దేశంలో తొలిసారి రైలు ద్వారా తరలింపు
తిమ్మాపూర్‌లో ప్రైవేటు కంటైనర్ సైడింగ్ నుంచి నిర్వహణ
దక్షిణ మధ్య రైల్వే, జపాన్‌కు చెందిన వన్ సంస్థ, డీపీఎంటీ భాగస్వామ్యం
44 గంటల్లో ముంబై పోర్టుకు చేరుకున్న సరుకు
ఫార్మా హబ్ హైదరాబాద్ అరుదైన రికార్డు
సాక్షి, హైదరాబాద్: దేశంలో తొలిసారి హైదరాబాద్ నుంచి రిఫ్రిజిరేటెడ్ (రీఫర్) కంటైనర్లలో బల్క్ డ్రగ్, ఇతర ఔషధాలు రైలు మార్గంలో ముంబై పోర్టుకు తరలింపు మొదలైంది. ఫార్మా హబ్‌గా ఎదిగిన హైదరాబాద్ నగరం నుంచి విదేశాలకు బల్క్‌డ్రగ్, సాధారణ మందులు ఎగుమతి అవుతుంటాయి. మందులను తయారు చేసే కంపెనీలు రోడ్డు మార్గాన వాటిని పోర్టుకు తరలిస్తూ వస్తున్నాయి. ఈ తంతు ఇబ్బందికరంగా మారటంతో ఇప్పుడు ప్రైవేటు సైడింగ్, జపాన్ సంస్థల భాగస్వామ్యంతో దక్షిణ మధ్య రైల్వే రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లతో కూడి భారీ సరుకు రవాణా రైళ్లను నడపటం ప్రారంభించింది.
ముంబైలోని పోర్టుకు తక్కువ సమయంలో వాటిని తరలిస్తుండగా, అక్కడి నుంచి ఓడల్లో విదేశాలకు అవి ఎగుమతి అవుతున్నాయి. తాజాగా అమెరికాకు 90 రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లలో బల్క్ డ్రగ్, ఇతర మందులను నగర శివారులోని తిమ్మాపూర్ ప్రైవేట్ కంటైనర్ సైడింగ్ ద్వారా ముంబై పోర్టుకు తరలించింది. ఇక నుంచి వారం పదిరోజులకో రేక్‌ను అలా నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఒకేసారి అన్ని కంపెనీల సరుకు..
విదేశాలకు ఎగుమతి అవుతున్న ఔషధాలు, బల్క్ డ్రగ్‌లో దాదాపు 80 శాతం హైదరాబాద్‌లోనే తయారవుతున్నాయి. ఇక్కడి కంపెనీలు వేటికవిగా తమ ఉత్పత్తులను ముంబై పోర్టుకు తరలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని తిమ్మాపూర్‌లో ఉన్న డొమెస్టిక్ ప్రైవేట్ మల్టీ టెరి్మనల్ (డీపీఎంటీ) సంస్థ ఫార్మా కంపెనీలతోపాటు దక్షిణ మధ్య రైల్వేతో ఒప్పందం చేసుకుంది. ఇక నుంచి రోడ్డు మార్గాన వేటికవిగా కాకుండా ఒకేసారి రైలు ద్వారా తరలించేలా ఒప్పందం జరిగింది. ఇందుకోసం మందులు, బల్క్ డ్రగ్‌కు నిర్ధారిత టెంపరేచర్ ఉండేలా రిఫ్రిజిరేటెడ్ (రీఫర్) కంటెయినర్లను వినియోగిస్తున్నారు. ప్రసుత్తం ఈ తరహా కంటైనర్లు అందుబాటులో లేవు. దీంతో జపాన్‌కు చెందిన ఓషియన్ ఎక్స్‌ప్రెస్ నెట్‌వర్క్ (ఓఎన్‌ఈ)తో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ సంస్థ కావాల్సినన్ని రీఫర్ కంటైనర్లను అందుబాటులో ఉంచింది.
44 గంటల్లోనే ముంబై పోర్టుకు...
సాధారణంగా సరుకు రవాణా రైళ్లు చాలా నెమ్మదిగా కదులుతుంటాయి. హైదరాబాద్ నుంచి ముంబై పోర్టుకు సరుకు రవాణా రైలు ఎలాంటి ఆటంకం లేకుండా సాగితే దాదాపు 65 గంటల నుంచి 70 గంటల సమయం తీసుకుంటుంది. అలా ఆలస్యంగా సాగితే రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లకు విద్యుత్తు సరఫరాలో ఇబ్బంది ఏర్పడుతుంది. రైలు చివరలో ఉండే జనరేటర్ కార్ కేవలం 72 గంటలే పనిచేస్తుంది. దీంతో ముంబై పోర్టుకు 72 గంటల్లోగా మందులు చేర్చాల్సి ఉంది.
కానీ, తాజాగా దక్షిణ మధ్య రైల్వే కేవలం 44 గంటల్లోనే రైలును గమ్యస్థానం చేర్చి బల్క్ డ్రగ్, మందులను అన్‌లోడ్ చేయగలిగింది. ఇందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ఇతర రైళ్ల కోసం ఈ రైలును ఆపకుండా సిగ్నల్ ఫ్రీకి చర్యలు తీసుకుంది. దాని వేగాన్ని కూడా పెంచి నడిపింది. ఇందుకు శక్తివంతమైన లోకోమోటివ్‌లను వినియోగించారు. ఇక నుంచి ప్రతి బుధవారం ఒక రిఫ్రిజిరేటెడ్ కంటైనర్లతో కూడిన రేక్‌ను నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


