మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసిన భర్త
తల్లి మృతదేహం వద్ద రెండేళ్ల చిన్నారి ఆక్రందన
షాద్‌నగర్ రూరల్: కట్టుకున్న భార్యను అంతమొందించిన ఓ వ్యక్తి మృతదేహాన్ని బైక్‌పై తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేసివెళ్లాడు. అంతేకాక రెండేళ్ల తమ కూతురును తల్లి మృతదేహం వద్ద వదిలివెళ్లాడు. రంగారెడ్డి జిల్లా దేవునిపల్లి పంచాయతీ పరిధిలోని రంగారెడ్డిగూడ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రంగారెడ్డిగూడ గ్రామానికి చెందిన శోభారాణి (31)కి పదేళ్ల క్రితం మహబూబ్‌నగర్ జిల్లా కోయిలకొండకు చెందిన రాజుతో వివాహం జరిగింది. వీరికి మహేందర్ అనే ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు.
భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో శోభారాణి కోయిలకొండకే చెందిన నర్సింహులును రెండో వివాహం చేసుకుంది. వీరికి రెండేళ్ల కూతురు మమత ఉంది. మహేందర్ కూడా తల్లితోపాటే ఉంటున్నాడు. కాగా, నర్సింహులు తాగుడుకు బానిస కావడంతో కొంత కాలంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో శోభారాణి ఆరునెలల క్రితం కూతురును తీసుకొని పుట్టింటికి వచ్చేసింది.
సైకిల్ కొనిస్తానని చెప్పి..
భార్యతో మాట్లాడేందుకు నర్సింహులు రెండు రోజుల క్రితం రంగారెడ్డిగూడకు వచ్చాడు. శనివారం కుమారుడు మహేందర్‌కు సైకిల్ కొనిద్దామని చెప్పి శోభారాణిని మహబూబ్‌నగర్‌కు తీసుకెళ్లాడు. అక్కడ మరోసారి ఇద్దరూ గొడవపడ్డారు. ఈ క్రమంలో నర్సింహులు భార్యను దారుణంగా హత్య చేశాడు. తర్వాత కూతురు మమతను బైక్‌పై ముందు కూర్చోబెట్టుకొని, భార్య మృతదేహాన్ని వెనకాల కట్టేసి, రంగారెడ్డిగూడ శివారులోకి తీసుకొచ్చి చెట్ల పొదల్లో పడేశాడు. కూతురును అక్కడే వదిలేసి పరారయ్యాడు.
కాగా తల్లి హత్యకు గురైందని తెలియని ఆ చిన్నారి ఆకలితో అలమటిస్తూ ఏడుస్తుండగా, ఆదివారం తెల్లవారు జామున అటుగా వెళ్లిన గ్రామస్తులు ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ, పట్టణ సీఐ సీతారాం పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


