రుణ ఒప్పంద పత్రాలను చూపుతున్న సీఎస్ రామకృష్ణారావు, ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ, సీఈఓ మనోజ్ కుమార్ దూబే
వర్కింగ్ క్యాపిటల్ కోసం రుణాన్ని రీఫైనాన్స్ చేసిన ఐఆర్‌ఎఫ్‌సీ
తెలంగాణ ప్రభుత్వం, ఐఆర్‌ఎఫ్‌సీ మధ్య ఢిల్లీలో చరిత్రాత్మక ఒప్పందం
పూర్తి ప్రభుత్వ యాజమాన్య ఆస్తిగా మారిన మెట్రో ప్రాజెక్టు
భవిష్యత్ విస్తరణ ప్రణాళికలు, కొత్త కారిడార్ల నిర్మాణానికి మార్గం సుగమం
సాక్షి, న్యూఢిల్లీ/హైదరాబాద్: హైదరాబాద్ నగర రవాణా రంగంలో సరికొత్త అధ్యాయం మొదలైంది. లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) నుంచి హైదరాబాద్ మెట్రో రైల్ మొదటి విడతను తెలంగాణ ప్రభుత్వం పూర్తిస్థాయిలో టేకోవర్ చేసుకుంది. ఈ క్రమంలో ప్రాజెక్టు బలోపేతానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్‌ఎఫ్‌సీ) ద్వారా రూ. 13,600 కోట్ల వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్‌ను ప్రభుత్వం పొందింది. సోమవారం ఢిల్లీలో ఐఆర్‌ఎఫ్‌సీ, ఎల్ అండ్ టీ మెట్రో రైల్, హెచ్‌ఎమ్‌ఆర్‌ఎల్ ప్రతినిధుల మధ్య ఈ మేరకు రుణ ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగాయి. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, ఐఆర్‌ఎఫ్‌సీ సీఎండీ, సీఈఓ మనోజ్ కుమార్ దూబే, హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్‌లో సుస్థిరమైన, ప్రజానుకూల రవాణా వ్యవస్థను నిర్మించేందుకు ఈ ఒప్పందం కీలక మైలురాయిగా నిలుస్తుందని సీఎస్ రామకృష్ణారావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. మరోవైపు జూన్ ఒకటో తేదీ నుంచి మెట్రో రైల్ నిర్వహణ బాధ్యతల నుంచి ఎల్ అండ్ టీ వైదొలగనుంది. అధికారులు, సాంకేతిక నిపుణుల సహాయ సహకారాలు మాత్రం కొంతకాలంపాటు కొనసాగుతాయి. ప్రభుత్వమే వారికి జీతాలను చెల్లిస్తుంది. అలాగే ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లోగోను కూడా మార్చనున్నారు. రెండో దశ మెట్రో రైల్ నిర్మాణం కూడా చేపట్టనున్న దృష్ట్యా భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకొని మెట్రోరైల్ బ్రాండ్‌కు తగినవిధంగా పేరు, లోగో, తదితర అంశాల్లో ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
ఇకపై ప్రభుత్వ ఆస్తిగా మెట్రో...: ఎల్ అండ్ టీ మెట్రో రైల్‌లోని 100 శాతం వాటాను హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం స్వా«దీనం చేసుకున్న అనంతరం ఈ రీఫైనాన్సింగ్ ప్రక్రియ అమలులోకి వచ్చింది. దీంతో 69.2 కి.మీ. పొడవు, 57 స్టేషన్లతో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న హైదరాబాద్ మెట్రో మొదటి దశ ఇకపై పూర్తిస్థాయిలో ప్రభుత్వ వ్యూహాత్మక ప్రజారవాణా ఆస్తిగా మారింది.
ఒప్పందం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు
– అధిక వడ్డీతో కూడిన పాత రుణాల స్థానంలో తక్కువ వ్యయంతో కూడిన దీర్ఘకాలిక రీఫైనాన్సింగ్ లభించడం వల్ల మెట్రో ప్రాజెక్టుకు భారీ ఆర్థిక ఉపశమనం లభిస్తుంది.
– తాజాగా సమకూరిన రూ. 13,600 కోట్ల నిధులను నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు, కమర్షియల్ పేపర్లు, వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్‌కు వినియోగించి ప్రస్తుత రుణదాతలకు క్రమబద్ధమైన ఎగ్జిట్ కల్పిస్తారు.
– ఈ రుణం 20 ఏళ్ల కాలపరిమితితో, త్రైమాసిక చెల్లింపుల సౌలభ్యంతో రూపొందడం వల్ల ప్రభుత్వంపై తక్షణ భారం పడదు.
– ఈ లావాదేవీకి రాష్ట్ర ప్రభుత్వ చెల్లింపు గ్యారంటీతోపాటు ఆర్‌బీఐ మద్దతు గల డైరెక్ట్ డెబిట్ మాండేట్ వంటి బలమైన రక్షణ వ్యవస్థలు మద్దతుగా నిలిచాయి.
– ప్రస్తుత రుణ భారం తగ్గడంతో భవిష్యత్ మెట్రో విస్తరణ ప్రణాళికలు, కొత్త కారిడార్ల నిర్మాణం, చివరి మైలు అనుసంధాన పనులను వేగవంతం చేయడానికి మార్గం సుగమమైంది.


