2023 సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో తిరిగి పోటీ చేసేందుకు ఆసక్తి కనబర్చగా.. అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవికి సిఫార్సు అయి తాజాగా మంత్రిగా ప్రమాణం చేశారు.
మణికట్టుతో కనికట్టు..
టీమ్ ఇండియా కెప్టెన్ తనదైన ముద్రతో పాటు మణికట్టు కదలికలతో బ్యాట్‌ను సొగసుగా తిప్పుతూ పరుగుల వరద పారించడంలో అజహరుద్దీన్ దిట్ట. మొత్తం కెరీర్‌లో 99 టెస్ట్ మ్యాచ్‌లు, 334 వన్డేలు ఆడిన అజహర్..Œ Œ 47 టెస్ట్‌లు, 174 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించారు. అజహరుద్దీన్ నాయకత్వలో టీమ్ ఇండియా 14 టెస్టులు, 90 వన్డేలు సాధించింది. అత్యధిక విజయాల కెపె్టన్‌గా అజహర్‌కు పేరుంది. కాగా.. 2000లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో చిక్కుకుని సీబీఐ విచారణను ఎదుర్కొన్నారు. బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. కొద్ది రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆయనను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేసింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోయిన అజహరుద్దీన్.. రాజకీయాలపై దృష్టి సారించి ఏకంగా మంత్రి అయ్యారు.


