పార్టీ సైన్యానికి కేటీఆర్‌ దిశానిర్దేశం

Minister KTR Target On GHMC Elections In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గత కొద్ది రోజులుగా నిత్యం సమీక్షలు..అభివృద్ధిపనులపై ఆరాలు..అధికారులు, ప్రజాప్రతినిధులతోసమావేశాలతో మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌బిజీబిజీగా ఉంటున్నారు. గ్రేటర్‌లో అన్ని రకాల పథకాలు పరుగులు పెట్టాలని ఆయన ఆదేశిస్తూ వస్తున్నారు. ఇంత హడావుడి ఎందుకంటే... మరికొద్ది నెలల్లో రానున్నజీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా కేటీఆర్‌
పనిచేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు. ఇటీవలసీఎం కేసీఆర్‌ గ్రేటర్‌లో మళ్లీ గెలుపు మాదే.. వంద సీట్లు ఖాయం అని ప్రకటించడం కూడా ఇందుకు ఊతమిస్తోంది. ఇక ముఖ్యమైన ఎస్సార్‌డీపీ పనులు, డబుల్‌బెడ్‌ రూం ఇళ్లు, ఇతర సంక్షేమ పథకాలు బాగా అమలైతేనే ప్రజల ఆదరణ లభిస్తుందని టీఆర్‌ఎస్‌ నేతలు భావిస్తున్నారు. అందుకేపెండింగ్‌ పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని
కోరుతున్నారు. 

నగరంలో కొత్తకొత్తగా ఎన్నెన్నో పార్కులు. పంచతత్వ మొదలుకొని  వివిధ థీమ్‌లు. జంక్షన్ల సుందరీకరణలు, ఫుట్‌పాత్‌ల అభివృద్ధి. వందల్లో బస్తీ దవాఖానాలు, వేల సంఖ్యలోపబ్లిక్‌ టాయ్‌లెట్లు.. ఏ జోన్‌లో ఎంతవరకొచ్చాయనే అంశాలపై నిత్యసమీక్షలు. కొద్దికాలంగా మునిసిపల్‌ మంత్రి కేటీఆర్‌ జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లతోనే సమీక్షలు నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు పనులు వేగవంతం చేయాలని ఆదేశిస్తున్నారు. ఐదేళ్ల కిందటి బీఆర్‌ఎస్‌ ఫైళ్ల పరిష్కారంపై దృష్టి సారించారు. హైకోర్టు ఆదేశమే ఆలస్యం అన్నట్లుగా రెడీగా ఉండాలని  ఆదేశించారు. ఎల్‌ఆర్‌ఎస్‌కు మరో దఫా అవకాశం కల్పించారు. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఆస్తిపన్ను బకాయిలపై వడ్డీలను 90 శాతం మాఫీ చేశారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపైనా ప్రత్యేక దృష్టి సారించారు. డిసెంబర్‌లోగా 85 వేలు పంపిణీ చేస్తామంటున్నారు. ఇంతకీ ఇవన్నీ ఎందుకు? వేరుగా చెప్పాల్సిందేముంది. బల్దియా పాలకమండలి గడువు ఫిబ్రవరిలో ముగుస్తుంది.

అంటే దాదాపుగా జనవరి– ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే వీలుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ కంటే ముందే సంక్షేమ ఫలాలు ప్రజలకందాలి. అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి కావాలి.  ఈ లక్ష్యంతోనే  ఈ ఏడాది ఆరంభం నుంచే వివిధ పనుల వేగం పెంచారు. కలిసివచ్చిన లాక్‌డౌన్‌ కాలంతో ఫ్లై ఓవర్ల వంటి భారీ పనులూ పూర్తిచేశారు. రోడ్ల నిర్వహణను ప్రైవేట్‌ ఏజెన్సీలకప్పగించారు. ఆయా మార్గాల్లో లింక్‌రోడ్లూ వేగంగా పూర్తిచేస్తున్నారు. ఇవన్నీ ఎన్నికల కోసమే అని అందరికీ తెలిసినప్పటికీ.. స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ఎన్నికలకు సిద్ధం కండంటూ తాజాగా సూచించారు. బల్దియా ఎన్నికల్లో గతంలో మాదిరే దాదాపు వంద సీట్లకు తగ్గవని, అన్ని సర్వేలూ అవే చెప్పాయని పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో తెలిపారు. దీంతో పార్టీ శ్రేణుల్లో ఇప్పటికే  రాజుకున్న   బల్దియా ఎన్నికల వేడి పెరిగింది. మంత్రి కేటీఆర్‌ ఇప్పటికే గ్రేటర్‌ పరిధిలోకి వచ్చే పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా  పార్టీనేతలు, ప్రజాప్రతినిధులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.

హామీలిచ్చి నెరవేర్చని పనులేమైనా ఉంటే చెప్పండి పరిష్కరిస్తానన్నారు. చేసిన పనుల్ని మాత్రం ప్రజల్లోకి తీసుకువెళ్లి రానున్న బల్దియా ఎన్నికల్లో మరింత మెజార్టీ చూపాల్సిన బాధ్యత మీదేనన్నారు. తమ నియోజకవర్గాల్లో కార్పొరేటర్లను గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. అంతేకాదు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కేటాయింపు, తదితర సంక్షేమ కార్యక్రమాల్లోనూ వారికి ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు నిత్యం వివిధ కార్యక్రమాల్లో తలమునకలవుతున్నారు. డివిజన్లస్థాయిలో  పనుల గురించి తెలుసుకుంటున్నారు. మిగతా ప్రజాప్రతినిధులూ బీజీగానే ఉన్నారు. 

ప్రచారాస్త్రాలు దండిగానే..
ప్రజల్లో ప్రచారం చేసుకునేందుకు చేసిన పనులు చాలానే ఉన్నాయి. ఎస్సార్‌డీపీలో భాగంగా పూర్తయిన ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు ఉండనే ఉన్నాయి. అతి త్వరలో దుర్గం చెరువు కేబుల్‌ బ్రిడ్జి, జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 45 కారిడార్‌ ప్రారంభం కానున్నాయి. ఎస్సార్‌డీపీలో భాగంగా ఇప్పట్లో  పూర్తవ్వాల్సిన పనులంటూ లేవు. మరింత వేగం పెంచితే కైతలాపూర్, హైటెక్‌సిటీల్లోని ఆర్‌ఓబీ, ఆర్‌యూబీలకు అవకాశముంది. వాటినీ పూర్తిచేయాలని సూచిస్తున్నారు. గడచిన నాలుగున్నరేళ్లలో చేసిన పనులన్నీ వచ్చే నాలుగునెలల్లో ప్రజల మదిలో నిలిచేలా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. ఆదిశగా ఇప్పటికే మార్గనిర్దేశం చేశారు.  

‘దుర్గం’ జిలుగుల్‌..18న ప్రారంభం ..? 
దుర్గం చెరువు కేబుల్‌బ్రిడ్జిని గతనెల మూడోవారంలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్‌ ప్రకటించినప్పటికీ, దానికి ఏర్పాటు చేయనున్న స్పెషల్‌ లైటింగ్‌ పనులకు సంబంధించిన మెటీరియల్‌ చైనా నుంచి రావడంలో జరిగిన జాప్యంతో ప్రారంభం కాలేదు. ప్రస్తుత సమాచారం మేరకు బహుశా ఈనెల 18వ తేదీన దుర్గం చెరువును ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానికోసమే ఆపిన రోడ్‌నెంబర్‌ 45 కారిడార్‌నూ దాంతోపాటే ప్రారంభించనున్నారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top