
ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలకకు చెందిన ఆదర్శ రైతు చెరుకూరి రామారావు తన కుమారుడి వివాహాన్ని ప్లాస్టిక్‌కు దూరంగా, సేంద్రియ ఎరువులతో పండించిన కూరగాయల వంటలతో జరిపించారు. ఈ విషయమై ‘ఆదర్శ రైతు ఇంట.. ఆర్గానిక్ పెళ్లంట’శీర్షికన ఆదివారం ‘సాక్షి’ప్రధాన సంచికలో కథనం ప్రచురితమైంది.
ఇది చూసిన వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి రైతు రామారావుకు సోమవారం ఫోన్ చేసి మాట్లాడారు. ఆర్గానిక్ పెళ్లి చేయటం అభినందనీయమని చెబుతూ వధూవరులు కిరణ్, ఉదయశ్రీకి శుభాకాంక్షలు తెలిపారు. ఈసారి ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు కోయచెలకలోని ఆర్గానిక్ క్షేత్రాన్ని సందర్శిస్తానని, మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన కిరణ్ స్వయంగా ఆర్గానిక్ ఉత్పత్తుల స్టాల్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు.