స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా | Key Cabinet decisions taken in meeting chaired by CM Revanth Reddy | Sakshi
Sakshi News home page

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% కోటా

Jul 11 2025 12:48 AM | Updated on Jul 11 2025 12:48 AM

Key Cabinet decisions taken in meeting chaired by CM Revanth Reddy

కేబినెట్‌ నిర్ణయాలను వెల్లడిస్తున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో మంత్రులు వాకిటి, పొన్నం, జూపల్లి, అడ్లూరి

పంచాయతీరాజ్‌ చట్ట సవరణకు త్వరలో ఆర్డినెన్స్‌ 

సీఎం అధ్యక్షతన జరిగిన భేటీలో కేబినెట్‌ కీలక నిర్ణయాలు 

వివరాలు వెల్లడించిన మంత్రులు పొంగులేటి, పొన్నం, వాకిటి

త్వరలో 22,033 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు..జాబ్‌ కేలండర్‌ రెడీ 

అమిటీ, సెయింట్‌ మేరీస్‌ విద్యా సంస్థలకు వర్సిటీ హోదా  

పెండింగ్‌ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ సత్వరమే పూర్తి 

మత్స్యశాఖ బడ్జెట్‌ రూ.19 కోట్ల నుంచి రూ.122 కోట్లకు పెంపు 

గోశాలల ఏర్పాటు,నిర్వహణపై సీఎస్‌ నేతృత్వంలో కమిటీ 

‘ఆధార్‌’తో ఔట్‌ సోర్సింగ్,కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరుపై సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్వహించిన కులగణన సర్వే ఆధారంగా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ మేరకు బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీరాజ్‌ చట్టం–2018 సవరణకు త్వరలో ఆర్డినెన్స్‌ తీసుకురావాలని తీర్మానించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన కేబినెట్‌.. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది. 

భేటీ అనంతరం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, పశు సంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి విలేకరులకు వివరాలు వెల్లడించారు. రాహుల్‌ గాంధీ ఇచ్చిన హామీతో పాటు కామారెడ్డి సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ ప్రకారం రాష్ట్రంలో కుల గణన నిర్వహించడాన్ని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును శాసనసభలో ఆమోదించి, గవర్నర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించిన విషయం గుర్తు చేశారు. 

సీఎం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, ఇతర మంత్రులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ పలువురు కేంద్రమంత్రులు, సంబంధిత అధికారులతో దీనిపై అనేకసార్లు చర్చించినా కొర్రీలు వేస్తూ కాలయాపన చేశారని విమర్శించారు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ భేటీకి అడ్వొకేట్‌ జనరల్‌ను కూడా ఆహ్వానించి ఆయన సలహాలు తీసుకుని, న్యాయపరమైన చిక్కులు రాకుండా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. 

ఎన్నికలకు ఇబ్బందులు ఎదురవకుండా రాజకీయ పార్టీలు కూడా చిత్తశుద్ధితో సహకరించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు. ఈడబ్ల్యూఎస్‌ కోటాతో కలిపి ఇప్పటికే రాష్ట్రంలో 62 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని, రిజర్వేషన్లపై 50 శాతం క్యాప్‌ నిబంధన దేశంలో ఎప్పుడో పోయిందని అన్నారు.  

కేబినెట్‌ నిర్ణయాలు 96% అమలు 
రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడ్డాక దీనికి ముందు వరకు జరిగిన 18 మంత్రివర్గ సమావేశాల్లో 327 అంశాలపై చర్చించి 321 అంశాలపై నిర్ణయాలు తీసుకున్నామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. తాజాగా జరిగిన 19వ సమావేశంలో ఆ నిర్ణయాల అమలులో పురోగతిపై విస్తృతంగా చర్చించామని, 96 శాతం అంశాలకు సంబంధించి జీవోలు జారీ చేసి అమలు దశకు తీసుకెళ్లినట్టు తేలిందని చెప్పారు. 

కాగా ప్రతి రెండు వారాలకు ఒకసారి కేబినెట్‌ సమావేశం నిర్వహించాలన్న ప్రభుత్వ ఆలోచన మేరకు మళ్లీ ఈ నెల 25న మంత్రివర్గ భేటీ జరపాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రతి 3 నెలలకోసారి ఆ కాల వ్యవధిలో జరిగే ఆరు కేబినెట్‌ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలు తీరును సమీక్షించాలని కూడా నిర్ణయించామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలకు చేరవేసే వ్యవస్థ పనితీరును మళ్లీ కేబినెట్‌లోనే ఇలా సమీక్షించడం దేశంలోనే తొలిసారి అని అన్నారు.   

ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50% సీట్లు 
రాష్ట్రంలోని అమిటీ, సెయింట్‌ మేరీస్‌ రిహాబిలిటేషన్‌ విద్యా సంస్థలకు వర్సిటీలుగా గుర్తింపు కల్పించాలని కేబినెట్‌ నిర్ణయించినట్టు పొంగులేటి తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా 15 ఉత్తమ వర్సిటీల్లో అమిటీ  11/12వ స్థానంలో ఉందన్నారు. 

సెయింట్‌ మేరీస్‌ రిహాబిలిటేషన్‌ యూనివర్సిటీ సైతం అన్ని రంగాల్లో నైపుణ్యాభివృద్ధికి శిక్షణ ఇవ్వనుందని చెప్పారు. సీఎం, డిప్యూటీ సీఎం, సీఎస్‌ చొరవతో ఈ వర్సిటీల్లో రాష్ట్ర విద్యార్థులకు 50 శాతం సీట్లు కేటాయించడానికి ఆ సంస్థల యాజమాన్యాలు అంగీకరించాయని తెలిపారు.  

మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాల భర్తీ 
ఈ ఏడాదిన్నర వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, వీటితో పాటు మరో 17,084 ఉద్యోగాల నియామక ప్రక్రియ వివిధ దశల్లో ఉందని పొన్నం చెప్పారు. ఇక కొత్తగా 22,033 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్లు ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని, ఈ మేరకు జాబ్‌ కేలెండర్‌ సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. వచ్చే మార్చిలోగా మొత్తం లక్ష ఉద్యోగాలను భర్తీ చేయాలని మంత్రివర్గంలో నిర్ణయించామన్నారు. ఎస్సీల వర్గీకరణ సమస్యతో నోటిఫికేషన్ల జారీలో కొంత జాప్యం జరిగిందని ఆయన వివరించారు.   

రాష్ట్రంలోని పెండింగ్‌ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన మిగులు భూసేకరణను సత్వరం పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. అనంతరం ఆ ప్రాజెక్టుల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి రైతాంగానికి నీళ్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు పొంగులేటి వెల్లడించారు.  

⇒ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీలకు మండలం యూనిట్‌గా, ఎంపీపీ, జెడ్పీటీసీలకు జిల్లా యూనిట్‌గా, జెడ్పీ చైర్మన్లకు రాష్ట్రం యూనిట్‌గా పరిగణించి బీసీ రిజర్వేషన్లు కల్పిస్తారు.  

⇒ సంగారెడ్డి జిల్లాలో ఇటీవల కొత్తగా ఏర్పడిన జిన్నారం, ఇంద్రీశం మున్సిపాలిటీల పరిధిలో చేర్చే 18 గ్రామ పంచాయతీలను డీ లిస్టింగ్‌ చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  

4 చోట్ల అత్యాధునిక గోశాలలు 
రాష్ట్రంలో అధునాతనంగా గోశాలల ఏర్పాటు, నిర్వహణపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ముగ్గురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈ కమిటీ వచ్చే కేబినేట్‌ సమావేశంలోపు తమ నివేదికను అందించాలని గడువు నిర్ణయించింది. సీఎం ఆదేశాల మేరకు పశు సంవర్థక శాఖ రూపొందించిన పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ను, కొత్తగా నిర్మించే గోశాల డిజైన్లను మంత్రివర్గ భేటీలో ప్రదర్శించారు. 

రాష్ట్రంలో 306 గోశాలలున్నాయి. కగా హైదరాబాద్‌లో ఎన్కేపల్లి, వెటర్నరీ యూనివర్సిటీ, వేములవాడ, యాదగిరిగుట్టలో అత్యాధునికంగా గోశాలలు నిర్మించాలని నిర్ణయించారు. వీటితో పాటు రాష్ట్రంలో ఉన్న గోశాలల రిజి్రస్టేషన్లు, వాటి నిర్వహణపై సమగ్ర విధాన పత్రం రూపొందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మత్స్యకార సొసైటీలకు పర్సన్‌ ఇన్‌చార్జిలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చెరువులు, కుంటల్లో 80–110 మి.మీ. సైజు గల 82 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించిన బడ్జెట్‌ను రూ.19 కోట్ల నుంచి రూ.122 కోట్లకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు.  

ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంపునకు సంస్కరణలు 
వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పనితీరును సమీక్షించేందుకు వీలుగా వారి ఆధార్, పూర్తి వివరాలు సేకరించాలని ఆర్థిక శాఖను మంత్రివర్గం ఆదేశించింది.  

⇒ ప్రభుత్వ ఉద్యోగుల హాజరుతో పాటు విధి నిర్వహణలో జవాబుదారీతనం పెంచేందుకు అవసరమైన సంస్కరణలు తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇప్పటికే ఉద్యోగులకు సంబంధించి నియమించిన అధికారుల కమిటీకి ఈ బాధ్యత అప్పగించాలని నిర్ణయించారు. రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికను సమరి్పంచాలని కమిటీని ఆదేశించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement