నేటి నుంచి కాంగ్రెస్ హామీలపై బాకీ కార్డులతో ఇంటింటికీ బీఆర్‌ఎస్ శ్రేణులు
నేడు తెలంగాణభవన్‌లో కేటీఆర్ చేతుల మీదుగా కాంగ్రెస్ వైఫల్యాల చార్జ్‌షీట్
టెలీ కాన్ఫరెన్స్‌లో శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ ప్రతిపక్ష బీఆర్‌ఎస్.. అధికార పార్టీపై పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు అసెంబ్లీ వేదికగా, ప్రజా సమస్యలపై సాగించిన పోరాటాలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలను సమన్వయం చేస్తూ కార్యాచరణను ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేరుగా ప్రజాక్షేత్రంలో నిలదీసేందుకు ఏడు రోజుల కార్యాచరణను రూపొందించింది. సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో బుధవారం తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ‘చార్జ్‌షీట్’ విడుదల చేయనుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీల అమలు తీరును ఇందులో ప్రధానంగా ఎత్తిచూపనుంది. కేవలం చార్జ్‌షీట్ విడుదలతో సరిపెట్టకుండా.. ఏ హామీ ఎంత మేర అమలైంది, ఏది అమలు కాలేదు, ప్రజలకు ఎంత నష్టం జరిగిందన్న అంశాలను వివరిస్తూ ‘బాకీ కార్డులు’రూపొందించి ఇంటింటికీ పంపిణీ చేయాలని పార్టీ నిర్ణయించింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ వేయి రోజుల పాలన వైఫల్యాలని ప్రతీ గడపకూ తీసుకెళ్లడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ వ్యూహం రచించింది.
చార్జ్‌షీట్ నుంచి బహిరంగ సభ వరకు..!
రైతులు, యువత, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయి ఆందోళనల్లో ప్రధానంగా ప్రస్తావించనుంది. రైతు రుణమాఫీ, రైతు భరోసా, సాగునీరు, ఎరువుల సమస్యలతోపాటు ఉద్యోగ నియామకాలు, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళలకు ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయనుంది. నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నిరసనలు నిర్వహిస్తూ స్థానిక సమస్యలను కూడా ఈ ఉద్యమంలో భాగం చేయాలని పార్టీ భావిస్తోంది.
ఇదే సమయంలో ఏడు రోజుల ఆందోళనలో భాగంగా రాష్ట్రంలో ఏదో ఒకచోట భారీ బహిరంగ సభ నిర్వహించే అంశాన్ని కూడా బీఆర్‌ఎస్ పరిశీలిస్తోంది. వివిధ అంశాలపై వివిధ సందర్భాల్లో చేసిన పోరాటాలను ఒక సమగ్ర రాజకీయ ఉద్యమంగా మలచాలని బీఆర్‌ఎస్ నిర్ణయించింది. ఇందుకోసం కేటీఆర్ పార్టీ నేతలతో పలుమార్లు టెలీ కాన్ఫరెన్స్‌లు నిర్వహించి కార్యాచరణను వివరించారు. బాకీ కార్డుల ద్వారా ఇంటింటికీ, చార్జ్‌షీట్ ద్వారా ప్రజా చర్చలోకి, నిరసనల ద్వారా క్షేత్రస్థాయిలోకి, బహిరంగ సభ ద్వారా రాష్ట్రస్థాయికి తీసుకెళ్లాలన్నది బీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోంది.


