కోహినూరు వజ్రం కాకతీయులదే! | Kakatiya heritage falls into the hands of Queen Victoria | Sakshi
Sakshi News home page

కోహినూరు వజ్రం కాకతీయులదే!

Jun 20 2025 2:59 AM | Updated on Jun 21 2025 12:34 PM

Kakatiya heritage falls into the hands of Queen Victoria

ఓరుగల్లు నుంచి బ్రిటన్‌కు పయనం

గణపతిదేవ చక్రవర్తి మొదటి యజమాని 

కాకతీయుల వారసత్వ సంపద క్వీన్‌ విక్టోరియా చేతికి

నాదిర్‌షా పెట్టిన పేరే కోహినూర్‌ (కాంతి పర్వతం) 

వజ్రానికి పుట్టిల్లు కృష్ణానది తీరం కొల్లూరు  

ఖిలా వరంగల్‌: కాకతీయుల పాలన స్వర్ణయుగం అంటారు. ఓరుగల్లును రాజధానిగా చేసుకుని గణపతిదేవ చక్రవర్తి 1199 నుంచి 1262 వరకు సుదీర్ఘకాలం పరిపాలించాడు. కళింగ, వేంగి రాజవంశమైన తూర్పు గంగాల నుంచి 13వ శతాబ్దంలో కోహినూరు వజ్రం కాకతీయుల చెంతకు చేరింది. వారికి అత్యంత విలువైన ఆస్తులలో ఒకటిగా నిలిచింది. రాణిరుద్రమదేవి తన తండ్రి నుంచి కోహినూరును వారసత్వంగా పొందింది. 

ఆమె దానిని తొలుత భద్రకాళి దేవికి అలంకరణ కోసం అంకితం చేయగా.. ఆ తర్వాత కాకతీయులు ఆ వజ్రాన్ని రాజధాని పరిపాలనా భవనంలో ఉంచి తమ శక్తి ప్రతిష్టకు ప్రతీకగా ఉపయోగించారు. కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1310లో ఢిల్లీ సుల్తాన్‌ పంపిన మాలిక్‌కాపుర్‌తో సంధి చేసుకుని అపారమైన సంపదతోపాటు కోహినూరు వజ్రాన్ని సమర్పించారు. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు, ప్రస్తుతం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం కొల్లూరు గనులలో ఓ వితంతువుకు ఆ వజ్రం దొరికిందని, గ్రామ పెద్ద ద్వారా గణపతిదేవ చక్రవర్తి కోహినూరు వజ్రాన్ని బహుమతిగా అందుకొని మొదటి యజమాని అయ్యారని ఓ కథనం. అతడు కాకతీయుల ఆరాధ్య దైవమైన శ్రీభద్రకాళి, తర్వాత కాకతీదేవి విగ్రహానికి నుదుటన అలంకరించి ఆరా«ధన చేశారని చరిత్ర చెబుతోంది.  

విలువైన వజ్రం.. 
ప్రపంచంలోనే విలువైన వజ్రాల్లో కోహినూరు ఒకటి. కోహినూరు వజ్రం కోసం చరిత్రలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. కోహినూరు వజ్రం చరిత్ర చుట్టూ కూడా ఎన్నో వివాదాలు ఉన్నాయి. అయితే, భారత్‌లోని తెలుగు నేలపై దొరికిన ఈ వజ్రం ఎన్నో రాజవంశాల చేతులు మారింది. చివరకు భారత్‌ నుంచి బ్రిటన్‌ చేరుకుంది. అక్కడి రాజకుటుంబానికి వారసత్వ సంపదగా మారింది. కోహినూరు వజ్రాన్ని తిరిగి భారత్‌కు అప్పగించాలని భారత ప్రభుత్వం గట్టిగా డిమాండ్‌ చేసింది. అలాంటి కోహినూరు వజ్రం తెలుగు నేలపై ఎక్కడ దొరికింది, ఇది బ్రిటన్‌ ఎలా చేరింది వంటి వివరాలను ఒకసారి తెలుసుకుందాం..! 

తెలుగు నేలపై .. 
వివాదాస్పద చరిత్ర కలిగిన కోహినూరు వజ్రం మూలాలు మిస్టరీగానే ఉన్నాయి. కోహినూరు వజ్రం సృష్టి.. దాని ప్రారంభ చరిత్ర చుట్టూ అనేక కథనాలు ఉన్నాయి. కోహినూరు అనేది పర్షియన్‌ పదం.. భాషా పరంగా కోహ్‌–ఇ–నూర్‌ అని రాయబడింది. దాని అర్థం కాంతి పర్వతం. కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడికి ఆంధ్రప్రదేశ్‌లోని నేటి గుంటూరు జిల్లా కొల్లూరు గనిలో లభించిన కోహినూర్‌ వజ్రం బహుమతిగా లభించింది. 

 

కాకతీయుల నుంచి ఖిల్జీ చేతికి.. 
చాలా మంది చరిత్రకారుల ప్రకారం కోహినూర్‌ వజ్రం కాకతీయ రాజవంశం పాలనలో కాకతీయుల ఆరాధ్యదైవమైన కాకతీమాత దేవతకు కన్నుగా ప్రతిష్టించబడింది. 14వ శతాబ్దం ప్రారంభంలో టర్కిక్‌ ఖిల్జీ రాజవంశం సైన్యం దోపిడీ కోసం దక్షిణ భారతదేశ రాజ్యాలపై దాడి చేయడం ప్రారంభించింది. 1310లో అల్లావుద్దీన్‌ ఖిల్జీ తన జనరల్‌ మాలిక్‌ కాపుర్‌ వరంగల్‌పై దాడి చేయగా.. ప్రతాపరుద్రుడు అపార సంపదతోపాటు కోహినూరు వజ్రాన్ని అప్పగించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.  

దీనికి మరో కథనం .. 
ప్రతాపరుద్రుడి పాలనలో కోహినూరు వజ్రం గోల్కొండ కోటలో ఉండేది. అయితే కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుడు క్రీస్తుశకం 1310లో ఢిల్లీ సుల్తాన్‌ అల్లావుద్దీన్‌ ఖిల్జీ పంపిన మాలిక్‌ కాపుర్‌తో సంధి చేసుకుని అపారమైన సంపదతోపాటు కోహినూర్‌ వజ్రాన్ని వారికి సమర్పించారు. అయితే ఆతర్వాత కోహినూరు వజ్రం .. ఒక రాజవంశం నుంచి మరొక రాజవంశానికి చేరి చివరకు మొఘల్‌లకు చేరింది. అక్కడ నుంచి వజ్రం ఎలా చేతులు మారిందనేది చాలా స్పష్టంగా ఉంది. 

అలా ఢిల్లీ చేరిన వజ్రం పలు రాజవంశాల చేతులు మారుతూ ఇబ్రహీం లోడి చేతికి చేరింది. మొదటి పానిపట్టు యుద్ధంలో మొఘల్‌ రాజవంశ స్థాపకుడైన బాబర్‌ చేతిలో ఇబ్రహీంలోడి ఓటమి పాలై మరణించిన తర్వాత మొదటి మొఘల్‌ పాలకుడు బాబర్‌ కోహినూరును స్వాదీనం చేసుకున్నాడు. కోహినూరు వజ్రం సింహాసనం పైభాగంలో మెరిసే రత్నపు నెమలి తలపై ఉంచారు.  

మొఘల్‌ నుంచి పర్షియన్‌ చేతికి.. 
1739లో పర్షియన్‌ పాలకుడు నాదిర్‌షా మొఘల్‌ సామ్రాజ్యంపై దండెత్తి ..వారిని ఓడించాడు. అప్పుడు ఢిల్లీని దోచుకున్నాడు. ఢిల్లీ సుల్తానులు, మొఘల్‌ చక్రవర్తులు శతాబ్దాలుగా పోగు చేసిన అపారమైన సంపదను తన వశం చేసుకున్నాడు. తనతో కోహినూరు వజ్రాన్ని కూడా తీసుకువెళ్లాడు. నాదిర్‌షా ఆవజ్రాన్ని చూడగానే .. కోహ్‌–ఇ–నూర్‌ అని నామకరణం చేశారు. అప్పటి నుంచి ఆ వజ్రానికి కోహినూరు అనే పేరు వచ్చింది.  

అఫ్గాన్‌ నుంచి సిక్కుపాలకులు.. 
నాదిర్‌షా నుంచి కోహినూరు వజ్రం అహ్మద్‌ ఖాన్‌ అబ్దాలీతో ప్రస్తుత అఫ్గానిస్తాన్‌ (1747–1856)లోని దుర్రానీ రాజు చేతికి చేరుకుంది. అతను షా యొక్క కమాండర్‌. అనంతరం పర్షియన్లతో విడిపోయాడు. తన అదీనంలో ఉన్న కోహినూర్‌తో అతను 1747తో అఫ్గాన్‌ ప్రజలందరికీ పాలకుడిగా పట్టాభిషిక్తుడయ్యాడు. అహ్మద్‌ షా అబ్దాలీ పేరును స్వీకరించాడు. అతను 1747లో మొదటి ఆధునిక అఫ్ఘన్‌ రాజ్యాన్ని స్థాపించాడు. వజ్రం దాదాపు ఏడు దశాబ్దాల పాటు అక్కడే ఉంది. 

1813లో అబ్దాలీ బహిష్కరించబడిన వారసుడు షా షుజా.. ఆశ్రయం కోసం కోహినూరును సిక్కు పాలకుడు మహారాజా రంజిత్‌సింగ్‌కు అప్పగించారు. దీంతో కోహినూరు వజ్రం భారత దేశానికి తిరిగి వచ్చింది. ఈ సమయంలోనే కోహినూరు వజ్రం అంచనా విలువ బ్రిటిష్‌ వారిని ఆకర్షించింది. 1849లో రెండో ఆంగ్లో సిక్కు యుద్ధంలో సిక్కు ఓటమి తర్వాత రంజిత్‌సింగ్‌ వారసుడు దులీప్‌ సింగ్‌ యుద్ధ ఒప్పందంలో భాగంగా కోహినూరును బ్రిటిష్‌ వారికి అప్పగించారు.  

1851లో లండన్‌కు.. 
కోహినూర్‌ సిక్కుల చేతి నుంచి బ్రిటిష్‌ చేతిలోకి వెళ్లింది. 1851లో కోహినూరు లండన్‌లోని గ్రేట్‌ ఎగ్జిబిషన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఆ ప్రదర్శన తర్వాత దాని రూపాన్ని మెరుగుపరచడానికి రాయిని కత్తిరించి పాలిష్‌ చేశారు. కోహినూరును కత్తిరించి పాలిష్‌ చేసిన తర్వాత అది కిరీట ఆభరణాల్లో భాగమైంది. క్వీన్‌ విక్టోరియా దీనిని గౌన్‌కు కుడివైపున బ్రోచ్‌గా (వజ్రం) ధరించారు. 

ఆతర్వాత సంవత్సరంలో కోహినూరు వజ్రం.. రాజకుటుంబీకుల కిరీటాల్లో కూడా కనిపించింది. ఈ వజ్రాన్ని రాజకుటుంబం తమ ఇంటి పెద్ద కోడలికి వారసత్వంగా అందజేశారు. ప్రపంచంలో అత్యంత విలువైన కోహినూరు వజ్రాన్ని తిరిగి ఇవ్వాల్సిందిగా బ్రిటన్‌ను భారత ప్రభుత్వం చాలాసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం కనిపించలేదని చరిత్ర చెబుతోంది.  

Advertisement
 
Advertisement
Advertisement