ఢిల్లీ నుంచే పల్లెకు నిధులా.. ఇదేం చిల్లర..?

Kcr Reviews Progress Regarding Implementation of Rural Urban Programs in State - Sakshi

కేంద్రం రాష్ట్రాలను నమ్మకపోవడం దారుణం

సీఎం కేసీఆర్‌ ఫైర్‌

 స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి.. రాష్ట్రాల విధుల్లో కేంద్రం జోక్యం సరికాదు 

ఈ తీరు వల్లే దేశంలో ఇంకా పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయి 

తాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారు 

కేంద్రం  వీటిపై దృష్టిపెట్టాలని సూచన 

జూన్‌ 3 నుంచి పల్లె/పట్టణ ప్రగతి

కలెక్టర్లు, మంత్రులతో సమీక్ష సమావేశంలో సీఎం ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: ‘‘పంచాయతీరాజ్‌ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చాక.. నాటి రాజీవ్‌గాంధీ నుంచి నేటి మోదీ వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రం నుంచే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చిల్లర వ్యవహారంగా ఉంది. జవహర్‌ రోజ్‌గార్‌ యోజన, ప్రధాని గ్రామసడక్‌ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సరికాదు. స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. ఏం అవసరం, ఏమేం చేయాలన్నది తెలుస్తుంది.

కానీ రోజువారీ కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం ఏమిటి?..’’అని సీఎం కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. 75 ఏళ్ల ఆజాదీకి అమృత్‌ మహోత్సవాలు జరుపుకొంటున్న సమయంలో కూడా.. దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయని, తాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదికి వస్తున్నారని.. కేంద్రం తీరే దీనికి కారణమని విమర్శించారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో కూడా రావాల్సినంత ప్రగతి రాలేదని.. కేంద్రం వీటిపై దృష్టి పెట్టకుండా రాష్ట్రాల విధుల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాష్ట్రంలో పల్లె/ పట్టణ ప్రగతి కార్యక్రమాలు, వరి ధాన్యం సేకరణ, పలు ఇతర అంశాలపై జిల్లా కలెక్టర్లు, మంత్రులతో ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. 

జూన్‌ 3 నుంచి ‘ప్రగతి’బాట 
ఈ నెల 20 నుంచి నిర్వహించ తలపెట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను వేసవి నేపథ్యంలో జూన్‌ 3 నుంచి 15 రోజులపాటు నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. పల్లె ప్రగతిలో ఎంపీపీలు, ఎంపీడీవోల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. 100 శాతం బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్‌) గ్రామాల సాధనకు చర్యలు తీసుకోవాలని, వైకుంఠ ధామాల నిర్మాణాన్ని వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు. దేశవ్యాప్తంగా పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలకు విశేష గుర్తింపు, ఆదరణ లభించడం పట్ల సీఎం కేసీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన ఉత్తమ గ్రామాల్లో తొలిదశలో పదికి పది గ్రామాలు, రెండో దశలో 20కి 19 గ్రామాలు తెలంగాణ నుంచే ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ శాఖను, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును సీఎం అభినందించారు.

‘‘కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై అందరి అనుమానాలను పటాపంచలు చేసి.. తెలంగాణ పల్లెలను అభివృద్ధి పథాన నడిపించుకుంటున్నాం. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేసుకొని ప్రగతి సాధిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభ దశలో తీసుకున్న నిర్ణయాలు, ఎంచుకున్న ప్రాధాన్యతా క్రమాలు కొందరికి జోక్‌ లాగా కనిపించాయి. అడవుల పరిరక్షణపై సమీక్ష నిర్వహిస్తే ఈ అడవులేంటి అని నవ్వుకున్నారు. నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో తెలంగాణ భాగస్వామ్యం అగ్రభాగాన నిలిచింది. అన్ని రంగాల్లో జరిగిన అభివృద్ధిని కొన్ని జాతీయ మీడియా ఛానళ్లు ప్రసారం చేయగా.. ఇతర రాష్ట్రాలు ఆశ్చర్యపోయాయి. నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించాం’’అని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. పంటల ఉత్పత్తి, తలసరి ఆదాయంలో ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌తోపాటు మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి దశబ్దాలుగా స్థిరపడిన రాష్ట్రాలకంటే తెలంగాణ అగ్రభాగాన నిలిచిందని చెప్పారు. 

పబ్లిక్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు 
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను హైదరాబాద్‌లోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో నిర్వహించాలని అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో నిర్వహించే వేడుకల్లో ఆయా జిల్లాల మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనాలని.. రాష్ట్ర ప్రగతిని తెలియజేస్తూ ప్రసంగాలు ఉండాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు సమగ్ర సమాచారంతో ప్రసంగాలను తయారుచేయాలని ఆదేశించారు. వేసవి నేపథ్యంలో కార్యక్రమాలను ఉదయం 9 గంటలకే ప్రారంభించి, త్వరగా ముగించాలని సూచించారు. సాయంత్రం పూట జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం నిర్వహించాలని సూచించారు. తెలంగాణ కేంద్రంగా కవితలను తీసుకురావాల్సిందిగా కవులను, రచయితలను ఆహ్వానించాలని కోరారు. 

మెరుగైన వైద్య సదుపాయాలతో.. 
రాష్ట్రంలో మొత్తం 10 వేల పడకల సామర్థ్యంతో కొత్త మల్టీ/సూపర్‌ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మించుకోనున్నామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. వరంగల్‌లో 24 అంతస్తుల్లో 38 విభాగాలతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని.. హైదరాబాద్‌లోని అల్వాల్, సనత్‌నగర్, గడ్డిఅన్నారం, గచ్చిబౌలిలలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో కలిపి 57 వేల ఆక్సిజన్‌ బెడ్లు, 550 టన్నుల ఆక్సిజన్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని రాష్ట్రం కలిగి ఉందని పేర్కొన్నారు. 

పచ్చదనంపై ప్రత్యేక శ్రద్ధ 
ప్రపంచానికి ‘గ్రీన్‌ ఫండ్‌ కాన్సెప్ట్‌’ను తెలంగాణ రాష్ట్రమే పరిచయం చేసిందని.. స్థానిక సంస్థల బడ్జెట్‌లో 10 శాతం నిధులను హరితహారానికి కేటాయించడం తప్పనిసరని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. మహబూబ్‌నగర్‌లో 2,087 ఎకరాల్లో నిర్మించిన పార్కును ఆదర్శంగా తీసుకొని.. ఇతర జిల్లాల్లో కూడా అర్బన్‌ పార్కుల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని సూచించారు. హైదరాబాద్‌కు ఓఆర్‌ఆర్‌ గ్రీన్‌ నెక్లెస్‌ వంటిదని, దాని గ్రీనరీ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. జాతీయ రహదారులకు ఇరువైపులా చెట్ల పెంపకం, మల్టీ లేయర్‌ ప్లాంటేషన్‌ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

అడవుల పునరుద్ధరణ ద్వారా కోల్పోయిన స్వర్గాన్ని మళ్లీ తెచ్చుకుందామని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నిరంతర విద్యుత్, వ్యవసాయ, సంక్షేమ పథకాలను రాష్ట్రాన్ని ఆనుకుని ఉన్న ప్రజలు అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని.. కర్ణాటకలోని రాయచూర్‌ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ పథకాలను కర్ణాటకలో అమలు చేయాలని, లేకపోతే తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని కోరుతున్నారని గుర్తు చేశారు. ఇక ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించిన సీఎం కేసీఆర్‌.. తూకం, గన్నీ బ్యాగులు, రవాణ, మిల్లుల్లో దిగుమతి తదితర అంశాలపై ఆరా తీశారు. మొత్తంగా 56 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యానికి గాను 20 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించామని అధికారులు నివేదించారు. 

సీఎం సమీక్షలో మరిన్ని ఆదేశాలివీ.. 
– ప్రతి గ్రామంలో వైకుంఠధామానికి 10 రోజుల్లోగా మిషన్‌ భగీరథ మంచినీటి కనెక్షన్‌ ఇవ్వాలి. 
– పాఠశాలలు, అంగన్‌వాడీలు, ఆస్పత్రులు తదితర ప్రజావినియోగ సంస్థల పారిశుధ్యం, తాగునీటి సరఫరా తదితర బాధ్యతలను గ్రామపంచాయతీలు నిర్వహించేలా డీపీవోలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. 
– మున్సిపల్‌ వార్డుల్లో నర్సరీలు ఏర్పాటు చేయకపోతే, దానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. ఈ నర్సరీల విషయంలో తనిఖీలను చీఫ్‌ సెక్రటరీ, ప్రిన్సిపల్‌ సెక్రటరీ, డైరెక్టర్లు కూడా పర్యవేక్షించాలి. 
– ‘దళితబంధు’పథకం కోసం ఈ ఏడాది ఒక్కో నియోజకవర్గంలో 1,500 మంది చొప్పున లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను కొనసాగించాలి. ఎంపిక పూర్తయిన తర్వాత దశలవారీగా పథకాన్ని అమలు చేయాలి.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top