అసత్యాలు, అభూత కల్పనలు | KTR fires on Governors speech in Assembly | Sakshi
Sakshi News home page

అసత్యాలు, అభూత కల్పనలు

Dec 17 2023 4:20 AM | Updated on Dec 17 2023 3:00 PM

KTR fires on Governors speech in Assembly - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాస నసభ దద్దరిల్లింది. చర్చ ప్రారంభమైన తొలి రోజే సభలో తీవ్ర రచ్చ జరిగింది. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్‌ ఎస్‌ మధ్య మాటలు తూటాల్లా పేలాయి. ఆరోపణలు, ప్రత్యా రోపణలతో సభలో వాతావర ణం వేడెక్కింది. అరుపులు, కేక లతో పలుమార్లు సభ మార్మోగి పోయింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శనివారం శాసనసభలో చర్చ జరిగింది.

ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ సభ్యుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూనే ప్రభుత్వంపై దాడికి దిగారు. ‘గవర్నర్‌ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనలు, తప్పులతడకగా ఉంది. ఇలాంటి ప్రసంగం వినడానికి సభ్యుడిగా సిగ్గుపడుతున్నా. ఇంత దారుణమైన అపసవ్యపు ప్రసంగం శాసనసభ చరిత్రలో విని ఉండము. కేవలం పదేళ్లు ప్రభుత్వం నడిపిన వారిపై నెపాన్ని నెట్టి వేసే ప్రయత్నం కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసింది’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.

ఈ సందర్భంగా అధికార కాంగ్రెస్‌ సభ్యులు అభ్యంతరం తెలి పారు. కేటీఆర్‌ తన ప్రసంగంలో గత 55 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో తెలంగాణలో నెలకొన్న పరిస్థితులపై ఆరోపణలు చేయగా పలుమార్లు మంత్రులు అడ్డుతగిలారు. తెలంగాణ ఏర్పాటునే ప్రామాణికంగా తీసుకుని 2014 జూన్‌ 2 నుంచి జరిగిన పరిణామాలపైనే చర్చించాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మరో నలుగురు మంత్రులు కేటీఆర్‌ ప్రసంగానికి పలుమార్లు అభ్యంతరం తెలుపుతూ ఎదురుదాడికి దిగడంతో సభలో స్వల్ప 

ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
55 ఏళ్ల విధ్వంసం గురించి మాట్లాడుతాంప్రభుత్వం గత పదేళ్ల విధ్వంసం గురించి మాట్లాడితే, తాము 55 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో జరిగిన విధ్వంసం గురించి మాట్లాడాలా? వద్దా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. తెలంగాణలో 2014కి ముందు పడావుపడ్డ భూములు, పాడుబడ్డ ఇళ్లు, ఆకలికేకలు, ఆత్మహత్యలు, వలసలు, కరువులు, ఎన్‌కౌంటర్లు, కరెంట్‌ కోతలు, కటిక చీకట్లు, నెర్రలు బారిన నేలలు, నెత్తురు బారిన నేలలు ఉండేవని కేటీఆర్‌ గత 55 ఏళ్ల కాంగ్రెస్‌ పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘కొత్త ప్రభుత్వం వచ్చింది.

మూడు నెలల సమయం ఇద్దాం. ఎలాగో అట్టర్‌ ఫ్లాప్‌ అవుతారు’ అని తమ పార్టీ అధినేత కేసీఆర్‌ అన్నారని ఎద్దేవా చేశారు. ఆనాడు తాము పోరాడుతుంటే పదవుల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు పెదవులు మూసుకున్నారని కేటీఆర్‌ విమర్శించగా, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం తెలిపారు. తన తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్న తర్వాత స్నానం చేయడానికి  బావుల్లో నీళ్లు, కరెంట్‌ లేక ఎలా ఇబ్బంది పడ్డారో తెలుపుతూ కాంగ్రెస్‌ పాలనపై గతంలో సభలో రేవంత్‌రెడ్డి చేసిన విమర్శలను ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. నిర్బంధాలు, నియంతృత్వం తమ పదేళ్ల పాలనలో కాదని, ఇందిరమ్మ పాలనలోనే చోటుచేసుకున్నాయని కేటీఆర్‌ చెప్పారు.

ఎమర్జెన్సీ, ఆర్టికల్‌ 365తో ప్రభుత్వాన్ని రద్దు చేయడం, ముల్కీ రూల్స్‌కు తూట్లు పొడవడం జరిగాయన్నారు. పోతిరెడ్డిపాడు వద్ద పొక్క గొట్టి నీళ్లు తీసుకెళ్తుంటే, హంద్రీ నీవాతో నీళ్లు తీసుకెళ్తుంటే టీ కాంగ్రెస్‌ నేతలు హారతులు పట్టారని ఆరోపించారు. చర్చల కోసం నక్సల్స్‌ను పిలిచి కాల్చి చంపింది ఎవరని ప్రశ్నించారు. వాస్తవానికి నిర్బంధం జూన్‌ 2, 2014తో ముగిసిందన్నారు. 

చీమల పుట్టలో చేరిన పాము ఎవరు?
‘శాసనసభలో మేము 39 మంది ఉండగా, కాంగ్రెస్‌ నుంచి 64 మంది ఉన్నారు. ఎందుకంత మిడిసిపడుతున్నారు? ఓట్ల తేడా కేవలం 1.85 శాతం మాత్రమే’ అని తన ప్రసంగానికి అడ్డుపడుతున్న అధికారపక్ష సభ్యులనుద్దేశించి కేటీఆర్‌ మండిపడ్డారు. కేటీఆర్‌ వ్యాఖ్యలను తప్పుబడుతూ సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణ తెచ్చిన నాయకుడిని పట్టుకుని కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు అని రేవంత్‌రెడ్డి ఏక వచనంతో సంబోధించడాన్ని కేటీఆర్‌ తప్పుబట్టారు. అచ్చోసిన ఆంబోతు.. చీమలు పెట్టిన పుట్టలో దూరిన పాము ఎవరు? అని ప్రశ్నించారు. భట్టి, దామోదర, శ్రీధర్, ఉత్తమ్, కోమటిరెడ్డి పెట్టిన పార్టీలో దూరి సీఎం పదవి తీసుకున్న వ్యక్తి ఈ విషయాలు మాట్లాడటం చండాలంగా ఉందన్నారు.

ఎన్‌ఆర్‌ఐలకు టికెట్లు అమ్ముకుంది ఎవరని ప్రశ్నించారు. వంద కోట్ల మంది భారతీయులను కాదని బయటి దేశం నుంచి అధ్యక్షురాలిని తెచ్చుకుంది ఎవరని నిలదీశారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేశామని ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. రెండు హామీల్లో అమలు చేసింది పావులా వంతు మాత్రమే అన్నారు. ప్రజావాణిని కొత్తగా ప్రారంభించడమేంటని, అది ప్రతి సోమవారం కలెక్టరేట్లలో జరుగుతోందని పేర్కొన్నారు. ప్రగతిభవన్‌ ఎదుట 2012లో నాటి సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి ఇనుప కంచెలు వేశారన్నారు.

అప్పులపై తప్పుడు ప్రచారం
గత పదేళ్లలో రాష్ట్ర విద్యుత్‌ సంస్థల ఆస్తులను రూ.1,37,571 కోట్లకు పెంచామని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఈ విషయాన్ని దాచిపెట్టి రూ.81,516 కోట్ల అప్పులు చేశామని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. పౌర సరఫరాల సంస్థ వద్ద రూ.30 వేల కోట్ల విలువ చేసే స్టాక్‌ ఉందని, మరో రూ.17 వేల కోట్లు ఎఫ్‌సీఐ నుంచి రావాల్సిఉందని, రెండు కలిపితే రూ.47 వేల కోట్లు అవుతుందని చెప్పారు.

ఈ విషయాన్ని దాచి సంస్థ తరఫున రూ.56 వేల కోట్ల అప్పులు చేసినట్టు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అప్పులను వృద్ధిరేటుతో పోల్చి చూడాలన్నారు. అమెరికాలో జీడీపీతో పోల్చితే 123 శాతం, జపాన్‌లో 215 శాతం, భారత్‌లో 57 శాతం అప్పులుండగా, తెలంగాణలో 27.8 శాతమే ఉన్నాయని చెప్పారు. అప్పుల్లో తెలంగాణ దేశంలోనే కింది నుంచి 24వ స్థానంలో ఉందని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement