‘మహాలక్ష్మి’ దెబ్బకు కొత్త కేటగిరీ బస్సులు | Metro Deluxe Launching Soon: Hyderabad | Sakshi
Sakshi News home page

‘మహాలక్ష్మి’ దెబ్బకు కొత్త కేటగిరీ బస్సులు

Jul 29 2024 4:45 AM | Updated on Jul 29 2024 1:30 PM

Metro Deluxe Launching Soon: Hyderabad

టౌన్లకు సెమీ డీలక్స్, సిటీకి మెట్రో డీలక్స్‌ త్వరలో ప్రారంభం

వాటిల్లో మహిళలూ టికెట్‌ కొనాల్సిందే

‘ఉచిత ప్రయాణం’తో సీట్లు దొరక్క ప్రత్యామ్నాయాల వైపు మళ్లుతున్న ప్రయాణికులు

వారిని ఆకర్షించేందుకే కొత్త కేటగిరీ బస్సులు

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో కొత్తగా రెండు కేటగిరీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి. ప్రధాన పట్టణాల మధ్య సెమీ డీలక్స్‌ బస్సులు, నగరంలో మెట్రో డీలక్స్‌ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే కొన్ని బస్సులు డిపోలకు చేరాయి. త్వరలో వాటిని ప్రభుత్వం ప్రారంభించనుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పించడంతో ఆర్టీసీకి టికెట్‌ ఆదాయం ఒక్కసారిగా పడిపోయింది.

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రభుత్వం.. పూర్తి మొత్తాన్ని ఎప్పటికప్పుడు రీయింబర్స్‌ చేయలేకపోతోంది. ఇప్పటివరకు రీయింబర్స్‌ చేయాల్సిన మొత్తంలో దాదాపు రూ. 610 కోట్లు బకాయిపడింది. ఇది ఆర్టీసీకి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. దీంతో ఆదాయాన్ని పెంచుకొనేందుకు రెండు కొత్త కేటగిరీ బస్సులను ఆర్టీసీ రోడ్డెక్కించనుంది.

ఎక్స్‌ప్రెస్‌ కన్నా కాస్త ఎక్కువ టికెట్‌ ధరతో.. 
ప్రస్తుతం ఆర్టీసీలో పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌ లగ్జరీ, గరుడ బస్సులు తిరుగుతున్నాయి. ఆర్టీసీకి బాగా ఆదాయాన్ని తెచి్చపెట్టేవి ఎక్స్‌ప్రెస్‌ బస్సులే. అందుకే వాటి సంఖ్య మిగతావాటి కంటే చాలా ఎక్కువ. కానీ మహిళలకు పల్లెవెలుగుతోపాటు ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణాలను అమలు చేస్తుండటంతో సంస్థ ఆదాయం సగానికి సగం పడిపోయింది. డీలక్స్‌ కేటగిరీ బస్సులున్నా వాటికి ఆదరణ తక్కువే. అందుకే వాటి సంఖ్య కూడా నామమాత్రంగానే ఉంది.

ఇప్పుడు ఈ రెండు కేటగిరీల మధ్య సెమీ డీలక్స్‌ కేటగిరీని ఆర్టీసీ ప్రవేశపెడుతోంది. ఎక్స్‌ప్రెస్‌ కంటే వాటిల్లో టికెట్‌ ధర 5–6 శాతం ఎక్కువగా, డీలక్స్‌ కంటే 4 శాతం తక్కువగా ఉండనుంది. ఎక్స్‌ప్రెస్‌ బస్సులతో పోలిస్తే సీట్లు కూడా మెరుగ్గా ఉంటాయి. ఎక్స్‌ప్రెస్‌ బస్సులకు డిమాండ్‌ ఉన్న రూట్లలో వాటిని తిప్పాలని నిర్ణయించారు. ఉచిత ప్రయాణ వసతితో బస్సుల్లో మహిళల సంఖ్య బాగా పెరిగి పురుషులకు సీట్లు దొరకటం కష్టంగా మారింది.

దీంతో పురుషుల్లో దాదాపు 20 శాతం మంది ప్రత్యామ్నాయ వాహనాలకు మళ్లుతున్నారని ఇటీవల ఆర్టీసీ గుర్తించింది. ఇప్పుడు అలాంటి వారు ఈ బస్సులెక్కుతారని భావిస్తోంది. ఇక ఎక్స్‌ప్రెస్‌ బస్సుల కోసం ఎదురుచూసే మహిళా ప్రయాణికుల్లో 10–15 శాతం మంది ఈ బస్సులెక్కే సూచనలున్నాయని భావిస్తోంది. ఎక్స్‌ప్రెస్‌ కంటే తక్కువ స్టాపులు ఉండటంతో ప్రత్యామ్నాయ వాహనాల్లో వెళ్లే ప్రయాణికులు కొందరు సెమీ డీలక్స్‌ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉంది.

ఆ సర్వీసు మళ్లీ పునరుద్ధరణ
గతంలో సిటీలో మెట్రో డీలక్స్‌ కేటగిరీ బస్సులు తిరిగేవి. బస్సులు పాతబడిపోవటంతో వాటిని తొలగించారు. తర్వాత ప్రారంభించలేదు. ఇప్పుడు మళ్లీ వాటిని పునరుద్ధరించబోతున్నారు. నగరంలో ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ వసతి ఉంది. దీంతో టికెట్‌ ఆదాయం బాగా పడిపోయింది. ఇప్పుడు మెట్రో డీలక్స్‌ బస్సుల్లో మహిళలు కూడా టికెట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. రద్దీ పెరిగి నిలబడేందుకు కూడా వీలు లేని సమయాల్లో కొందరు మహిళలు కూడా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. అలాంటి వారు ఈ కొత్త కేటగిరీ బస్సులెక్కే వీలుంటుంది. వెరసి వీటి వల్ల ఆదాయం ఎక్కువే ఉంటుందని భావిస్తున్న సిటీ అధికారులు.. 300 బస్సులను రోడ్డెక్కించాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement