కిడ్నీ, కాలేయం దానం: ఏఎస్సై పాడె మోసిన సజ్జనార్‌

Kismatpur Emotional: Sajjanar Carrys Mahipal Reddy Hearse - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నిజాంపేట ఘటనలో చికిత్స పొందుతూ మృతిచెందిన ఏఎస్సై మహిపాల్ రెడ్డి మృతి కి పోలీస్‌ శాఖ కన్నీటి నివాళి అర్పించింది. అయితే బ్రెయిన్ డెడ్‌ కావడంతో మహిపాల్ రెడ్డి కిడ్నీలు, కాలేయం దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. అవయన దానం అనంతరం కిస్మత్‌పూర్‌లోని మహిపాల్‌ రెడ్డి నివాసం వద్ద అంత్యక్రియలు జరిగాయి. మహిపాల్ రెడ్డి మృతదేహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు, పోలీసులు వచ్చారు.

అదనపు డీజీపీ సజ్జనార్ మహిపాల్ రెడ్డి మృతదేహానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనంతో మహిపాల్ రెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఈ అంత్యక్రియల్లో మహిపాల్ రెడ్డి పాడెను సజ్జనార్ మోశారు. అంత్యక్రియల ఖర్చులకు సజ్జనార్‌ రూ.50 వేలు వ్యక్తిగత సహాయం చేశారు.  మహిపాల్ రెడ్డి జీవితం నుంచి చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయని సజ్జనార్‌ తెలిపారు. విధి నిర్వహణలో ఆయన ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పదేపదే చెప్తున్నా వినడం లేదని, మహిపాల్ రెడ్డి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి శాఖ తరపున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top