దళిత, గిరిజనులకు కేంద్రం చేసిందేంటి?

Minister Satyavathi Rathod Criticized BJP Government - Sakshi

రిజర్వేషన్లు పెంచాలని కోరితే ఇప్పటికీ స్పందనలేదు: సత్యవతి రాథోడ్‌   

సాక్షి, హైదరాబాద్‌: దళిత, గిరిజనుల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏడున్నరేళ్లుగా చేసిందేమీ లేదని  మంత్రి సత్యవతి రాథోడ్‌ విమర్శించారు. గురువారం టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో రైతు బంధు సమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎంపీ మాలోత్‌ కవిత, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, హరిప్రియ నాయక్‌లతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. బీజేపీ నేతలు కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, పోడు చట్టం కేంద్రం పరిధిలో ఉంటుందనే విషయం కూడా వారికి తెలియకపోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు.

పోడు భూములపై ముఖ్యమంత్రి కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశారని, అర్హులైన వారికి భూ హక్కుల కల్పన కోసం తీసుకున్న దరఖాస్తులను త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, పోడు భూముల హక్కుల కోసం నాలుగున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, ఈ సమస్యకు త్వరగా పరిష్కారం కావాలంటే కేంద్రంపై బీజేపీ నేతలు ఒత్తిడి పెంచాలన్నారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top