100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్‌ | Massive RTC Bus Terminal Planned Across 100 Acres: Telangana | Sakshi
Sakshi News home page

100 ఎకరాల్లో ఆర్టీసీ భారీ టెర్మినల్‌

Apr 4 2026 5:46 AM | Updated on Apr 4 2026 5:46 AM

Massive RTC Bus Terminal Planned Across 100 Acres: Telangana

జీడిమెట్ల ప్రాంతంలో నిర్మాణానికి కసరత్తు 

ఎంజీబీఎస్‌ స్థాయిలో అంతర్రాష్ట్ర టెర్మినల్‌ 

సిటీబస్సుల కోసం సిటీ టెర్మినల్‌ 

ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం డిపో, భారీ చార్జింగ్‌ స్టేషన్‌

సాక్షి, హైదరాబాద్‌: శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్‌లో ఆర్టీసీ మరో భారీ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి సిద్ధమవుతోంది. నగరంలో ప్రధాన బస్‌ టెర్మినల్‌గా ఉన్న మహాత్మాగాంధీ బస్‌స్టాండ్‌ (ఎంజీబీఎస్‌) స్థాయిలో దీనిని నిర్మించే యోచనలో ఉంది. అంతర్రాష్ట్ర బస్సు సర్విసులకు ఒక టెర్మినల్, సిటీ బస్సుల కోసం మరో టెర్మినల్, ఎలక్ట్రిక్‌ బస్సుల కోసం బస్‌ డిపో, బ్యాటరీ బస్సుల కోసం భారీ చార్జింగ్‌ సెంటర్‌.. ఇలా సమీకృత కేంద్రంగా ఇది రూపొందనుంది. దీని నిర్మాణానికి జీడిమెట్ల ప్రాంతంలో ప్రభుత్వం 100 ఎకరాల భూమిని కేటాయించింది. దశలవారీగా దీనిని అభివృద్ధి చేసే దిశగా ఆర్టీసీ సమాయత్తమవుతోంది.  

రోడ్లపై బస్సులు ఆగకుండా.. 
కేపీహెచ్‌బీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వందల సంఖ్యలో కాలనీలు పుట్టుకొచ్ఛాయి. కొత్త కాలనీలు శరవేగంగా రూపొందుతున్నాయి. నిత్యం ఈ ప్రాంతం నుంచి వేల సంఖ్యలో ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో వందల సంఖ్యలో బస్సులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్లమీదనే ఆగుతూ ప్రయాణికులను ఎక్కించుకుంటున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలో మెదక్‌ రీజియన్‌ నుంచి అంతర్రాష్ట్ర, రాష్ట్ర సర్విసులు వచ్చి రోడ్ల మీదనే ఆగుతున్నాయి.

భవిష్యత్‌లో దూర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు నగరంలోకి వెళ్లకుండా ఇక్కడే నిలిచిపోయేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికీ చాలా బస్సులు పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్, లింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఆగిపోతున్నాయి. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ చిక్కులు నెలకొంటున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని, బస్సులు రోడ్లమీద ఆగకుండా ప్రత్యేకంగా ఓ టెర్మినల్‌ నిర్మించి అందులోనే ఆగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు 30 ఎకరాల్లో అంతర్రాష్ట్ర బస్సుల కోసం టెర్మినల్‌ నిర్మించనున్నారు.  

నైట్‌హాల్ట్‌ బస్సుల కోసం  
జగద్గిరిగుట్ట వద్ద దాదాపు 60 వరకు బస్సులు నైట్‌హాల్ట్‌లో ఉంటున్నాయి. వాటిని నిలిపేందుకు సరైన చోటు లేకపోవటంతో రోడ్ల మీదనే ఆపుతున్నారు. నైట్‌హాల్ట్‌ బస్సు సిబ్బంది పడుకునేందుకు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు.  

సిటీ సర్వీసులకు సిటీ టెర్మినల్‌ 
కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, బీహెచ్‌ఈఎల్, బాచుపల్లి, గండిమైసమ్మ, గాజులరామారం... ఇలా ఈ సమీపంలోని చాలా ప్రాంతాల్లో ఉన్న వందల సంఖ్యలోని కాలనీలకు వెళ్లి వచ్చే సిటీ బస్సులకు కూడా టెర్మినల్‌ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో అంతర్రాష్ట్ర సర్వీసులతోపాటు సిటీ బస్సులకు కూడా ఇక్కడ సిటీ టెర్మినల్‌ నిర్మించాలని నిర్ణయించారు. 20 ఎకరాలలో సిటీ టెర్మినల్‌ నిర్మించనున్నారు.  

ఎలక్ట్రిక్‌ బస్సు డిపో 
భవిష్యత్‌లో నగరంలో ఆర్టీసీ సర్వీసులన్నీ ఎలక్ట్రిక్‌ బస్సులే ఉండనున్నాయి. పీఎం ఈ–డ్రైవ్‌ పథకం కింద తెలంగాణ ఆరీ్టసీకి కేంద్రం 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. మరో ఆరు నెలల నుంచి ఏడాదిన్నర కాలంలో ఆ బస్సులు సమకూరనున్నాయి. వాటి కోసం ప్రస్తుతం ఉన్న డిపోలు కాకుండా కొత్తగా పది డిపోల వరకు నిర్మించాలని ఆర్టీసీ ప్రతిపాదిస్తోంది. ఇక్కడ భారీ డిపోను నిర్మించాలని ఆర్టీసీ నిర్ణయించింది. 10 ఎకరాల విస్తీర్ణంలో ఆ డిపో ఉండనుంది.  

చార్జింగ్‌ స్టేషన్‌ 
ఎలక్ట్రిక్‌ బస్సుల బ్యాటరీలను ఛార్జ్‌ చేసేందుకు ఛార్జింగ్‌ స్టేషన్‌ అవసరం. ఇక్కడి డిపో బస్సులతోపాటు, అంతర్రాష్ట్ర బస్సులు, ఇతర బస్సులకు ఛార్జింగ్‌ వసతి కలి్పంచేలా ఇక్కడ 15 ఎకరాలలో ఛార్జింగ్‌ స్టేషన్‌ నిర్మించాలని భావిస్తున్నారు.  

మల్టీలెవల్‌ పార్కింగ్‌ యార్డ్‌ 
టెర్మినల్‌కు నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు రానున్నందున ఇక్కడ ఓ మల్టీలెవల్‌ పార్కింగ్‌ యార్డు కూడా రూపొందనుంది. దాన్ని భూగర్భంలో నిర్మించే యోచనలో ఉన్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement