
డోర్నకల్: ఉడుములు పట్టే క్రమంలో ప్రమాదవశాత్తు రెండు బండరాళ్ల మధ్య చిక్కుకుని ఓ యువకుడు మృతి చెందాడు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారానికి చెందిన జక్కుల వెంకన్న సోమవారం ఉదయం ఉడుములు పట్టేందుకు ఖమ్మం రూరల్ మండలం పొడిశెట్టిగూడెం గ్రామ పరిధిలోని గుట్టపైకి వెళ్లాడు. ద్విచక్ర వాహనం, రెండు పెంపుడు కుక్కలతో వెళ్లిన ఆయన.. మంగళవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు.
దీంతో అతని ఆచూకీ కోసం గాలించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పొడిశెట్టిగూడెం సమీపంలోని గుట్ట సమీపంలో ద్విచక్రవాహనం నిలిపి ఉండటం, సమీపంలో కుక్కలు కనిపించడంతో గుట్టపైకి వెళ్లి వెతకగా.. రెండు బండరాళ్ల మధ్య వెంకన్న మృతదేహం కనిపించింది. ప్రొక్లయినర్‌తో భారీ బండరాయిని తొలగించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఖమ్మం రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(చదవండి: ఖైరతాబాద్: తిమింగలం వాంతి పేరుతో మోసం..)