కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ! | Lack of industrial skills among technical graduates in India | Sakshi
Sakshi News home page

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ!

Jul 3 2026 5:17 AM | Updated on Jul 3 2026 5:17 AM

Lack of industrial skills among technical graduates in India

ఏఐ సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో కంపెనీలు ముందంజ.. 

అవసరాలకు తగ్గట్లుగా మారని కాలేజీలు.. 

దేశంలోని సాంకేతిక గ్రాడ్యుయేట్లలో పారిశ్రామిక నైపుణ్యాల లేమి  

కాలేజీల పాత పాఠాలతో పరిశ్రమలకు ఉద్యోగుల కొరత

2017తో పోలిస్తే ఎంప్లాయర్‌ రెప్యుటేషన్‌ స్కోర్‌లో వెనుకబడ్డ భారత విద్యాసంస్థలు 

క్యూఎస్‌ వరల్డ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఇండెక్స్‌ నివేదిక వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో దేశంలోని కంపెనీలు దూసుకుపోతున్నప్పటికీ ఉన్నత విద్యావ్యవస్థ మాత్రం పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా మారలేక కొట్టుమిట్టాడుతోంది. యూకేకు చెందిన గ్లోబల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అనలిటిక్స్‌ కంపెనీ క్యూఎస్‌ తాజాగా విడుదల చేసిన క్యూఎస్‌ వరల్డ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఇండెక్స్‌–2027 నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా 89 దేశాల్లో విశ్వవిద్యాలయాల విద్య, మారుతున్న శ్రామిక మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా మానవ వనరుల లభ్యత ఆధారంగా రూపొందించిన ఈ సూచీలో.. భారత్‌ 89.4 స్కోర్‌తో స్వీడన్, జపాన్‌లను వెనక్కినెట్టి 13వ స్థానంలో నిలిచింది. అలాగే భవిష్యత్తు ఉద్యోగాల సన్నద్ధతలో భారత్‌ 5వ స్థానం సాధించింది. కానీ అదే సమయంలో మన కాలేజీలు మాత్రం ఇంకా పాత సిలబస్‌తోనే విద్యార్థులను బయటకు పంపుతున్నాయి. ఫలితంగా పరిశ్రమలు కొత్త ఉద్యోగాలు సృష్టిస్తున్నా.. వాటికి సరిపోయే నైపుణ్యాలు గల అభ్యర్థులు దొరకడం లేదు. భారతీయ సాంకేతిక గ్రాడ్యుయేట్లపై పరిశ్రమలకు నమ్మకం క్రమంగా తగ్గుతోందని క్యూఎస్‌ గ్లోబల్‌ ఎంప్లాయర్‌ సర్వే స్పష్టం చేసింది. ముఖ్యంగా ఇంజనీరింగ్, టెక్నాలజీ రంగాల్లో భారతీయ విద్యాసంస్థల ఎంప్లాయర్‌ రెప్యుటేషన్‌ స్కోర్‌ 2017లో 997గా ఉండగా 2026 నాటికి అది ఏకంగా 2,132కి (స్కోర్‌ పెరిగేకొద్దీ నాణ్యత తగ్గినట్టు) పడిపోయింది. 

వలసల ముప్పు.. 
భారత్‌ ప్రపంచంలోనే అత్యధికంగా శ్రామిక శక్తిని, విద్యార్థులను విదేశాలకు పంపుతున్న దేశం. 2030 నాటికి దాదాపు 10 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో చదువుకోనున్నట్లు అంచనా. ఈ పరిణామం మేధో వలసల ముప్పును తెచ్చిపెడుతోంది. దేశంలోని ప్రతిభావంతులను ఇక్కడే నిలుపుకుంటూ స్థానికంగా ఉన్న కోట్లాది మంది యువతకు ఉపాధి నైపుణ్యాలు కల్పించడం ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాల్‌గా మారింది. 

డ్రాగన్‌తో పోటీ.. 
క్యూఎస్‌ వరల్డ్‌ ఫ్యూచర్‌ స్కిల్స్‌ ఇండెక్స్‌–2027లో 92.5 స్కోర్‌తో చైనా 7వ స్థానంలో ఉంది. చైనా ఏటా లక్షలాది మంది స్టెమ్‌ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్‌ గ్రాడ్యుయేట్లను తయారు చేస్తోంది. వారంతా నేరుగా ప్రభుత్వరంగ పరిశ్రమల్లోకి, సాంకేతిక సంస్థల్లోకి ప్రవేశించేలా అక్కడ పటిష్టమైన యంత్రాంగం ఉంది. దీనివల్ల వారి స్కిల్స్‌ అలైన్‌మెంట్‌ స్కోరు 98.0గా ఉంది. అయితే భారీ మౌలిక వసతులు ఉన్నప్పటికీ చైనా ఫ్యూచర్‌ ఆఫ్‌ వర్క్‌ సూచీలో 80.2 స్కోరుతో వెనుకబడింది. చైనాలో ఇప్పటికీ తయారీ, వ్యవసాయ రంగాల్లో ఎక్కువ మంది శ్రామికులు ఉన్నారు. ఏఐ విప్లవం వల్ల ఈ ఉద్యోగాలన్నీ ఆటోమేషన్‌కు గురై భారీగా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. చైనాతో పోలిస్తే భారత్‌ ఫ్యూచర్‌ ఆఫ్‌ వర్క్‌ విభాగంలో 96.0 స్కోరుతో మెరుగ్గా ఉంది. మన సేవా రంగం, ఐటీ రంగాలు ఏఐ ద్వారా భర్తీ చేసేవి కావు. పైగా ఏఐతో కలిసి నడిచేవి. కానీ చైనాలాగా గ్రాడ్యుయేట్లను నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకునే స్కిల్స్‌ అలైన్‌మెంట్‌ మనకు లేకపోవడం లోటుగా మారుతోంది. ఈ విభాగంలో 82.7 స్కోర్‌తో 18వ స్థానానికి పరిమితమైంది. ఎందుకంటే.. ఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాణిస్తూ ప్రపంచ అత్యుత్తమ 250 వర్సిటీల జాబితాలో చోటు సంపాదిస్తుంటే దేశంలోని మిగిలిన వెయ్యికిపైగా విశ్వవిద్యాలయాలు, 40 వేలకుపైగా కాలేజీలు కేవలం డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తున్నాయి తప్ప ఉద్యోగాలకు పనికొచ్చే నైపుణ్యాలను అందించలేకపోతున్నాయి. 

కంపెనీలు వెతుకుతున్న ప్రధాన నైపుణ్యాలు ఇవే 
– సమస్యలను విశ్లేషించడం, విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత. భారతీయ విద్యార్థుల్లో ఈ నైపుణ్యాల కొరత ఎక్కువగా ఉందని టాప్‌ కంపెనీలు చెబుతున్నాయి. 
– ఉద్యోగార్థుల్లో నాయకత్వ లక్షణాలు, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం, సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ లేకపోవడం కూడా అడ్డంకిగా మారుతోందని అంటున్నాయి. 
– వ్యాపార దృక్పథంతో ఆలోచించడం, రిస్క్‌ తీసుకునే తత్వం తదితర లక్షణాలున్న ఉద్యోగుల కోసం ఎదురుచూస్తున్నట్లు కంపెనీలు పేర్కొంటున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement