టీపీసీసీ త్రిముఖ వ్యూహం | Mahesh Goud Launches District Tour | Sakshi
Sakshi News home page

టీపీసీసీ త్రిముఖ వ్యూహం

Mar 23 2026 1:30 AM | Updated on Mar 23 2026 1:30 AM

Mahesh Goud Launches District Tour

జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టిన మహేశ్‌గౌడ్‌

పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయం, ప్రభుత్వ పథకాల ప్రచారమే లక్ష్యం

భువనగిరితో మొదలు.. 25న మెదక్‌ జిల్లాకు.. త్వరలో పూర్తి స్థాయి షెడ్యూల్‌

డీసీసీ కార్యవర్గాలతో సమావేశాలు నిర్వహించనున్న టీపీసీసీ చీఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: పార్టీ బలోపేతం, ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి.మహేశ్‌ కుమార్‌గౌడ్‌ జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ప్రకటించిన డీసీసీ కార్యవర్గాలతో సమావేశాలు నిర్వహించడమే ప్రధాన ఎజెండాగా సాగనున్న ఈ పర్యటనలో ఆయన త్రిముఖ వ్యూహంతో ముందుకెళ్తారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి. 

పార్టీ బలోపేతం, నేతల మధ్య సమన్వయంతో పాటు ప్రభుత్వ పథకాల ప్రచారమే లక్ష్యంగా ఈ పర్యటనలు జరుగుతాయని తెలిపాయి. ఈ మేరకు ఆదివారం భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన బుధవారం మెదక్‌ వెళ్లను న్నారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్త పర్యటనలకు సంబంధించిన పూర్తిస్థాయి షెడ్యూల్‌ వెలువడనుంది. 

తొలి విడతలో 14 జిల్లాలు
రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఇటీవల డీసీసీ కార్యవర్గాలను ప్రకటించారు. ఈ నేపథ్యంలో తొలి విడతలో భాగంగా ఆ 14 జిల్లాల్లో పర్యటించాలని మహేశ్‌గౌడ్‌ నిర్ణయించారు. ఈ సందర్భంగా డీసీసీ కార్యవర్గ సమావేశాలకు ఆయన హాజరు కానున్నారు. రెండేళ్ల కాలంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను గురించి డీసీసీలకు వివరిస్తారు. 

పార్టీ, ప్రభుత్వ ఆలోచనలు, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీపై విశ్వాసం కలిగించేలా చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేయను న్నారు. ఆయా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఉన్న అంతరాలు, అనుబంధ సంఘాల బలోపేతం తదితర అంశాలపై చర్చిస్తారని, జిల్లాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించడంతో పాటు స్థానికంగా ఉన్న ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇస్తారని తెలుస్తోంది. 

బడ్జెట్‌ సమావేశాల తర్వాత సమన్వయ కమిటీ భేటీ
కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి కాగా, రానున్న ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయాలని ఇటీవల ఏఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయి. అందులో భాగంగానే పార్టీకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయం చేసేందుకు 8 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని కూడా ఆ పార్టీ అధిష్టానం నియమించింది. కాగా అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయిన వెంటనే ఈ కమిటీ భేటీ అవుతుందని తెలుస్తోంది. 

ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం చేపట్టాల్సిన కార్యాచరణ, పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, నామినేటెడ్‌ పదవులు, పార్టీ, అనుబంధ సంఘాల బలోపేతం తదితర అంశాలపై ఈ కమిటీ చర్చిస్తుందని, కమిటీ అభిప్రాయాలను ఏఐసీసీకి వెల్లడించి ఢిల్లీ పెద్దల అనుమతి మేరకు భవిష్యత్‌ కార్యాచరణ రూపొందిస్తారని సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement