దొంగతనం చేశాడన్న అనుమానంతో.. | Sakshi
Sakshi News home page

దొంగతనం చేశాడన్న అనుమానంతో..

Published Fri, Feb 10 2023 2:59 AM

Medak Police crushed Person Due To Suspicion Of Theft - Sakshi

మెదక్‌జోన్‌: మెదక్‌ జిల్లా కేంద్రంలో పోలీసులు ఓ వ్యక్తిని దొంగతనం చేశాడన్న అనుమానంతో ఐదు రోజులపాటు చితకబాదారు. గురువారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితుడి భార్య సిద్ధేశ్వరి కథనం ప్రకారం.. మెదక్‌ పట్టణంలోని అరబ్‌గల్లిలో జనవరి 29వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ చేశాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా హైదరాబాద్‌లో పని చేసుకునే పిట్లంబేస్‌ వీధికి చెందిన మహ్మద్‌ ఖదీర్‌ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ పేరుతో ఐదు రోజులపాటు కొట్టారు.

అతడి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో తహసీల్దార్‌ ఎదుట బైండోవర్‌ చేసి ఈనెల 2న వదిలిపెట్టారు. ఇంటికి వెళ్లిన బాధితుడు పోలీసులు కొట్టిన దెబ్బలకు మంచం పట్టాడు. ఈనెల 6వ తేదీన కుటుంబీకుల సహాయంతో కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత చికిత్స నిమిత్తం అతడిని కుటుంబ సభ్యులు మెదక్‌ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు.

పోలీసులు తీవ్రంగా కొట్టడంతో కిడ్నీలు దెబ్బతిన్నాయని, చేతులు పనిచేయడం లేదని గురువారం బాధితుడి భార్య తెలిపింది. హైదరాబాద్‌లో లేబర్‌ పనిచేసుకునే తన భర్త ఖదీర్‌ను పోలీసులు అకారణంగా చితకబాదారని ఆరోపించింది. తన భర్త పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయంలో పోలీసు ఉన్నతాధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది. 

బాధితుడి కిడ్నీలు దెబ్బతిన్నాయి 
మహ్మద్‌ ఖదీర్‌కు దెబ్బలు బలంగా తగలడంతో రెండు కిడ్నీలు దెబ్బతిని చేతులు వాపు వచ్చాయి. ఇక్కడ వైద్యం చేసినా ఫలితం లేకపోవడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి రెఫర్‌ చేశాం.  
–డాక్టర్‌ సంతోశ్, మెదక్‌ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడు 

Advertisement
Advertisement