పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
మహబూబాబాద్ జిల్లా: మాయమాటలు చెప్పి వివాహితపై ఓ కానిస్టేబుల్ లైంగిక దాడికి పాల్పడిన సంఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బయ్యారం మండల కేంద్రానికి చెందిన దంపతులు కొన్ని నెలల క్రితం గొడవ పడ్డారు. గార్ల–బయ్యారం సర్కిల్ కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ బి.దినేశ్‌కు వివాహిత గొడవ విషయం తెలిసింది.
దీనిని ఆసరాగా చేసుకున్న కానిస్టేబుల్ తాను అండగా ఉంటానని వివాహితను నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తన భర్తకు తెలిసిందని, తనను వివాహం చేసుకోవాలని ఆమె కానిస్టేబుల్‌ను కోరింది. అయితే వివాహానికి కానిస్టేబుల్ నిరాకరించాడు. దీంతో ఆమె తనను నమ్మించి మోసం చేసిన కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం కానిస్టేబుల్‌పై లైంగిక దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.


