సాక్షి, న్యూఢిల్లీ: కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రం పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఇక్కడ రైళ్ల తయారీ ప్రారంభం కానుంది. తొలిదశలో భాగంగా రాబోయే ఐదేళ్లలో కాజీపేట యూనిట్ నుంచి 200 ఇంటర్‌సిటీ రైళ్లను ఉత్పత్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ యూనిట్ కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికలపై కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి రవ్‌నీత్ సింగ్ బిట్టు ఉన్నతాధికారులతో కలిసి గురువారం సమీక్షించారు. కాజీపేట యూనిట్‌లో ప్రధానంగా ఇంటర్‌సిటీ రైళ్ల తయారీపై దృష్టి సారించనున్నట్టు వెల్లడించారు. దేశవ్యాప్తంగా పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థను విస్తరించడంలో భాగంగా రైల్వే శాఖ ఈ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది.
300 కిలోమీటర్లలోపు ప్రయాణాలకే..
కొత్తగా తయారయ్యే ఈ రైళ్లను ప్రధానంగా 300 కిలోమీటర్ల లోపు ఉన్న నగరాలు, పట్టణాలను కలుపుతూ షటిల్ సర్వీసులలా నడపనున్నారు. తక్కువ దూర ప్రయాణాలకు ఇవి ఎంతో అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు, ఉద్యోగులు, దైనందిన ప్రయాణికుల సౌలభ్యం కోసం ఈ రైళ్లకు ఎక్కువ స్టాప్‌లు ఇవ్వనున్నారు.
20 కోచ్‌లు.. హైటెక్ వసతులు..
ఒక్కో రైలులో 20 కోచ్‌లు ఉంటాయి. అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో వీటిని డిజైన్ చేస్తున్నారు. ఆటోమేటిక్ డోర్ క్లోజింగ్, మెరుగైన వెంటిలేషన్ సదుపాయాలతోపాటు ప్రతి కోచ్‌కు రెండు మరుగుదొడ్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు కుదుపులు లేని సాఫీ ప్రయాణాన్ని అందించేందుకు ఆధునిక కప్లర్‌లు, బోగీలను ఈ రైళ్లలో వినియోగిస్తున్నారు.
గంటకు 130 కి.మీ. వేగం.. పర్యావరణ హితం..
ఈ ఇంటర్‌సిటీ రైళ్లు గంటకు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటాయి. పర్యావరణ పరిరక్షణలో భాగంగా వీటిలో అత్యాధునిక రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రయాణంలో బ్రేకులు వేసినప్పుడు ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను తిరిగి గ్రిడ్‌కు పంపుతారు. దీనివల్ల ఇంధనం ఆదా అవడంతోపాటు, కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. సామాన్యులకు చౌకైన, పరిశుభ్రమైన ప్రయాణాన్ని అందించడం ద్వారా రోడ్డు రవాణా మీదున్న ట్రాఫిక్ భారాన్ని రైల్వే నెట్‌వర్క్‌పైకి మళ్లించాలన్నది రైల్వేశాఖ ప్రధాన ఉద్దేశం.


