
జూబ్లీహిల్స్ క్లబ్ జీఎంకు బెదిరింపులు
క్లబ్ మాజీ సభ్యుడిపై కేసు నమోదు
బంజారాహిల్స్: ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మా గల్లీలోనే ఉంటాడు..మీ అంతుచూస్తా..రివాల్వర్ తెచ్చి కాల్చి పడేస్తా..’ అంటూ ఫోన్‌లో బెదిరించడమే కాకుండా ముఖ్యమంత్రి ఇంటి నుంచి మాట్లాడుతున్నానంటూ ఫోన్ చేసి హెచ్చరించిన ఘటనలో ఓ వ్యక్తిపై జూబ్లీహిల్స్ క్రిమినల్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ (జూబ్లీహిల్స్ క్లబ్)లో సభ్యుడిగా ఉన్న జ్యోతిప్రసాద్ కొసరాజును ప్రవర్తన సరిగాలేని కారణంగా గత మార్చి 12వ తేదీన క్లబ్ సభ్యత్వం నుంచి తొలగించారు. ఈ వ్యవహారం కోర్టు దాకా వెళ్లగా ప్రస్తుతం విచారణ దశలో పెండింగ్‌లో ఉంది.
జూన్ 23వ తేదీన సాయంత్రం జ్యోతిప్రసాద్ జూబ్లీహిల్స్ క్లబ్ జనరల్ మేనేజర్ జగదీశ్వర్‌రెడ్డికి ఫోన్ చేసి తాను క్లబ్‌కు వస్తున్నానని, తప్పనిసరిగా లోపలికి అనుమతించాలని బెదిరించాడు. అయితే క్లబ్ నిబంధనల ప్రకారం సస్పెన్షన్‌కు గురైన సభ్యుడిని లోనికి అనుమతించడం కుదరదని చెప్పాడు. దీంతో కొద్దిసేపటి తర్వాత జ్యోతిప్రసాద్ క్లబ్ వద్దకు వచ్చి సెక్యూరిటీగార్డ్‌లను బెదిరిస్తూ..కేకలు వేస్తూ జీఎం జగదీశ్వర్‌రెడ్డిని అసభ్య పదజాలంతో దూషించాడు. అంతుచూస్తానంటూ బెదిరించాడు. రివాల్వర్‌తో కాల్చిపడేస్తానంటూ హెచ్చరించాడు. తాను సీఎం రేవంత్‌రెడ్డి నివాసం ఉండే గల్లీలోనే ఉంటానని మరింతగా బెదరగొట్టాడు.
అంతేకాకుండా అదేరోజు సాయంత్రం 6.54 గంటల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నామని, జ్యోతిప్రసాద్‌కు క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫోన్ చేశారు. తరచూ సీఎం ఇంటి నుంచి ఫోన్ చేస్తున్నామంటూ జీఎంకు కాల్స్ వచ్చాయి. ఇవన్నీ జీఎం కాల్ రికార్డ్ చేశారు. సరిగ్గా 20 నిమిషాల తర్వాత స్వయంగా జ్యోతిప్రసాద్ ఫోన్ చేసి తనను క్లబ్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని, సీఎం ఇంటి నుంచి ఫోన్ వచ్చింది కదా? అంటూ చెప్పాడు.
అంతకుముందు చేసిన ఫోన్ కాల్స్ వాయిస్‌తో పాటు జ్యోతిప్రసాద్ వాయిస్ కూడా ఒక్కటే కావడంతో సీఎం ఇంటిని వాడుకుని దురుద్దేశపూర్వకంగా తమను బెదిరించిన వ్యవహారంలో నిందితుడిపై కేసు నమోదు చేయాల్సిందిగా జీఎం ఫిర్యాదు చేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు క్లబ్ మాజీ సభ్యుడు జ్యోతిప్రసాద్ కొసరాజుపై బీఎన్‌ఎస్ సెక్షన్ 351 (2) కింద కేçసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.