కామారెడ్డి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకాన్ని మరింత సౌకర్యవంతంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసేందుకు త్వరలో మహిళలకందరికీ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పంపిణీకి ఆర్టీసీ కసరత్తు ప్రారంభించింది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లాంఛనంగా స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. ప్రస్తుతం ఆర్టీసీ ద్వారా విద్యార్థులు, ఉద్యోగులు, ఇతరులకు ఇస్తున్న సీజన్ పాస్‌ల మాదిరిగా మహిళలకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు ఇవ్వనుంది.
దుర్వినియోగాన్ని అరికట్టేందుకు..
కామారెడ్డి జిల్లాలో సగటున రోజుకు 40 వేల మంది నెలకు 12 లక్షల మంది మహిళలు బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం మహిళలు ఇప్పటి వరకు తమ ఆధార్ కార్డులను చూపిస్తున్నారు. ఈ విధానం వల్ల పథకం కొన్ని ప్రాంతాల్లో దుర్వినియోగం అవుతున్నట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల వారు నకిలీ ఆధార్ కార్డులతో ఈ పథకాన్ని వాడుకుంటున్నట్లు అధికారులు గుర్తించారు. బతుకు తెరువు కోసం పొరుగు రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వేలాది మహిళా కూలీలు, ప్రైవేట్ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారిగా నకలీ ఆధార్ కార్డులు సృష్టించి వాటి సాయంతో బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారని ఆర్టీసీ అధికారులు అంటున్నారు. దీన్ని అరికట్టేందుకు ఆర్టీసీ మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల జారీకి పూనుకుంది.
డిజిటల్ విధానంతో మహాలక్ష్మి స్మార్ట్ కార్డులు
మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను పూర్తి డిజిటల్ టెక్నాలజీతో తయారు చేయనున్నారు. ఏటీఎం కార్డుల మాదిరిగా చిప్‌తో కూడిన స్మార్ట్ కార్డును తయారు చేస్తున్నారు. మహిళల ఆధార్ కార్డు, ఫోటో లాంటి ప్రాథమిక సమాచారం అందిస్తే ఆ సమాచారాన్ని కార్డులోని చిప్‌కు అనుసంధానిస్తారు. స్మార్ట్ కార్డులో మహిళల పూర్తి వివరాలు, ఫొటో, క్యూ ఆర్ కోడ్ ఉంటాయి. ఈ సమాచారాన్ని చిప్‌లో పొందుపర్చాక వారి పేర్లతో కార్డు జారీ చేస్తారు. స్మార్ట్ కార్డు పంపిణీ చేశాక అది ఉంటేనే ఉచిత ప్రయాణానికి అనుమతి ఇస్తారు. నకలీ ఆధార్ కార్డులతో ప్రయాణం చేస్తున్న వారికి స్మార్ట్ కార్డు పొందే అవకాశం ఉండదు.
ప్రయోగాత్మకంగా అమలు చేసే అవకాశం..
మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల పంపిణీని జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా లాంఛనంగా ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రతీ జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి కార్డుల పంపిణీ ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఈ కార్డులను పంపిణీ చేయనున్నారని వారు తెలిపారు. మహాలక్ష్మి కార్డులు అందే వరకు మహిళలు పాత విధానంలోనే ఆధార్ కార్డు చూపించి ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చని వారు తెలిపారు. స్మార్ట్ కార్డుల ద్వారా టికెట్ జారీ చేయడానికి బస్సులోని కండక్టర్లకు ప్రత్యేక స్మార్ట్ కార్డు రీడర్లను అందజేయనున్నామని వారు వివరించారు.
ఆధార్ చూపిస్తే చాలు
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కోసం ఆర్టీసీ త్వరలో మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను పంపిణీ చేయనుంది. కానీ ఇందుకు సంబంధించిన విధివిధానాలేవీ మాకు ఇంత వరకు రాలేదు. కొత్త స్మార్ట్ కార్డులు వచ్చే వరకు మహిళలు పాత విధానం మాదిరిగానే తమ ఆధార్ కార్డులను చూపించి ఉచిత బస్సు ప్రయాణం చేయవచ్చు.
– దినేష్ కుమార్, డిపో మేనేజర్, కామారెడ్డి


